- వలసల నిరోధానికి అవకాశం
- వేలాదిమందికి లభించనున్న ఉపాధి
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుతో ఇక్కడి ప్రజల కష్టాలు తీరనున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలో మినీ టెక్స్‌టైల్ పార్క్ కు అవసరమైన వివిధ స్థలాలను మంత్రి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్క్ ఏర్పాటుతో వలస వెళ్లే ఇక్కడి ప్రాంతాల ప్రజలు తిరిగివచ్చే అవకాశముందన్నారు.
వేలాది మందికి ఉపాధి దొరికుతుందన్నారు. ఇక్కడి చేనేత కార్మికులకే కాక, చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న ఇతర వర్గాల ప్రజలకు కూడా ఉపాధి లభిస్తుందన్నారు. కొడకండ్ల రూపు రేఖలు మారనున్నాయన్నారు. అన్ని రకాల పరిశీలనల తర్వాత త్వరలోనే శంకుస్థాపన జరుగుతుందని చెప్పారు. కనీసం 20 ఎకరాల స్థలం అవసరం కాగా, భవిష్యత్తు అవసరాల రీత్యా అంతకంటే ఎక్కువ స్థలాన్ని పరిశీలిస్తున్నామన్నారు. సాధ్యమైనంత వేగంగా స్థల సేకరణ కేటాయింపు జరగాలని అధికారులని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. కార్యక్రమంలో జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో కృష్ణవేణి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.