Nalgonda | ఎన్నికలవేళ.. కొలువుల మేళా యువతను ఆకట్టుకునేందుకు అగచాట్లు ఐటీ టవర్ ప్రారంభం కాక ముందే హంగామా ఇంటర్వ్యూల బూచి ఆరు నెలలు ప్రొబేషనరీ.. ఆరు వేల వేతనం అయోమయంలో యువత అన్ని తానైన నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా పాట్లూ పడుతున్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకు పడరాని కష్టాలు పడుతున్నారు. […]

Nalgonda |

  • ఎన్నికలవేళ.. కొలువుల మేళా
  • యువతను ఆకట్టుకునేందుకు అగచాట్లు
  • ఐటీ టవర్ ప్రారంభం కాక ముందే హంగామా
  • ఇంటర్వ్యూల బూచి
  • ఆరు నెలలు ప్రొబేషనరీ..
  • ఆరు వేల వేతనం
  • అయోమయంలో యువత
  • అన్ని తానైన నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల

విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా పాట్లూ పడుతున్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకు పడరాని కష్టాలు పడుతున్నారు. నల్గొండ జిల్లాలోనూ నేతల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.

నేతలు, ఎమ్మెల్యేలను ప్రజలు విశ్వసించే పరిస్థితి చేజారిపోయింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ పథకాలను ఎరవేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్నవారికి అందేలా చూస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో ఆత్మీయంగా మెలిగినట్లు నటిస్తున్నారు. ఎన్నికల్లో గట్టెక్కెందుకు నల్గొండ నియోజకవర్గంలోనూ అధికార బీఆరెస్ ఎమ్మెల్యే అగచాట్లు అన్నీ ఇన్నీ కావు.

జాబ్ మేళాతో జిమ్మిక్కులు

నల్గొండలో రూ.93 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ టవర్ ఇంకా ప్రారంభం కాలేదు. కొలువులకు ఆస్కారమే లేదు. అయితే ఎన్నికల వేళ సిటింగ్ ఎమ్మెల్యే నానా హంగామా చేస్తున్నాడు. జాబ్ మేళా ముసుగులో యువతను ఆకట్టుకునేందుకు ఈ విడ్డూరానికి తెరదీశారని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. పార్టీలో అసంతృప్తులను బుజ్జగించి మచ్చిక చేసుకునే ప్రయత్నాలు పెద్దగా ఫలితాలివ్వలేదు.

దీంతో రూటు మార్చిన ఎమ్మెల్యే, నియోజకవర్గంలోని నిరుద్యోగులపై దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది. ఐటీ టవర్ నిర్మాణం పూర్తి కాకముందే జాబ్ మేళా నిర్వహించారు. ఈటవర్ ఎప్పుడు ప్రారంభిస్తారు.. ఎంత మందిని ఎంపిక చేస్తారు.. జాబ్ మేళాలో ఎంపికైన వారికి ఉద్యోగాలు ఎప్పుడిస్తారనే స్పష్టత లేదు. అయినా వేల మందితో మేళా నిర్వహించడం అనేక సందేహాలకు తావిస్తోంది.

3,600 మందికి ఉద్యోగాలు సాధ్యమేనా?

మున్సిపల్ శాఖ సమన్వయంతో నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగులు వేల సంఖ్యలో లక్ష్మీ గార్డెన్స్ వద్దకు చేరుకున్నారు. సుమారు 12000 మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిపారు. వారికి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు 15 కంపెనీలు వచ్చినట్లు, వారిలో సుమారు 3,600 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు.

అంతమందికి ఉద్యోగాలు కల్పిస్తారా? లేదా అనేది వేచి చూడాల్సిందే. కాగా, మేళాకు వచ్చిన ఓ కంపెనీ ఆరు నెలల వరకు రూ.6 వేలు వేతనం, 18 నెలల అగ్రిమెంట్ అంటూ చెప్పడంతో యువత అవాక్కయ్యారు. ఈ వేతనానికి, ఐటీ హబ్ లో ఉద్యోగానికీ ఎలాంటి పొంతన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ నాయకులు దగా చేశారు : ఎమ్మెల్యే కంచర్ల

‘నల్గొండకు ఐటీ హబ్ కొత్త అందాన్ని తెచ్చింది. గత కాంగ్రెస్ నాయకులు ఐటీ హబ్ తెస్తాం అని మభ్య పెట్టారు.. మాట తప్పారు’ అంటూ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి విమర్శించారు. వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి రూ.95 కోట్లు ఐటీ హబ్ మంజూరు చేస్తే, వంద శాతం పూర్తి చేశానని చెప్పారు.

మొత్తం 3600 మందికి అవకాశాలు వస్తాయి. పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు నల్గొండకు చెందిన ఎన్నారైలు హబ్ లో తమ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఐటీ హబ్ నల్గొండకు మణిహారంలా నిలిచిందన్నారు. నల్గొండ ఎమ్మెల్యేగా ప్రజలు మరోసారి గెలిపిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని చెప్పారు.

Updated On 1 Sep 2023 1:39 PM GMT
somu

somu

Next Story