Wednesday, December 7, 2022
More
  Homehealthగుడ్డు ఎప్పుడైనా వెరీ గుడ్డే!

  గుడ్డు ఎప్పుడైనా వెరీ గుడ్డే!

  విధాత‌: సండే అయినా మండే అయినా రోజూ తినాలి గుడ్డు అని నినాదం మనకు తెలిసిందే. ఇప్పుడంతా కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రొటీన్ పెంచి తినడం గురించి ఎక్కువ ప్రచారం జరుగుతోంది. అలా ప్రొటీన్ ఎక్కువ తీసుకోవాలని అనుకునే వారికి చక్కని ఆహారం గుడ్డు. ఇతర ప్రొటిన్ ఎన్ రిచ్డ్ పుడ్ తో పోలిస్తే గుడ్డు చాలా చవక.

  గుడ్డు ప‌చ్చ‌సొన కూడా తినొచ్చు..

  బలమైన పదార్థం కాబట్టి ఆహారంలో గుడ్డు స్థానం ప్రత్యేకం. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. గుడ్డులోని తెల్ల సొన మాత్రమే తినాలి, పచ్చ సొన వదిలెయ్యాలని. కానీ అది అపోహే అంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఎలాంటి అనుమానం లేకుండా గుడ్డు పూర్తిగా తినవచ్చట. గుడ్డులో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.

  గుడ్డులో దొరకనివి కేవలం విటమిన్ సి, విటమిన్ బి3 మాత్రమే. మిగతా అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి. రోజువారీ ఆహారంలో గుడ్డు తీసుకోవడం మొదలు పెడితే చాలా కొద్ది సమయంలోనే శక్తి సంతరించుకొని, బలంగా తయారవడాన్ని స్వయంగా గుర్తించవచ్చు.

  ప్రొటీన్ కు మంచి సోర్స్

  కండరాలు బలంగా తయారవడానికి, ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి ప్రొటీన్ చాలా అవసరం. గుడ్లు ప్రొటీన్ భరితం. గుడ్డు నుంచి లభ్యమయ్యే ప్రొటీన్ వల్ల బరువు కూడా పెరగర‌ని నిపుణులు అంటున్నారు. బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు తీసుకున్నపుడు పోషకాలు అందడంతో పాటు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దీంతో రోజులో తీసుకునే ఆహరం పరిమాణం తగ్గడం వల్ల 400కేల‌రీల వరకు తగ్గినట్టు ఒక అధ్యయనం తెలుపుతోంది. ప్రొటీన్ సరిపడా తీసుకుంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు.

  ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా అందరూ సౌష్టవం కలిగిన శరీరం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్య వయస్కులు సైతం సిక్స్ ప్యాక్ మోజుతో ఉంటున్నారు. అటువంటి ఆసక్తి ఉన్నవారు కొన్నివ్యాయామాలతోపాటు తీసుకునే ప్రొటీన్ పరిమాణం మీద కూడా తప్పకుండా దృష్టి పెట్టాలి. ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవాలంటే మాత్రం వారికి గుడ్డు మంచి ప్రొటీన్ సోర్స్. వర్కవుట్ తర్వాత స్నాక్ గా గుడ్డు తీసుకోవడం చాలా మేలు చేస్తుంది.

  షుగ‌ర్ బ్యాలెన్స్ కూడా..

  రెండు భోజనాల మధ్య ఎక్కువ విరామం వస్తే షుగర్ లెవెల్స్ బాలెన్స్ చెయ్యడానికి ప్రొటీన్ కలిగిన స్నాక్ ఏదైనా తీసుకుంటే మంచిది. అయితే బజారులో దొరకే ఏ స్నాక్ లో అయినా సరే గ్లూకోజ్ తప్పక ఉంటుంది. కాబట్టి అలాంటివి తింటే కచ్చితంగా షుగర్ పెరుగుతుంది. ఇటువంటి సందర్భాల్లో షుగర్ బ్యాలెన్స్ చేసే సామర్థ్యం ఉన్న గుడ్డు తినడం బెటర్ అని న్యూట్రిషనిస్టులు అంటున్నారు.

  అందువల్ల అప్పటికి ఆకలి తీరడమే కాదు షుగర్ కూడా బ్యాలెన్స్ అవుతుందనేది న్యూట్రిషనిస్టుల అభిప్రాయం. గుడ్డులో విటమిన్ డి పుష్కలం. ఎన్నోఅనారోగ్యాలతో పోరాడడానికి విటమిన్ డి అవసరం. ప్రతి రోజు అవసరమయ్యే విటమిన్ డి లో 29 శాతం కేవలం రెండు గుడ్లతో సరిపుచ్చవచ్చు.

  ప‌లు వ్యాధులు అదుపులో..

  కొలైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుడ్డులో ఉంటుంది. ఇది మతిమరుపును నివారిస్తుంది. అంతేకాదు వయసు పెరిగే కొద్దీ కనిపించే మాలిక్యూలార్ డీజనరేషన్ వంటి సమస్యలను దూరం పెడుతుంది. కంటి చూపును సంరక్షించే జియాక్సథిన్, ల్యూటిన్ వంటి యాంటి ఆక్సిడెంట్స్ గుడ్డులో పుష్కలం.

  ఇమ్యూనిటీ పెంపుకు..

  ఇమ్యూనిటీ పెంచడానికి కూడా గుడ్డు తోడ్పడుతుంది. గుడ్డులో ఏ,డీ,ఇ తో పాటు జింక్, సెలెనియం, ఐరన్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఈ పోషకాలు ఇమ్యూనిటీ పెంచడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ పోషకాలన్నీ కూడా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించే యాంటీబాడీల ఉత్పత్తికి తోడ్పడుతాయి.

  కొలెస్ట్రాల్ సంగతేంటి?

  తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందన్న అపవాదు గుడ్డు మీద ఉంది. ఈ కారణంతోనే గుడ్డు తినేందుకు జంకుతుంటారు. అయితే న్యూట్రిషనిస్టులు మాత్రం కొలెస్ట్రాల్ పెంచే ఇతర ఆహార పదార్థాలను తగ్గించి తీసుకొని గుడ్డు తప్పకుండా తినాలని సూచిస్తున్నారు

  అయితే చాలా పరిమితికి మంచి గుడ్లు తినేవారిలో గుండెజబ్బుల ప్రమాదం తప్పకుండా ఉంటుంది. అయితే తినే ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని కచ్చితంగా చెప్పలేము. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి.

  గుడ్డు ఎలా తినాలి?

  గుడ్డు చాలా రుచిగా ఉండే పదార్థం. చాలా మందికి ఇష్టమైంది కూడా. ఆరోగ్యానికి కూడా అవసరమైంది. అందుకే ఎలా తిన్నా మంచిదే. స్కాంబుల్డ్ ఎగ్స్, పుట్టగొడుగులు, టమాటలతో కలిపి బ్రెడ్ టోస్ట్, ఆమ్లెట్, ఉడికించి, వేయించి ఇలా రకరకాలుగా తినే వీలున్న ఏకైక ఆహార పదార్థం.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page