ఓటమిపై సంకేతాలతో కేంద్రం అలర్ట్‌ అప్పర్‌ భద్ర ప్రాజెక్టు కోసం రూ.5,300 కోట్లు విధాత: తెలంగాణలోని హుజురాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్‌ విపక్ష పార్టీల ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌ మినహా మిగిలిన నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇందులో వాస్తవం ఎంత అన్నది తెలియదు. కానీ కేంద్రం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు […]

  • ఓటమిపై సంకేతాలతో కేంద్రం అలర్ట్‌
  • అప్పర్‌ భద్ర ప్రాజెక్టు కోసం రూ.5,300 కోట్లు

విధాత: తెలంగాణలోని హుజురాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్‌ విపక్ష పార్టీల ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌ మినహా మిగిలిన నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇందులో వాస్తవం ఎంత అన్నది తెలియదు. కానీ కేంద్రం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు చేసింది. మరికొన్ని నెలల్లో అక్కడ ఎన్నికలు రానున్నాయి. దీంతో అక్కడి ఓటర్లను ఆకట్టుకోవడానికే బడ్జెట్‌లో కర్ణాటకకు ఎక్కువ నిధులు కేటాయించిందనే అభిప్రాయం వ్యక్తమౌతున్నది.

కర్ణాటక రాష్ట్రంలో కరువు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది కోసం ఆర్థిక సహకారం అందించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. 29.4 టీఎంసీల సామర్థ్యంతో 2.25 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడానికి అప్పర్‌ భద్ర ప్రాజెక్టు కోసం రూ.5,300 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది మే 24 తో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనున్నది. మార్చి-ఏప్రిల్‌లో అక్కడ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.

224 అసెంబ్లీ సీట్లు ఉన్న కర్ణాటకలో 2018లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. 104 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచినా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీకి సీట్ల దూరంలో ఆగిపోయింది. అయినా ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ శాసనసభాపక్ష నేత యడ్యూరప్పను ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆహ్వానించారు. 2018 మే 17న యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేసినా 19న మెజారిటీ నిరూపించుకోలేక రాజీనామా చేశారు. 80 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌, 37 సీట్లు గెలుచుకున్న జనతాదళ్‌ సెక్యులర్‌, బీఎస్పీ కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. అది ఎక్కువ కాలం కొనసాగలేక పోయింది.

తిరిగి యడ్యూరప్ప సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టినా ఆయన స్థానంలో బస్వరాజ్‌ బొమ్మైని బీజేపీ అధిష్ఠానం కూర్చొనబెట్టింది. 2021 జూలై 28న బొమ్మై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి యడ్యూరప్ప అసంతృప్తితో ఉన్నారు. బీజేపీలో 75 ఏళ్లు దాటిన వారికి పదవులు లేవన్న దానికి భిన్నంగా పార్టీ అధిష్ఠానం కీలకమైన పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలో యడ్యూరప్పకు స్థానం కల్పించి.. బుజ్జగించింది.

అయితే.. నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాలని చూస్తున్న బీజేపీ కర్ణాటకలో మినహా మరే రాష్ట్రంలోనూ పెద్దగా ప్రభావం చూపించడం లేదు. పైగా ఈసారి కర్ణాటక కూడా కమలం చేజారే అవకాశం ఉన్నదన్న సంకేతాలు బలంగానే వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర బడ్జెట్లో కర్ణాటకు నిధులు కేటాయించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులివే

ఏపీలోని సంస్థలకు
విశాఖ స్టీల్ ప్లాంటుకు రూ.683 కోట్లు.
పెట్రోలియం యూనివర్సిటీకి రూ.168 కోట్లు.
కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.41,338 కోట్లు

తెలంగాణలోని సంస్థలకు
సింగరేణికి రూ.1,650 కోట్లు.
ఐఐటీ హైదరాబాద్‌కు ఈఏపీ కింద రూ.300 కోట్లు.
కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా రూ.21,470 కోట్లు.

తెలుగు రాష్ట్రాల్లో గిరిజన వర్సిటీలకు రూ.37 కోట్లు.

దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు రూ.6,835 కోట్లు
బీబీనగర్, ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్‌కూ నిధులు
సాలార్జంగ్ సహా.. అన్ని మ్యూజియాలకు రూ.357 కోట్లు.
మణుగూరు, కోట భార జల కర్మాగారాలకు రూ.1,473 కోట్లు

Updated On 1 Feb 2023 12:55 PM GMT
Somu

Somu

Next Story