విధాత: యూజర్లు ఓ ఫేస్‌బుక్ (Facebook) ప్రొఫైల్‌ను చూడగానే ఆటోమేటిక్‌గా వారికి ఫ్రెండ్ రిక్వెస్టు వెళ్లిపోయేందుకు కారణమైన ఓ బగ్‌ను సరిదిద్దినట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. ఎవరైనా ఫేస్‌బుక్‌లో ఓ ప్రొఫైల్‌ను ఏ కారణం చేతనైనా పరిశీలిస్తే వారి ప్రమేయం లేకుండానే దానికి ఫ్రెండ్ రిక్వెస్ట్ వెళిపోతోందని ఆండ్రాయిడ్ అథారిటీ తన నివేదికలో వెల్లడించింది.
సామాజిక మాధ్యమాల్లో దీనిపై విస్తృత చర్చ జరగడంతో ఫేస్‌బుక్ స్పందించింది. సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించింది. పొరపాటు తమ దృష్టికి వచ్చిన వెంటనే చక్కదిద్దామని, యూజర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలని కోరింది.
మోసగాళ్ల అడ్డాగా ఫేస్‌బుక్
ఈ మధ్య కాలంలో మరో సమస్య ఫేస్‌బుక్ ఖాతాదారులను వేధిస్తోంది. ఆ వేదిక సైబర్ మోసగాళ్లకు అడ్డాగా మారిందని ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక పేర్కొంది. వెరిఫై చేసిన ఫేస్‌బుక్ పేజీల యూఆర్ఎల్స్ మారిపోయాయని, సంబంధం లేని కంటెంట్ కనపడుతోందన్నారు. ఆ యూఆర్ఎల్స్‌ను క్లిక్ చేస్తే అవి నకిలీ వెబ్‌సైట్‌లకు తీసుకెళ్తున్నాయని, ఎక్కువ మంది మోసపోతున్నారని ఓ ఫేస్‌బుక్ యూజర్ ట్విటర్‌లో తెలిపారు.
స్కామర్స్ ఎక్కువగా సెలబ్రెటీల పేజీలనే టార్గెట్ చేస్తున్నారని ఉదాహరణకు 2012లో క్రియేట్ చేసిన ఫ్యాన్స్ ఆఫ్ పూజ అనే పేజీను వారు గూగుల్ ఏఐ కింద మార్చేశారని నివేదిక పేర్కొంది. దీనిపై ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా అధికారి స్పందిస్తూ.. తాము ఈ మోసపూరిత ప్రకటనలను, మోసాలను గుర్తించేందుకు తగిన వనరులను అందుబాటులో ఉంచామని తెలిపారు.