- మహిళా ఉపాధ్యాయినిల సన్మానోత్సవంలో మంత్రి జగదీష్ రెడ్డి
విధాత: ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి, భవిష్యత్ సాధ్యమని నమ్మిన గొప్ప ఉద్యమకారిణి సావిత్రి భాయి పూలే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట లోని మంత్రి క్యాంపు కార్యాలయం ఆవరణలో తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేష్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన సావిత్రి భాయి పూలే జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందజేసిన మోడల్ స్కూల్ మహిళా ఉపాధ్యాయినిలకు అవార్డులు అందజేశారు.
అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడుతూ స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రి భాయ్ పూలే అని కొనియాడారు. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి అన్నారు.
సావిత్రి భాయి ఆశయాలకు అనుగుణంగా ప్రతీ ఒక్క మహిళా ఉపాధ్యాయిని కృషి చేయాలని కోరారు. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రి భాయి తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించిందన్నారు.
కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారని గుర్తు చేశారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేశారని కొనియాడారు.
ఆమె ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరం పాటు పడాలని మంత్రి పిలుపు నిచ్చారు. అనంతరం మహిళా ఉపాధ్యాయిని లతో కలిసి మంత్రి సహఫంక్తి భోజనం చేశారు.
కార్యక్రమం లో కోదాడ శాసన సభ్యుడు బొల్లం మల్లయ్య యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ , జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, జాజీరెడ్డి గూడెం జడ్పీటిసి వీర ప్రసాద్, టీచర్స్ యూనియన్ నేతలు , ఉపాధ్యాయులు పాల్గోన్నారు.