Farmers Suicide Not New | రైతుల ఆత్మహత్యలు కొత్తేం కాదని, ఏటా ఇలాంటివి జరుగుతున్నాయని.. అదేం పెద్ద విషయమేమి కాదంటూ మహారాష్ట్రకు చెందిన మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన సాక్షాత్తు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నేత, వ్యవసాయ మంత్రి అబ్దుల్ సత్తార్. మంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంటలకు గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలో కూరుకుపోయి.. ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వారి కష్టాలను తీర్చాల్సింది పోయి అడ్డగోలు విమర్శలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. దాంతో మహారాష్ట్రకు చెందిన ఉల్లి రైతులు గిట్టుబాటు ధర రాకపోవడంతో సంక్షోభంలో చిక్కుకుపోయారు. దాంతో పాటు అకాల వర్షాలు పంటలను ముంచెత్తగా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. దాంతో ఔరంగాబాద్ జిల్లాలో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయ మంత్రిగా ఉన్న అబ్దుల్లా సత్తార్ ఔరంగాబాద్ సిల్లోడ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో రైతులు సైతం ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రి నియోజకవర్గ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రిని రైతుల ఆత్మహత్య గురించి మీడియా ప్రశ్నించింది. దీనికి మంత్రి స్పందిస్తూ.. ‘రైతుల ఆత్మహత్యలు అనేవి ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నాయి. ఇదేం కొత్త కాదు. నా నియోజకవర్గంలోనే జరుగలేదు కదా? మహారాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో’ జరిగాయని వ్యాఖ్యనించారు.
మంత్రి బాధ్యతా రాహిత్యంపై ప్రతిపక్షాల ఆగ్రహం
ఔరంగాబాద్ జిల్లాలోని మరఠ్వాడా ప్రాంతంలో ఆరుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సిల్లోడ్ నియోజకవర్గంలోనూ ప్రాణాలు తీసుకున్నారు. పంట పెట్టుబడుల కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే, ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించింది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను పరిశలించాలని మంత్రులను ఆదేశించింది. ఈ క్రమంలోనే పరిస్థితుల పరిశీలనకు సిల్లోడ్‌కు వచ్చిన మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ శాఖా మంత్రి అయి ఉండి పంటకు గిట్టుబాటు ధర కల్పించకుడా.. బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడంపై ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి నేతలు మండిపడ్డారు. షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వ ఉదాసీనతకు ఉదాహరణ అంటూ విమర్శలు గుప్పించారు. మంత్రి సత్తార్‌కు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేం కాదని, ఆయన నైజమే అంతా అంటూ ధ్వజమెతారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (నేత అజిత్ పవార్ మాట్లాడుతూ రైతుల కష్టాలు మంత్రికి ఎగతాళిగా అనిపించాయని ఆరోపించారు. అన్నం పెట్టే రైతన్నల గురించి చులకనగా మాట్లాడిన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.