Electricity From Air |
విధాత: యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ శాస్త్రవేత్తలు అద్భుతం సృష్టించారు. గాలిలో తేమ నుంచి నిరంతరం విద్యుదుత్పత్తి సాధించే విధానాన్ని వారు కనుగొన్నారు. ఈ విధానం ద్వారా నిరంతరాయంగా కరెంటును పుట్టించడమే కాకుండా తక్కువ ఖర్చులోనే ఉత్పత్తి జరుగుతుందని వారు తెలిపారు.
చిన్న మేఘాలను తయారుచేస్తే..
గాలిలో అంతులేనంత స్థాయిలో కరెంటు ఉంది. ఉదాహరణకు భారీ మేఘాలలో నీటి బిందువులు తప్ప ఇంక ఏ వస్తువూ ఉండదు. కానీ సరైన సమయంలో రాపిడి జరిగినప్పుడు మనం ఊహించలేనంత కరెంటు పుడుతుంది. కానీ దురదృష్టవశాత్తు దానిని ఒడిసిపట్టుకోవడానికి మన దగ్గర ఎలాంటి ఏర్పాటు లేదు.
అందుకే మనం విద్యుత్‌ను పొందగలిగే స్థాయిలో చిన్న చిన్న మేఘాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన నుంచి వచ్చిందే ఈ ఆవిష్కరణ అని పరిశోధనలో పాల్గొన్న జియామింగ్ లీ అనే శాస్త్రవేత్త తెలిపారు.
నానోపోర్స్ కీలకం
జనరిక్ ఎయిర్ జెన్ ఎఫెక్ట్ అని పిలిచే ఈ విధానంలో ఏదైనా ఒక మెటీరియల్‌లో 100 నానోమీటర్ల కంటే తక్కువ చుట్టుకొలత ఉన్న నానోపోర్స్‌ను నింపుతారు. దాని నుంచి నీటి అణువులను పంపినపుడు.. అవి నానోపోర్స్ ద్వారా మెటీరియల్ పైనుంచి కింది భాగానికి ప్రయాణిస్తాయి.
కానీ నానోపోర్ చిన్నగా ఉన్నందున ఎక్కువ భాగం అణువులు వాటి అంచుల దగ్గరే ఉండిపోతాయి. అలా కొంత సేపటికి మెటీరియల్ దిగువ భాగం కంటే పైభాగంలో నీటి అణువులు ఉంటాయి.
ఇది అచ్చం మేఘాల్లో నీటి అణువుల ఏర్పాటుకు సరిపోలుతుంది. ఎగువ భాగం దిగువ భాగం నీటి అణువుల్లో ఛార్జ్ తారతమ్యాల వల్ల కరెంటు ఉత్పత్తి చేసే బ్యాటరీలా ఆ మెటీరియల్ మారుతుంది. గాలిలో తేమ ఉన్నంత వరకు ఇది నిరంతరాయంగా పనిచేస్తుంది. ఈ విధానంలో మనం ఎక్కడికి వెళితే అక్కడ కరెంటు ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.