Tuesday, January 31, 2023
More
    HomelatestGHMC: ఆన్‌లైన్‌లో ఫైల్స్.. ఆఫ్‌‌లైన్‌లో వసూళ్లు

    GHMC: ఆన్‌లైన్‌లో ఫైల్స్.. ఆఫ్‌‌లైన్‌లో వసూళ్లు

    • కమిషనర్ ఆదేశాలు బేఖాతర్
    • ఆఫ్‌‌లైన్‌లో ఆమ్యామ్యాలు
    • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు పాతర
    • స‌స్పెండ్ చేస్తామ‌న్నా ప‌ట్ట‌ని అధికారులు

    విధాత న్యూస్, హైదరాబాద్: బల్దియా కమిషనర్ ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది. ప్రజల సౌకర్యం కోసం తీసుకొస్తున్న ఆన్‌లైన్‌ విధానాన్ని అటకెక్కిస్తున్నారు కొంతమంది అధికారులు. ప్రజల్లో ఆన్‌లైన్‌పై అంతగా అవగాహన లేకపోవడంతో డబ్బుల వసూళ్లకు తెగబ‌డుతున్నారు.

    దరఖాస్తులను పరిశీలించేందుకు వచ్చామంటూ డబ్బులు వసూళ్లు చేస్తున్నారు డిప్యూటీ కమిషనర్లు, బిల్ కలెక్టర్లు, ఏఎంసీలు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులను క్లియర్ చేసే అవకాశం ఉన్నా పక్కన బెట్టి ప్రజల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. హైదరాబాద్ నగరవాసులకు వేగంగా సేవలు అందించడంతో పాటు అవినీతికి ఆస్కారం లేకుండా అనేక కొత్త విధానాలకు రూపకల్పన చేస్తోంది జీహెచ్ఎంసీ.

    అధికారుల, కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తు అప్లయ్, క్లియరెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో భాగంగా ఎలాంటి దరఖాస్తులైనా సంబంధిత ధృవపత్రాలను జోడిస్తూ.. ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకునేలా మార్పులు తీసుకొచ్చింది జీహెచ్ఎంసీ.

    అందులో భాగంగానే ఆన్‌లైన్‌లోనే మ్యూటేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది జీహెచ్ఎంసీ. ఆస్తి మ్యూటేషన్, ట్యాక్స్ రివిజన్ వంటి సదుపాయాలను ఆన్‌లైన్‌ చేశారు అధికారులు. దాదాపు ఏడాది కాలంగా ఈ సేవలు కొనసాగుతున్నాయి. దరఖాస్తు చేసిన వెంటనే ధృవపత్రాలను పరిశీలించి, దానిని ఆమోదించడం లేదా తిరస్కరించడం చేయాలి క్షేత్రస్థాయిలో ఉన్న డిప్యూటీ కమిషనర్లు.

    ఆన్‌లైన్‌లో ఫైళ్లు పేరుకుపోతే.. ప్రధాన కార్యాలయంలో సంబంధిత అధికారులతో పాటు కమిషనర్ కు కూడా ఆ విషయం తెలిసి పోతుంది. ఈ చర్యల వల్ల ఫైళ్లు పెండింగ్ లేకుండా ఉండటమే కాదు.. పనులు వేగంగా అవుతాయని భావించారు ఉన్నతాధికారులు. కాని వారి అంచనాను తలకిందులు చేశారు క్షేత్రస్థాయి అధికారులు కొందరు.

    నిబంధనలకు విరుద్ధంగా ఆఫ్‌లైన్ లో దరఖాస్తులను క్లియర్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ పరిధిలోని కొంత మంది బిల్ కలెక్టర్లు, ఏఎంసీలు, డిప్యూటీ కమిషనర్లు. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను ప్రింట్ తీసి.. నేరుగా లబ్ధిదారులకు ఫోన్ చేయడం లేదా ఇంటికి వెళ్లి పరిశీలన పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు.

    అయితే కమిషనర్ ఆదేశాల ప్రకారం.. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో క్లియర్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తుదారులతో నేరుగా సంప్రదింపులు జరపకూడదని, అలా చేస్తే అక్రమాలు చోటు చేసుకుంటాయని కమిషనర్ భావించారు. ఒక వేళ దరఖాస్తుదారుడు తప్పుడు పత్రాలను ఇచ్చారని అధికారులు భావిస్తే.. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వివరాలు తీసుకోవాలి గాని.. దరఖాస్తుదారుడికి కాంటాక్ట్ లోకి వెళ్లకూడదని ఆదేశించారు కమిషనర్.

    సర్కిళ్ల పరిధిలో పనిచేసే టాక్స్ ఇన్స్ పెక్టర్లు, బిల్ కలెక్టర్లు.. ప్రైవేట్ వ్యక్తులను అసిస్టెంట్ బిల్ కలెక్టర్ల పేరుతో కొంత మందిని నియమించుకుని నేరుగా కార్యాలయల్లోనే దందాలకు తెరలేపారని తెలిసి, సీరియస్ అయ్యారు జీహెచ్ఎంసీ కమిషన్.

    ప్రైవేట్ వ్యక్తులెవరూ జీహెచ్ఎంసీ అధికారిక పనులను చేయకూడదని హెచ్చరించారు. అయినా.. ఈ ఆఫ్‌లైన్ దందాకు తెరదించలేదు క్షేత్రస్థాయి అధికారులు. డిప్యూటీ కమిషనర్ల లాగిన్‌లో ఉన్న వివరాలను కంప్యూటర్ ఆపరేటర్ల సహకారంతో ప్రైవేట్ వ్యక్తులు, బిల్ కలెక్టర్లు దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి డబ్బులు వసూలు చేస్తున్నారు.

    ఇదే విషయంపై రెండు రోజుల క్రితం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన కమిషనర్… ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను క్లియర్ చేయాలని, దరఖాస్తుదారులను కలవకూడదని ఆదేశించారు. అలా చేస్తే డిప్యూటీ కమిషనర్లను సస్పెండ్ చేస్తామని కూడా హెచ్చరించారు బల్దియా కమిషనర్.

    ప్రజల సౌకర్యం కోసం జీహెచ్ఎంసీ ఎన్ని కొత్త విధానాలు తీసుకొచ్చినా పట్టించుకోవడం లేదు క్షేత్రస్థాయి అధికారులు. అక్రమాలకు పాల్పడితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని స్వయంగా బల్దియా కమిషనర్ హెచ్ఛరించినా కొందరు డిప్యూటీ కమిషనర్లు, టాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లలో మార్పు రావడం లేదు.

    ఆన్‌లైన్ విధానాలపై అంతగా అవగాహన లేని ప్రజల నుంచి డబ్బులను దండుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోకపోతే బల్దియా అప్రతిష్ట పాలవడమేగాక.. ప్రజలు ఆర్థికంగా మరింత నష్టపోయే అవకాశం ఉంది.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular