ఆ పార్టీ పోటీ చేసే స్థానాలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసే పార్టీలపై పోటీ చేస్తారా? కలిసి వెళ్తారా? కాంగ్రెస్‌, బీజేపీ ముఖాముఖి పోటీలో బీఆర్‌ఎస్‌ ప్రభావం ఎంత? కాంగ్రెస్‌, బీజేపీ యేతర ప్రత్యామ్నాయ కూటమి యత్నాలు ఫలిస్తాయా? విధాత‌: టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన తర్వాత జాతీయస్థాయిలో విస్తరణపై ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ దృష్టి సారించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా కేసీఆర్‌ రూపొందించినట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ పోటీ […]

  • ఆ పార్టీ పోటీ చేసే స్థానాలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు
  • బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసే పార్టీలపై పోటీ చేస్తారా? కలిసి వెళ్తారా?
  • కాంగ్రెస్‌, బీజేపీ ముఖాముఖి పోటీలో బీఆర్‌ఎస్‌ ప్రభావం ఎంత?
  • కాంగ్రెస్‌, బీజేపీ యేతర ప్రత్యామ్నాయ కూటమి యత్నాలు ఫలిస్తాయా?

విధాత‌: టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన తర్వాత జాతీయస్థాయిలో విస్తరణపై ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ దృష్టి సారించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా కేసీఆర్‌ రూపొందించినట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ పోటీ చేసే రాష్ట్రాలు, ఆయా ప్రాంతాలలో సమాచారాన్ని సేకరించే ప్రయత్నాలు మొదలయ్యాయట.

అక్కడి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా అభ్యర్థులను సన్నద్ధం చేసే యత్నాలు మొదలైనట్టు సమాచారం. వచ్చే ఏడాది తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, సహా తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2014లో మేలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ అన్నిస్థానాల్లో పోటీ చేయడం సాధ్యం కాదు. కాబట్టి ముందుగా తెలుగు మాట్లాడే ప్రజలు గణనీయంగా ఉన్న రాష్ట్రాల్లో పోటీచేసి ఓట్లు, సీట్లు సాధించడమే ధ్యేయమని బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సన్నాహక సభలో కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే బీఆర్‌ఎస్‌ విస్తరణ ఎవరికి మేలు చేస్తుందనే చర్చ ప్రస్తుతం జరుగుతున్నది. ఎంఐఎం మాదిరిగా బీజేపీకి బీ టీం అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తెలుగు వారు ఎక్కువ సంఖ్యలో ఉండే స్థానాల్లో పోటీ చేసి అక్కడ ఓట్ల చీలిక తెస్తే అంతిమంగా ఎవరికి లబ్ధి చేకూరస్తుందనేది ఆలోచించాలంటున్నారు. దీనికి ఉదాహరణ కూడా చెబుతున్నారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్‌లో మినహా గోవా, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అంతిమంగా ఏ పార్టీకి నష్టం చేసింది ఏ పార్టీకి మేలు చేసింది అనేది చూస్తే అవగతమవుతుంది అంటున్నారు. బీఆర్‌ఎస్‌ పోటీ చేయాలనుకుంటున్న కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో పోటీ కాంగ్రెస్‌, బీజేపీల మధ్యే ముఖాముఖి పోటీ ఉంటుంది.

ఆ నాలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అవకాశాలు కాంగ్రెస్‌ కే ఉంటాయి. లేకపోతే బీజేపీకి ఉంటుంది. కానీ ఆయా రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేసే స్థానాల్లో ఓట్ల చీలిక ద్వారా ఎక్కువగా బీజేపీకే మేలు చేయవచ్చు అనేదే వారి వాదన. కర్ణాటకలో జనతాదళ్‌-ఎస్‌తో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. యూపీలో జేడీఎస్‌, ఎస్పీతో కలిసి వెళ్లే అవకాశం ఉన్నది.

మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో సొంతంగానే కొన్నిచోట్ల పోటీ చేయాలనుకుంటున్నది. ముఖ్యంగా ఏక్‌నాథ్‌షిండేను ముందుపెట్టి మహారాష్ట్రలో మహాఘట్‌బంధన్‌ ప్రభుత్వాన్ని కూల్చిన కమలనాథులు తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. కానీ శివసేనలో చీలక తేవడం ద్వారా అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి.

దీంతో అక్కడ బీఆర్‌ఎస్‌ పోటీ చేయడం ద్వారా కేంద్రంలో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడుతున్న పార్టీలకే నష్టం జరుగుతుంది అంటున్నారు. బీఆర్‌ఎస్‌ అక్కడ పోటీ చేయడానికి మరో కారణం కూడా ఉన్నది. కేసీఆర్‌ శివసేన అధినేత ఉద్ధవ్‌ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌లతో భేటీ అయ్యారు.

కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాలని వారు ఆహ్వానించారు. కానీ కాంగ్రెస్‌ లేకుండా బీజేపీ వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి సాధ్యం కాదని వాళ్లు తేల్చిచెప్పారు. దీంతో కేసీఆర్‌ శివసేన, ఎన్పీపీపై పెట్టుకున్న ఆశ‌లు ఆవిరైపోయాయి. అయితే విస్తరణలో భాగంగా బీఆర్‌ఎస్‌ అక్కడ పోటీ చేయాలనుకుంటే ఇప్పటికే అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న మహాఘట్‌బంధన్‌తో కలిసి సాగాలి. అందుకు భిన్నంగా ఎంఐఎంతో కలిసి వెళ్తే బీజేపీకి మేలు చేస్తుందనే వాదనలకు బలం చేకూర్చినట్టవుతుంది అంటున్నారు.

అలాగే ఒడిషాలో బిజూజనతాదళ్ అధినేత నవీన్‌ పట్నాయక్‌ రెండు దశాబ్దాలుగా సీఎంగా కొనసాగుతున్నారు. అయినా ఆయన రాష్ట్ర రాజకీయాలు తప్పా జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదన్నారు. అక్కడ బీజేపీ అధికారం కోసం ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు అక్కడ బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తే ఎవరికి మేలు చేయడానికి అంటున్నారు.

ఏపీ, తెలంగాణ మినహా వివిధ తెలుగు మాట్లాడేవారు గెలుపు ఓటములను ప్రభావితం చేసే మరో 30 స్థానాల్లో పోటీ చేయాలని బీఆర్‌ఎస్‌ భావిస్తున్నది. వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేయాలని అక్కడి నేతల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రకటన సందర్భంగా అక్కడ పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే.

వైసీపీ వైఖరి బట్టి అక్కడ సొంతంగానే, లేక కలిసి పోటీ చేస్తుందా అన్నది రానున్న రోజుల్లో స్పష్టత వస్తుంది. ఈ రకంగా ఏపీలో 25, తెలంగాణలో 17, ఇతర రాష్ట్రాల్లో 30 స్థానాలు కలిపి 70కి పైగా పోటీ చేయాలని బీఆర్‌ఎస్‌ అధినేత వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ విస్తరణ ఆ పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుంది? ఏ పార్టీకి నష్టం చేస్తుంది? ఏ పార్టీకి మేలు చేస్తుందనే చర్చ మాత్రం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో జోరుగా జరుగుతున్నది.

Updated On 29 Dec 2022 12:48 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story