విధాత: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పరిహారం చెల్లించి ఆదుకోవాలని, రెండు రోజుల్లో దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే రైతుల పక్షాన తాను ఈనెల 22న తిరుమలగిరి మండలంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిరహారదీక్షకు కూర్చుంటానని మాజీ మంత్రి బోనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు.
ఆదివారం అయినా సీఎం కేసీఆర్‌కు అకాల వర్షం వడగండ్లతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరుతూ లేఖ రాశారు. ప్రభుత్వం తన లేకపై స్పందించాలని, నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందాలని, అప్పటివరకు నా పోరాటం ఆగదన్నారు.
పంటలు దెబ్బతిన్న ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలను, అధికారులకు చెప్పి రైతుల నుంచి వివరాలు సేకరించి, నష్టపరిహారం అందించేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానన్నారు.
అకాల వర్షం వల్ల భువనగిరి పార్లమెంట్ పరిధిలోని తిరుమలగిరి మండలంలో 99 శాతం పంటలు దెబ్బతిన్నాయన్నారు. వరి, మిరప, టమాటో, మొక్కజొన్న, ఇతర పంటలు దెబ్బతిని రైతన్నలు తీవ్రంగా నష్టపోయాడన్నారు. వరి పంట అయితే.. గింజ కూడా లేకుండా రాలిపోయిందన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రామన్నపేట, కనగల్, తుంగతుర్తి, నూతన్ కల్ సహా పలు మండలాల్లో చేతికొచ్చిన పంటలు నాశనం అయ్యాయన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లానే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయన్నారు.
ఇంకొన్ని రోజులు వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోందని, అయినా కూడా ఎమ్మెల్యేలు గానీ, అధికారులు గానీ రైతన్నను పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. కనీస స్పందన కూడా కరువైందన్నారు.
వెంటనే ప్రభుత్వం స్పందించాలని, వడగళ్లు పడ్డ ప్రాంతాల్లో నాయకులు, సంబంధిత అధికారులు పర్యటించి.. రైతుల నుంచి వివరాలు సేకరించి నష్టం అంచనా వేయాలని, ఎకరాకు 50వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వెంకట్ రెడ్డి కోరారు.
ఈ కష్టకాలంలో అన్నదాతలకు భరోసాని ఇవ్వాల్సింది పోయి కొందరు నేతలు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని, మంత్రులు కొన్ని చోట్లకు వెళ్లి మమ అనిపిస్తున్నారని, మిగిలిన ప్రాంతాల రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
అకాల వడగళ్లు.. రైతన్నకు కడగళ్లు
ప్రభుత్వం స్పందించకుంటే నిరాహారదీక్షకు దిగుతా..!@TelanganaCMO pic.twitter.com/p313HD6Ovj
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) March 19, 2023