- రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల తలంబ్రాలు, పట్టు బట్టలు సమర్పించడం ఆనవాయితీ
- పాంచ నరసింహుడిని దర్శించి సేవించిన పలువురు రాజులు
- యాదగిరీశుడిని దర్శించుకున్న దేశ ప్రథమ పౌరులు, ముఖ్యమంత్రులు
విధాత: లోకపాలకుడైన యాదాద్రి లక్ష్మీ నరసింహుడి కల్యాణోత్సవానికి ఏడుకొండల వెంకన్న స్వామి పట్టు వస్త్రాలు పంపించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల తరపున ముఖ్యమంత్రులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం క్షేత్ర ఔన్నత్యాన్ని, కళ్యాణ విశిష్టతను చాటుతుంది.
స్వామివారిని సేవించి కొలిచిన పలువురు రాజులు…
క్రీస్తు శకం 1148లో పశ్చిమ చాళుక్య రాజు త్రిభువన మల్లుడు భువనగిరి కోట కేంద్రంగా రాజ పాలన సాగిస్తూ పంచనరసింహుడిని సేవించారు. 13వ ,15వ శతాబ్దాల్లో కాకతీయ రాజు గణపతి దేవుడు, కృష్ణదేవరాయలు స్వామివారిని దర్శించుకున్నట్లుగా కొలనుపాక జగద్దేవ నారాయణ ఆలయ శాసన ప్రసిద్ధి. 1952లో హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తదుపరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి నరసింహ స్వామిని దర్శించుకున్నారు.
పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందించే సంప్రదాయం..
నైజాం ప్రభుత్వం నుంచే ధర్మకర్తల మండలి కొనసాగుతుంది. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా యాదాద్రి లక్ష్మీ నరసింహ కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందించే సంప్రదాయం ఆరంభించారు. ఎన్టీ రామారావు దంపతులు సైతం 1994లో ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ కర్త, సీఎం కేసీఆర్ సైతం కళ్యాణోత్సవానికి హాజరై పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందించే ఆనవాయితీ కొనసాగిస్తున్నారు.
Yadadri | మహిమాన్వితం యాదగిరి గుట్ట క్షేత్రం.. నరసింహస్వామి ఆలయం చరిత్ర-విశేషాలు
తిరుపతి వెంకన్న పంపించే పట్టు వస్త్రాలు..
ప్రతిఏటా సప్తగిరీషుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర దేవస్థానం పక్షాన యాదగిరీషుడైన లక్ష్మీనరసింహులకు బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే కళ్యాణోత్సవానికి పట్టువస్త్రాలు అందించడం ఆనవాయితీగా వస్తుంది. తిరుపతి వెంకన్న పంపించిన వస్త్రాలను టీటీడీ అధికారులు ప్రత్యేక పూజలతో యాదగిరిగుట్ట అర్చకులకు, అధికారులకు అందిస్తారు.
దేవాదాయ శాఖ పరిధిలోకి యాదగిరి క్షేత్రం..
కళ్యాణోత్సవంలో స్వామి అమ్మవార్లకు పోచంపల్లి చేనేత పట్టు వస్త్రాలను ప్రత్యేకంగా మగ్గంపై నేసి అందిస్తారు. యాదగిరిగుట్ట క్షేత్రం 1969లో దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లాక నిత్య కళ్యాణోత్సవాలు, నిత్య పూజలు, కైంకర్యాలతో స్వామివారికి సేవలందిస్తున్నారు. ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేష ప్రాచుర్యం పొందాయి.
Yadadri Brahmotsavam | బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన యాదాద్రి లక్ష్మీనరసింహ క్షేత్రం
33ఏళ్లుగా నిత్యాన్నదానం..
1890 -1900 నుండి గుట్టపై ధార్మిక సంగీత సాహిత్య మహాసభలు సాగుతూ ఉండడం విశేషం. కొండపైన 33 ఏళ్లుగా భక్తులకు నిత్యాన్నదానం కొనసాగుతుంది. యాదాద్రి కొండపైకి చేరుకునేందుకు 1952లో నిర్మించిన ఘాట్ రోడ్డుకు అదనంగా 2018లో రెండో ఘాట్ రోడ్డును ప్రారంభించారు.
స్వామి వారి చెంతకు పలువురు ప్రముఖులు..
ప్రముఖులెందరో లక్ష్మీనరసింహున్ని సేవించగా 1956 జూలైలో భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్, 1963లో ద్వితీయ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వామి వారిని దర్శించుకున్నారు. 1995లో రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయల్ శర్మ కొండపై స్వామి అమ్మవార్లకు కుంకుమార్చన నిర్వహించారు. 2015 జూలై 5న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, 2022 డిసెంబర్ 30వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. పలు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, గవర్నర్లు పంచ నర్సింహున్ని దర్శించుకొని సేవించుకున్నారు. 2023 జనవరి 18న తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు కేసీఆర్, అరవింద కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవులు దర్శించుకున్నారు.