కిట‌కిట‌లాడిన భ‌క్తులు… పొద్దంతా బోనాల సందడి దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు విధాత, మెదక్ బ్యూరో: ఏడుపాయల జాతరలో 2వ రోజు బండ్లు, బోనాలు తీసే కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. జాత‌ర ప‌రిస‌రాలు భ‌క్తులతో కిట‌కిట‌లాడాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పొద్దంతా బోనాల సందడి, డప్పుల మోతలు, శివసత్తుల సిగాలు, పోతరాజుల నృత్యాలతో ఏడుపాయల ప్రాంగణంలో తెలంగాణ […]

  • కిట‌కిట‌లాడిన భ‌క్తులు…
  • పొద్దంతా బోనాల సందడి
  • దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి
  • మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

విధాత, మెదక్ బ్యూరో: ఏడుపాయల జాతరలో 2వ రోజు బండ్లు, బోనాలు తీసే కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. జాత‌ర ప‌రిస‌రాలు భ‌క్తులతో కిట‌కిట‌లాడాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

పొద్దంతా బోనాల సందడి, డప్పుల మోతలు, శివసత్తుల సిగాలు, పోతరాజుల నృత్యాలతో ఏడుపాయల ప్రాంగణంలో తెలంగాణ సంస్కృతి ఉట్టి పడింది. సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళా ప్రదర్శనలో నృత్యాలు భక్తులను అలరించాయి. దూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా జాతరకు వచ్చిన వారు అక్క‌డే మేకలు, కోళ్లు కోసుకొని దావత్ చేసుకున్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వనదుర్గా, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు భవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఘనంగా ఎడ్ల బండ్ల‌ ఊరేగింపు..

డప్పుల దరువులు… హుషారుగా యువకుల నృత్యాలు… జై బోలో దుర్గా భవానీ మాతాకీ అంటూ భక్తుల నినాదాలు మధ్య బుధవారం సాయంత్రం ఏడుపాయల జాతరలో ప్రధాన ఘట్టమైన బండ్ల ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. ఆనవాయితీ ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండి ముందు ఏడుపాయల ఆలయ ఈవో శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి బండ్ల ఊరేగింపును ప్రారంభించారు.

చూడ‌ముచ్చ‌ట‌గా అలంక‌ర‌ణ‌

పాపన్నపేట, టేక్మాల్, ఆల్లాదుర్గం, కొల్చారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎడ్ల, గుమ్మటాల బండ్లు పెద్దసంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నాయి. బండ్లను రంగురంగుల చీరలు, మామిడి తోరణాలు, వేపకొమ్మలతో అలంకరించగా, బంగారు రంగు మెరుపు కాగితాలు, దేవుళ్ల ఫొటోలతో అలంకరించిన గుమ్మటాల బండ్లు ఆకట్టుకున్నాయి.

పోలీసులు బందోబ‌స్తు

నాగ్సాన్ పల్లి నుంచి ప్రారంభమైన బండ్ల ఊరేగింపు ఏడుపాయల్లోని మెయిన్‌‌ రోడ్డు మీదుగా రాజగోపురం ముందు నుంచి సాగింది. బండ్ల ఊరేగింపును తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో జాతర ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated On 19 Feb 2023 4:39 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story