Tuesday, January 31, 2023
More
  Homelatestఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు గన్‌మెన్ల పునరుద్ధరణ

  ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు గన్‌మెన్ల పునరుద్ధరణ

  • తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భద్రత
  • గన్‌మెన్‌లను తొలగించడంపై కోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత
  • రాజకీయ కక్ష సాధింపు చర్య
  • తొలగింపు వెనుక ఎమ్మెల్యే ప్రమేయం
  • రాజకీయరచ్చగా మారిన వ్యవహారం

  విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ్ముడు బిజెపి నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు రక్షణ కోసం ఏర్పాటుచేసిన గన్ మేన్‌లను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించినట్లు ప్రదీప్ రావు తరపు న్యాయవాది అల్లం నాగరాజు తెలియజేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని కోర్టు ఆదేశించినట్లు స్పష్టం చేశారు.

  ఇటీవల బీజేపీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు గత కొంతకాలంగా ఉన్న గన్ మెన్లను ఈమధ్య తొలగించిన వ్యవహారం మరోసారి రాజకీయ ఎజెండాపైకి వచ్చింది. తన భద్రత కోసం ఉన్న గన్ మెన్లను అధికార పార్టీ ఒత్తిడితో ఆకస్మికంగా ఇటీవల తొలగించడం పట్ల వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, బిజెపి నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బుధవారం హైకోర్టును ఆశ్రయించడంతో ఇప్పటికైతే కోర్టు సానుకూలంగా స్పందించినట్లు ప్రదీప్ రావు హర్షం వ్యక్తం చేశారు.

  ఈ గన్మెన్ల తొలగింపు వ్యవహారం వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ప్రదీప్ రావుకు ఏర్పాటుచేసిన పోలీస్ సెక్యూరిటీని సడన్‌గా తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నాయకులు ప్రదీప్ రావు అప్పుడే తీవ్రంగా ప్రతిస్పందించిన విషయం గమనార్హం. తాజాగా ఆయన కోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం మరోసారి చర్చకు దారితీసింది.

  ఏడేళ్లుగా కొనసాగుతున్న భద్రతను తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కారణాలు చెప్పకుండా తొలగించారని ప్రదీప్ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో కూడా కోర్టు ఆదేశాలతో ప్రదీప్ రావుకు ప్రభుత్వం పోలీసు భద్రత కల్పించారు. ప్రస్తుతం పోలీసులు తనకు భద్రత ఎందుకు తొలగించారో తెలియదని పేర్కొన్నారు. తనకు గతంలో కేటాయించిన విధంగా 2+2 భద్రత కల్పించేలా చూడాలని న్యాయస్థానాన్ని ప్రదీప్‌రావు కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు సానుకూలంగా స్పందించడం పట్ల బిజెపి వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

  రాజకీయ కక్ష సాధింపు చర్య

  ఇదిలా ఉండగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఏడేళ్లుగా ఉన్న గన్ మెన్‌లను తొలగించారని బీజేపీ ఆరోపిస్తోంది. వరంగల్ అర్బన్ కో-ఆపరేటీవ్ బ్యాంక్ చైర్మన్ ప్రదీప్ రావు 2014 ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ లో చేరారు. అప్పటినుంచి అసంతృప్తితో ఉన్న ప్రదీప్ రావు స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వ్యతిరేకవర్గంగా ముద్ర పడింది. ఇటీవల గులాబీ పార్టీలో ఇముడలేక కమలం గూటికి చేరారు. సోదరుడు ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర మంత్రి గా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ తన రాజకీయ ఉనికి కోసం ప్రదీప్ రావు బిజెపిలో చేరారు.

  ఆ పార్టీ నుంచి రానున్న ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి పోటీ అభ్యర్థిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నేపనేని నరేందర్ కు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిగా మారే అవకాశాలు ఉన్నందున ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు పెరిగాయి. గులాబీ పార్టీలో ఉండగానే ఇరువురి మధ్య విభేదాలు ఉండగా తాజాగా ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయి. పరస్పర విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో బి ఆర్ ఎస్ వర్సెస్ బిజెపి మధ్య వరంగల్ తూర్పు లో రాజకీయాలు వేడెక్కాయి.

  వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ మౌఖిక ఆదేశాల మేరకు నలుగురు గన్‌మెన్ లు వెళ్లిపోయారు. గన్ మెన్ తొలగించడంలో ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. వరంగల్ సిపి గా తరుణ్ జోషి ఉన్న సమయంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఒత్తిడి తెచ్చినా పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇటీవలనే సిపిగా చేరిన రంగానాథ్ కనీస సమాచారం లేకుండా సెక్యూరిటీని తొలగించినట్లు బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

  పీఆర్పీ నుంచి రాజకీయాల్లో..

  ఎర్రబెల్లి ప్రదీప్ రావు సీనియర్ రాజకీయ నాయకుడిగా గుర్తింపు ఉంది. వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా సుదీర్ఘకాలం నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) నుండి వరంగల్ ఈస్ట్ నుండి పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత టిఆర్ఎస్ లో చేరి కీలక నేతగా ఉన్నారు. వరంగల్ వెస్ట్ నుంచి టికెట్ ఆశించిన ప్రదీప్ రావు అది సాధ్యం కాకపోవడంతో కనీసం ఎమ్మెల్సీ అయిన అధిష్టానం ఇస్తుంది అని భావించారు. కానీ ఏ పదవులు రాకపోగా స్థానిక ఎమ్మెల్యేతో విభేదాలు పెరిగి టిఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ లో చేరారు.

  కాంగ్రెస్ హయాంలో ఒకసారి

  చంద్రబాబు ముఖ్య మంత్రిగా ఉన్నన్ని రోజులు ప్రదీవు రావుకి గన్ మేన్స్ ఉండే వారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రదీప్ రావు పై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గన్ మేన్స్ తొలగించారు. ఆ తరువాత టిఆర్ఎస్ లో చేరిన తరువాత 2016 నుండి ప్రదీప్ రావు కి గన్ మేన్స్ కేటియింపు జరిగింది.. అప్పట్లో కొండ మురళి, కొండ సురేఖ ఒత్తిడి తో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సమయం లో గన్ మెన్ తొలగింపు జరిగితే తాజాగా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కారణంగా గన్ మేన్స్ తొలగింపు జరిగినట్లు చర్చ సాగుతోంది. తాజాగా కోర్టు ఆదేశాలతో గులాబీ వర్గాలు నీరసించినట్టు సమాచారం.

  ఎమ్మెల్యే, ప్రభుత్వానిదే బాధ్యత

  తనకు హాని ఉందనే కారణంతో 2016లో ప్రభుత్వం గన్ మెన్లను కేటాయించిందని, ఇప్పుడు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గన్ మెన్లను ఉపసంహరించడం పైన ప్రదీప్ రావు విస్మయం వ్యక్తం చేశారు. తనకు ఏదైనా హాని జరిగితే రాష్ట్ర ప్రభుత్వం తోపాటు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ బాధ్యత వహించాలని గతంలో స్పష్టం చేశారు.

  బీజేపీ నాయకులపై బీఆర్ఎస్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగమే గన్ మెన్ల ఉపసంహరణ అని ఆరోపించారు. అయితే ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు ఇప్పుడు కోర్టును ఆశ్రయించడంతో సెక్యూరిటీ పునరుద్ధరణకు ఆదేశించడం పట్ల జోరుగా చర్చ సాగుతోంది.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular