- టీవీలకు అతుక్కుపోయిన జనం
విధాత: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యవహారంపై ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి జనాల్లో సర్వత్ర ఆసక్తి ఉత్కంఠ కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ప్రజలు టీవీలకు అతుక్కుపోవడం.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కవిత విచారణకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవడం పట్ల ఆసక్తి ప్రదర్శించారు. ప్రపంచ స్థాయి క్రీడా పోటీల పట్లనో, లేక ప్రపంచ స్థాయిలో చోటు చేసుకునే రాజకీయ, ప్రకృతి, వైపరీత్యాలు వంటి అంశాల పైనో చూపినట్లుగా ప్రజలు కవిత విచారణ వ్యవహారంపై కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.
కవిత, సీఎం కేసీఆర్ (CM KCR) కూతురు కావడం, కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీతో జాతీయస్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi)ని, బీజేపీని ఢీకొడుతున్న పరిణామాలు అన్ని కవిత కేసు పట్ల జనాల్లో క్రేజీని పెంచేశాయి. ముఖ్యంగా కవితని ఈడీ అరెస్ట్ చేస్తుందా లేదా.. కౌంటర్‌గా కేసీఆర్, కేటీఆర్ లు ఏం చేస్తున్నారన్న అంశాలపైన ఎక్కువగా ప్రజల్లో చర్చలు సాగుతున్నాయి. కవితని ఎన్ని గంటలు విచారిస్తారు.. కేసులోని మిగతా నిందితులతో కలిసి విచారిస్తారా, విచారణ పిదప కవితను అరెస్టు చేస్తారా లేదా అన్న అంశాలపై ఏ నలుగురు కలిసినా చర్చించుకోవడం కనిపించింది.
పెళ్లిళ్లు వంటి సామూహిక కార్యక్రమాల్లో సైతం కవిత కేసు వ్యవహారం చర్చలు వినిపించాయి. సందట్లో సడేమియా గా ఇంకొందరైతే ఈడి విచారణ లో భాగంగా కవితను అరెస్ట్ చేస్తారా లేదా అన్న అంశాలపై బెట్టింగ్ లకు తెర లేపారు. గతంలో ఎన్నికల ఫలితాల పైనో, ప్రపంచ క్రీడా పోటీల ఫలితాల పైనో, ఎడ్ల పందాలు, కోళ్ల పందాల పైనో సాగిన బెట్టింగ్‌ల దందా కాస్తా కొత్త పంథాను తీసుకున్నట్లుగా కవిత విచారణ, అరెస్టుల అంశాల ఆధారంగా సాగడం ఈ వ్యవహారం పై జనంలో నెలకొన్న అటెన్షన్ కు నిదర్శనంగా నిలిచింది.