- ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన వారిగా గుర్తింపు
- నగదు, బంగారం, బైకులు, ఫోన్లు స్వాధీనం
- సిబ్బందిని అభినందించిన ఎస్పీ
fake gold sales gang members arrested
విధాత: అమాయక గ్రామీణ ప్రజలను లక్ష్యంగా చేసుకొని నకిలీ బంగారాన్ని(fake gold) అసలు బంగారంగా నమ్మించి విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులు ముగ్గురిని అరెస్ట్(arrest) చేసినట్లు సూర్యాపేట ఎస్పీ(Suryapeta SP) రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) తెలిపారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని పల్నాడు జిల్లాకు చెందిన నిందితులు గుంజి పద్మ, కుంచాల శ్రీను, బత్తుల విజయ్‌ను అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు లక్షల 30 వేల నగదు, 4 లక్షల 55 వేల విలువైన నాలుగు తులాల బంగారు చైన్, రెండు బైకులు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నిందితులు ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులమని చెప్పి వెలుగుపల్లి గ్రామంలో పగడాల సోమయ్య ఇంట్లో ఒక గది కిరాయికి తీసుకొని అర్వపల్లి గ్రామంలో సుతారి పని చేస్తున్నామని చుట్టుపక్కల ప్రజలను నమ్మించారు. మోటార్ సైకిల్ పై మద్దిరాల గ్రామానికి వెళ్లి ఎరుకలు సైదులుకు మాయమాటలు చెప్పి అసలు బంగారమని నమ్మించి నకిలీ బంగారము ఇచ్చి సైదులు భార్య మెడలో ఉన్న నాలుగున్నర తులాల బంగారు పుస్తెలతాడును దొంగిలించారు. తదుపరి వెలుగుపల్లి గ్రామంలో తూము లక్ష్మీ ఇంటికి వెళ్లి నకిలీ బంగారం బిల్లలు నాలుగు ఇచ్చి అసలు బంగారం అని నమ్మించి డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి 1,80,000 నగదు తీసుకెళ్లారు.
అర్వపల్లి మండలం గొల్లపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై సపోటా పండ్లు అమ్ముకునే గద్దగూటి వీరమ్మకు కూడా నకిలీ బంగారమిచ్చి 50 వేల రూపాయలు తీసుకున్నారు. బుధవారం తుంగతుర్తి ఎస్ఐ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అన్నారం గ్రామం ఎక్స్ రోడ్‌లో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని పట్టుకొని విచారించగా వారి మోసాలు వెలుగు చూశాయి. సూర్యాపేట డిఎస్పి పర్యవేక్షణలో నిందితులను పట్టుకున్న తుంగతుర్తి సీఐ నాగార్జున గౌడ్, తుంగతుర్తి ఎస్ఐ డానియల్ కుమార్, మద్దిరాల ఎస్ఐ వెంకన్న, కానిస్టేబుల్స్ సుధాకర్, లింగరాజు, విజయ్ , వెంకటేశ్వర్లు, అశోక్, శ్రావణ్ లను ఎస్పీ అభినందించారు.