- ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ అల్ ఎట్ వన్స్‌కు 7 అవార్డులు
విధాత: ఆస్కార్ అవార్డు (Oscar Awards)ల్లో ఆసియా మహిళ మిషెల్లీ యో (Michelle Yeoh) చరిత్ర సృష్టించారు. దాదాపు వందేళ్ల చరిత్ర ఉన్న ఆస్కార్ అవార్డుల్లో (Academy Awards) ఆసియా ఖండం నుంచి ఒక మహిళ ఉత్తమ నటి అవార్డు అందుకున్నది లేదు.
కానీ.. ఈ ఘనతను సాధించింది మిషెల్లీ యో! ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ అల్ ఎట్ వన్స్ (Everything Everywhere All at Once) చిత్రానికి గాను మిషెల్లీ ఉత్తమ నటి (Oscar for best actress) అవార్డు అందుకున్నది. అంతేకాదు.. మలేషియాలో పుట్టిన ఒక మహిళ ఆస్కార్ అవార్డుకు ఎంపిక కావడం ద్వారా మరో రికార్డును కూడా ఆమె సొంతం చేసుకున్నారు.
గతంలో ఆసియా నుంచి ఆస్కార్ అవార్డులు అందుకున్న వారు ఉన్నప్పటికీ.. ఉత్తమ నటి అవార్డు లభించడం మాత్రం ఇదే మొదటిసారి. నటన విభాగంలో ఆస్కార్ అవార్డు పొందిన ఐదో మహిళ మిషెల్లీ. తనకు అవార్డు వచ్చిన సందర్భంగా మిషెల్లీ మాట్లాడుతూ.. ‘పెద్ద కలలు కనాలి.. అవి నిజమవుతాయి’ అనేందుకు తన విజయం నిదర్శనమని చెప్పారు.
తనకు అవార్డు రావడం భవిష్యత్తుకు ఆశాకిరణమని అన్నారు. ఈ అవార్డును తన తల్లితో పాటు ప్రపంచం లోని తల్లులందరికీ అంకితం చేస్తున్నానని ప్రకటించారు. ఎందుకంటే.. నిజానికి వారే సూపర్ హీరోలని చెప్పారు. వారు లేకుంటే ఈ రోజు రాత్రి ఈ కార్యక్రమానికి మనం ఎవరమూ వచ్చి ఉండేవాళ్లం కాదని అన్నారు.
ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రంలో మిషెల్లీ బేలతనంతో ఉండే ఆసియన్ అమెరికన్ వలసదారు పాత్ర పోషించారు. ఈ సినిమా మొత్తం 11 విభాగాల్లో పోటీపడితే.. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి సహా ఏడు విభాగాల్లో అవార్డులు ఎగరేసుకుపోయింది.