Saturday, January 28, 2023
More
  Homelatestఏడుపాయల.. జాత‌ర‌కు అంతా సిద్ధం

  ఏడుపాయల.. జాత‌ర‌కు అంతా సిద్ధం

  • తెలంగాణలో రెండో అతిపెద్ద దేవాలయంగా ప్ర‌సిద్ధి
  • సుమారు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా
  • వనదుర్గ ప్రాజెక్టు నుండి చెక్ డ్యాంకు నీటి విడుదల
  • జాతరకు చామండేశ్వరీ, కుడవెల్లి రామలింగేశ్వర ఆలయాల ముస్తాబు

  విధాత, మెదక్ బ్యూరో: తెలంగాణలోని రెండో అతిపెద్ద దేవాలయమైన‌ ఏడుపాయల వనదుర్గ మాత ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఈనెల 21న మాఘ అమావాస్య సంద‌ర్భంగా జరిగే జాతర కోసం ఏడుపాయల పాలకవర్గం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న‌ది.

  ఉమ్మడి జిల్లాలో మంజీరా నది ఒడ్డున వెలిసిన చిట్కుల్ చాముండేశ్వరి దేవాలయం, సిద్దిపేట జిల్లాలోని కుడవెల్లి ఆల‌యం మాఘ‌ అమావాస్య జాతరకు ముస్తాబ‌య్యాయి. జాతరకు అధికార యంత్రాంగం, ఆలయ‌ పాలక వర్గాలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

  మాఘ స్నానాలు ఆచరించడానికి ఏడుపాయలకు ఈ సంవత్సరం సుమారు లక్ష మంది భక్తులు విచ్చేస్తారని ఏడుపాయల అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సంఖ్యకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల సింగూరు ప్రాజెక్టు నుండి వనదుర్గ ప్రాజెక్టుకు పంటల కోసం నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. మాఘ అమావాస్యను పురస్కరించుకొని ఏడుపాయలలో పుణ్యస్నానాలు చేసే భక్తుల కోసం గురువారం ఉదయం నిజాంసాగర్ వైపు వెళ్లే గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. దీంతో చెక్ డ్యామ్ లోకి నీరు ప్రవహిస్తుంది. చెక్ డ్యాం నిండగానే దీంట్లో భక్తులు మాఘ‌ స్నానాలు చేస్తారు.

  అంతేకాకుండా భక్తులు నీటి ప్రమాదాల బారిన పడకుండా షవర్లను సైతం సంబంధిత అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

  నారాయణఖేడ్, జహీరాబాద్, బొడ్మెట్పల్లి తదితర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం నాగసానిపల్లి వైపు చెలిమెలకుంట వద్ద ఏర్పాటు చేశారు. నర్సాపూర్, హైదరాబాద్, బాలానగర్, సంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం టేకుల గడ్డ ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఏడుపాయల ఆలయం ముందు భక్తుల కోసం క్యూ లైన్ ల ఏర్పాట్లు సైతం ముమ్మరంగా కొన సాగుతున్నాయి.

  నదీ స్నానంతో పుణ్యం..

  మాఘ‌ అమావాస్య రోజు నది స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఏడుపాయలకు అమావాస్య రోజు పుణ్య స్థానాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఏడుపాయలలో స్వయంభు వన దుర్గ భవానీ మాత ఆలయం ఉండడమే కాకుండా ఇక్కడ జనమేజయ మహారాజు సర్పయాగం చేశాడన్న ప్రశస్థి ఉంది. అంతే కాకుండా ఇక్కడ మంజీరా నది ఏడుపాయలుగా చీలి ప్రవహించడం గొప్ప విశేషం.

  దీనికి తోడు మంజీరానది మహారాష్ట్రలోని బాల్ గాట్ కొండల్లో పుట్టి 724 కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ ఏడుపాయల మీదుగా వెళుతూ గోదావరి నదిలో కలుస్తుంది. కొండలు, కోనలు, అడవులు పర్వతాల వెంట ప్రవహించడం మూలంగా ఈ నది ఎంతో విలువైన వనమూలికలను త‌న‌లో ఐక్యం చేసుకుంటూ ముందుకు సాగుతుంది.

  ఇలా ఎన్నో రకాల వనమూలికలతో ప్ర‌వ‌హిస్తుండ‌డం వ‌ల్ల ఈ నది నీటిలో స్నానాలు ఆచరిస్తే ఆయురారోగ్యాలు ల‌భిస్తాయ‌ని భక్తుల విశ్వాసం. అందుకే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఏడుపాయలలోని మంజీర నదిలో పుణ్య స్థానాలు చేసి అనంత‌రం దుర్గామాతను దర్శించుకొని త‌రిస్తారు.

  ఎమ్మెల్యే దేవేందర్ రెడ్డికి ఆహ్వానం…

  ఈనెల 21న మాఘ‌ అమావాస్యను పురస్కరించుకొని ఏడుపాయలలో జరిగే ఉత్సవాలకు హాజరు కావలసిందిగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి ఆలయ సిబ్బంది ఆహ్వానం ప‌లికింది. ఈ మేరకు ఏడుపాయల చైర్మన్ బాల గౌడ్, ఆలయ ఈవో సారా శ్రీనివాస్ గురువారం ఎమ్మెల్యేను కలిశారు.

  ఆలయాలకు.. మాఘ అమావాస్య శోభ..

  ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆలయాలకు మాఘ అమావాస్య శోభ సంతరించుకొంది. చిట్కుల్ చాముండేశ్వరి ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ సమీపంలోని మంజీరా నదిలో పుణ్య స్థానాలు ఆచరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు.పెద్ద శంకరంపేట మండలం కొప్పల్ సంగమేశ్వర ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఆలయ సమీపంలోని కోనేటిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

  కుడవెల్లిలో…

  మూడు వాగుల కలయిక కుడవెల్లి. ఇక్కడ మాఘ స్నానాలు చేయడం భక్తుల ఎంతో పవిత్రంగా భావిస్తారు. అదే రోజు ఆలయంలో దేవుని ఉత్సవం దేవుడు ఊరేగింపుతో వైభవంగా ప్రారంభం కానున్నది. శనివారం మాఘమాసం పురస్కరించుకొని కుడవెల్లిలో భక్తులు పవిత్ర పుణ్య స్నానాలు ఆచరిస్తారు.

  తూర్పు నుంచి పెద్దవాగు.. పడమర నుంచి చిన్నవాగు.. మధ్య వాగులతో అనుసంధానంగా కలవడం మూలంగా ఏర్పడిన కుడ‌వెల్లి వాగు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ జాతరను పుర‌స్క‌రించుకొని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏర్పాట్లను ముందు నుంచే పర్యవేక్షిస్తున్నారు.

  ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవ‌డ‌మే కాకుండా పాలకవర్గాన్ని, ప్రాధికారులను సమన్వయం చేస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు. వాగులో స్నానాలు ఆచరించే సమయంలో ప్రమాదం సంభవించకుండా గజ ఈతగాళ్ల‌ను సైతం నది సమీపంలో ఉంచుతున్నారు.

  ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల‌ నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. రైతులు ఇంటిల్లి పాదితో 2 రోజుల ముందు నుండే ఎడ్ల బండ్లలో వచ్చి వాగు ఒడ్డున ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular