- వేదికపై పైళ్ల, కుంభంల విరాళాల రాజకీయం!
విధాత: గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు ఎఫ్.ఎస్.సి.ఏ నిర్వహిస్తున్న గ్రామీణ యువజన క్రీడోత్సవాల వంటి మెగా టోర్నమెంట్ ల ద్వారా గొప్ప ప్రోత్సాహం లభిస్తుందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఎఫ్.ఎస్.సి.ఏ జిల్లా స్థాయి మెగా క్రీడోత్సవాల టోర్నమెంట్ను జడ్పి చైర్మన్ ఎ. సందీప్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో పైళ్ల మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులను యువతను క్రీడల్లో కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. యువజనలు, విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎదిగేందుకు ప్రయత్నించాలన్నారు.
క్రీడల్లో రాణించే వారికి నేటి రోజుల్లో అన్ని విధాల మంచి భవిష్యత్తు లభిస్తుండటం సానుకూల అంశమన్నారు. 40 ఏళ్లపాటు ఎఫ్.ఎస్.సి.ఏ యువజన సంఘం తన కార్యకలాపాలు సాగించడం యువజన సంఘాల నిర్వాహణకు స్ఫూర్తిదాయకమన్నారు.
మండల కేంద్రాల్లో ఇండోర్ స్టేడియాలకు స్థల సేకరణ సమస్య ఎదురవుతుందని దాతలు ఎవరైనా అవసరమైన భూమిని అందిస్తే నిర్మించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. అలాగే ఎఫ్.ఎస్.సి.ఏ క్లబ్ భవన నిర్మాణానికి స్థలం చూపిస్తే భవనాన్ని నిర్మించేందుకు సహకరిస్తానన్నారు.
తనకు మండల కేంద్రంలో భూమిలేదని, తన గ్రామంలో ఉందని అక్కడ రెండెకరాలైన ఇవ్వవచ్చని, కానీ అసోసియేషన్ భవనం ఇక్కడ నిర్మించాల్సి ఉందన్నారు. భవనం నిర్మాణానికి స్థానిక నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్థలం ఇస్తే బాగుంటుందన్నారు.
ఇంతలోనే ఎమ్మెల్యే చేతిలో మైకు తీసుకున్న అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగారు మంచి ఊపు మీద తెలివిగా మాట్లాడుతున్నారని, ఎమ్మెల్యేగా ఆయన అధికార యంత్రాంగం ద్వారా ప్రభుత్వ స్థలాలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
స్పందించిన శేఖర్ రెడ్డి ప్రభుత్వ స్థలాలకు కొరతగా ఉందని స్థలం దొరికితే భవన నిర్మాణ బాధ్యత తనదేనని ఇందుకోసం మూడు లక్షలు తాను ఇస్తానన్నానని, అనిల్ కుమార్ రెడ్డి అందుకు మూడు రేట్లు ఎక్కువగా తొమ్మిది లక్షలు ఇవ్వాలన్నారు.
మళ్లీ మైక్ అందుకున్న అనిల్ కుమార్ రెడ్డి స్థానికంగా రైల్వే స్టేషన్ రోడ్డు వంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశానని, క్లబ్ భవన నిర్మాణానికి అవసరమైన సహాయం అందిస్తానన్నారు. క్రీడోత్సవాల ప్రారంభ సందర్భంగా పోటీలో పాల్గొంటున్న జట్ల క్రీడాకారులతో అభివాదం చేసిన నాయకులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, ఎఫ్.ఎస్.సి.ఏ సభ్యులు, పలు మండలాల క్రీడాకారులు పాల్గొన్నారు.