Gangula Kamalakar | ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణ విధాత బ్యూరో, కరీంనగర్: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. ఫెమా నిబంధన ఉల్లంఘనకు గాను తాజాగా నోటీసులు జారీ చేసింది. మంత్రి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నడుస్తున్న శ్వేత గ్రానైట్స్ లో అవకతవకలను ఈడీ గుర్తించింది. గత ఏడాది నవంబర్ లో శ్వేత ఏజెన్సీలో సోదాలు కూడా నిర్వహించింది. చైనాకు గ్రానైట్ […]

Gangula Kamalakar |

  • ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణ

విధాత బ్యూరో, కరీంనగర్: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. ఫెమా నిబంధన ఉల్లంఘనకు గాను తాజాగా నోటీసులు జారీ చేసింది. మంత్రి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నడుస్తున్న శ్వేత గ్రానైట్స్ లో అవకతవకలను ఈడీ గుర్తించింది.

గత ఏడాది నవంబర్ లో శ్వేత ఏజెన్సీలో సోదాలు కూడా నిర్వహించింది. చైనాకు గ్రానైట్ ఎగుమతిలో అక్రమాలు జరిగినట్టు ఈడీ ఈ సోదాల్లో తేల్చింది. విజిలెన్స్ నివేదిక ప్రకారం 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ అక్రమంగా తరలించినట్టు నిర్ధారించింది.

గ్రానైట్ ఎగుమతుల ద్వారా శ్వేత ఏజెన్సీ ఫెమా నిబంధనల్లో రూ.4.8 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. ప్రభుత్వానికి కట్టాల్సిన రూ.50 కోట్ల పన్నులు పెండింగ్ లో ఉండగా, శ్వేత ఏజెన్సీ కేవలం రూ.3 కోట్లు మాత్రమే చెల్లించి, చేతులు దులుపుకున్నట్టు గుర్తించింది. మరోవైపు హవాలా మార్గంలో నగదు బదిలీ జరిగినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది.

2011-13 మధ్య కోట్ల లావాదేవీలు

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల నుంచి 2011-13 సంవత్సరాల మధ్య కోట్ల రూపాయల గ్రానైట్ ఎగుమతులు జరిగాయి. షిప్పింగ్ ఏజెన్సీలు తప్పుడు లెక్కలతో వందలకోట్ల మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.

వీటిని పరిగణలోకి తీసుకున్న విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి రూ.750 కోట్లు చెల్లించాలని గ్రానైట్ ఏజెన్సీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే బీజేపీకి చెందిన కరీంనగర్ లోకసభ సభ్యుడు బండి సంజయ్ కుమార్, మరో నేత బేతి మహేందర్ రెడ్డి గ్రానైట్ అక్రమాలపై విచారణ జరపాలని సీబీఐకి ఫిర్యాదు చేశారు.

2022 నవంబర్ లో..

మంత్రి గంగుల కమలాకర్ విదేశాల్లో ఉండగా 2022 నవంబర్ లో ఈడీ, ఐటీ అధికారులు ఆయన ఇల్లు, గ్రానైట్ కంపెనీలపై సోదాలు నిర్వహించారు. గంగులకు సమాచారం ఇచ్చిన అధికారులు ఆయన ఇంటి తాళాలు పగుల కొట్టి ఈ సోదాలు నిర్వహించడం గమనార్హం.

Updated On 5 Sep 2023 9:36 AM GMT
somu

somu

Next Story