Elephants
విధాత: పార్వతీపురం మన్యం జిల్లాలో ఈమధ్య నాలుగు అడవి ఏనుగులు విద్యుత్ షాకుతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన గ్రామస్తులను తీవ్రంగా కలచి వేసింది. కొండల్లా తమ కళ్ల ముందు తిరుగాడే జీవాలు కదలకుండా కుప్పలా నిర్జీవంగా పడిఉన్న ఘటన వారిలో మానవత్వాన్ని మేల్కొలిపింది.
ఇటీవల భామిని మండలంలో కాట్రగడ.బి గ్రామ సమీపంలో వున్న బొకన్న చెరువు దగ్గర విద్యుత్ షాక్ కి గురైన ఆ నాలుగు ఏనుగులకు కాట్రగడ.బి, పకుడిభద్ర, బొమ్మిక, పిల్లిగూడ గ్రామ ప్రజలు అందరూ కలిసి అన్నసమారాధన నిర్వహించారు. వాటికి దశదిన కర్మకాండలు శాస్త్రోక్తంగా చేపట్టారు.
భామిని మండల ఎంపీపీ తోట.శాంతికుమారి మాట్లాడుతూ.. ఇటీవల విద్యుత్ షాక్ కి గురైన నాలుగు గజ మహారాజులు కొన్ని నెలలు ముందు నుండి కాట్రగడ.బి, పకుడిభద్ర, పిల్లిగూడ, బొమ్మిక గ్రామ పరిసరాల్లో ఆహారం కోసం తిరుగుతూ ఉండేవి.
ఆ సమయంలో సమీప గ్రామ ప్రజలకు ఎటువంటి హాని చేయకుండా ఉండేవని అన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఆ గజరాజులు విద్యుత్ షాక్‌కి గురవ్వడం సమీప గ్రామ ప్రజలకి – భామిని మండల ప్రజల మనస్సును కలిచి వేసింది. గజరాజులు అనంతలోకాలకు వెళ్లి 12వ రోజు అయిన సందర్బంగా సమీప గ్రామ ప్రజలందరూ కలిసి “అన్న సమారాధన” కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమం పూర్తి అయిన తరువాత సమీప దూరంలో వున్న వంశధార నదీ తీరానికి వెళ్లి సంప్రదాయకంగా చేయవల్సిన పూజా కార్యక్రమాలను కూడా చేసినట్టు వారు తెలియజేశారు. గజ మహారాజుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఈ సందర్బంగా తెలిపారు.
కార్యక్రమంలో బొదేపు శ్రీనివాసరావు, బొదేపు జగన్, గెల్లంకి గోపాల్ దాస్, పకుడిభద్ర – పిల్లిగూడ గ్రామస్తులు విడియాల రాజలింగం, విభూది వెంకటరావు, నిమ్మల లక్ష్మణరావు, విడియాల సాంబ మూర్తి, బిడ్డిక సంతోష్, పత్తిక కొండలరావు, కొన్నిగి ప్రసాద్, పాలక శ్రీకాంత్, ఇమ్రక రవి, గుప్తా, బొమ్మిక గ్రామస్తులు రణసింగి తిరుపతి అప్పన్నదొర, బిడ్డిక మోహనరావు, రణసింగి ప్రసాదరావు, రణసింగి భాస్కరరావు, బిడ్డిక వరం, పువ్వల కృష్ణారావు, మాలే యాకాంబరం, కేవటి బలరామ్ పాల్గొన్నారు.