కొంతమంది నేతల వైఖరిని తప్పుపడుతున్న కార్యకర్తలు రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై స్పందన ఏదీ? అధికారపార్టీ నేతలు పట్టించుకోకున్నా ఇంకా వారితో ఎందుకు అంటకాగుతున్నారు? విధాత‌: పీడిత ప్రజల పక్షాన పోరాడుతాం.. వారి హక్కులు కాపాడుతాం.. సమసమాజ స్థాపన కోసం పనిచేస్తామనే కమ్యూనిస్టుల నినాదాలు ఆచరణలో అమలవుతున్నాయా? లేక ఒకటి రెండు సీట్ల కోసం వారు అధికార పార్టీతో రాజీ పడుతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తున్నది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలపై ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, […]

  • కొంతమంది నేతల వైఖరిని తప్పుపడుతున్న కార్యకర్తలు
  • రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై స్పందన ఏదీ?
  • అధికారపార్టీ నేతలు పట్టించుకోకున్నా ఇంకా వారితో ఎందుకు అంటకాగుతున్నారు?

విధాత‌: పీడిత ప్రజల పక్షాన పోరాడుతాం.. వారి హక్కులు కాపాడుతాం.. సమసమాజ స్థాపన కోసం పనిచేస్తామనే కమ్యూనిస్టుల నినాదాలు ఆచరణలో అమలవుతున్నాయా? లేక ఒకటి రెండు సీట్ల కోసం వారు అధికార పార్టీతో రాజీ పడుతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తున్నది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలపై ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు రోడ్డెక్కారు. వారికి సంఘీభావంగా విపక్షాలు (సీపీఎం, సీపీఐ మినహా) అందరూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ కమ్యూనిస్టు నేతలు మాత్రం బీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం ఆరాటపడుతున్నట్టు.. కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలే వాపోతున్నారు.

రాష్ట్రంలో ప్రధాన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు, విపక్ష పార్టీల నేతలతో పాటు విద్యార్థి, యువజన విభాగాలు నిత్యం నిరసన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాయి. కానీ సీపీఐ, సీపీఎం అనుబంధం విభాగాలైన ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ. డీవైఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ లాంటి విద్యార్థి సంఘాలు దీనిపై యాక్టిక్‌గా ఉన్నట్టు కనిపించడం లేదు.

అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన వామపక్ష గొంతుకలు ఎందుకు మూగబోయాయి? అధికారపార్టీ ఇచ్చే ఒకటి రెండు సీట్ల కోసం సమాజాన్ని సంక్షోభంలోకి నెట్టిన అనేక అంశాలను తొక్కి పెడుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కొంతకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ఏ పార్టీతో అయినా తాము కలిసి పనిచేస్తామని చెప్పిన కమ్యూనిస్టులు అధికార బీఆర్‌ఎస్‌తోనే అంటకాగుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల నుంచి ఆ పార్టీతోనే ఉంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వేదిక పంచుకోవడమే మహాభాగ్యం అన్నట్టు కొందరు నేతలు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ, ధరణి, విద్యుత్‌ ఉద్యోగులు తమ పీఆర్సీ కోసం కొంతకాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలేవీ తమకు ప్రాధాన్యం కాదనట్టు కమ్యూనిస్టులు వ్యవహరిస్తుండటమే ఇప్పటి విషాదం.

అయితే ఇంత చేస్తున్నా.. అధికారార పార్టీ నేతలు కమ్యూనిస్టులను పట్టించుకోవడం లేదు. వారు కోరుతున్న నియోజకవర్గాల్లో కమ్యూస్టుల వాదనకు కాలం చెల్లిందని, వాళ్లకు ఓట్లు వేసే రోజులు పోయాయని అధికారపార్టీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి లాంటి వాళ్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నిజానికి వీళ్లు సొంతంగా పోటీ చేసినా రెండు మూడు స్థానాల్లో గెలిచే పరిస్థితి ఉన్నది.

కానీ ఆ సీట్ల కోసం బీఆర్ఎస్‌ను ప్రాధేయ పడుతుండటం, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వీరిని పట్టించుకోకపోవడం, అసలు పరిగణనలోకే తీసుకోవడం లేదని తెలుస్తోంది. అయినా ఇంకా వారితోనే కలిసి నడవాలనుకోవడం కమ్యూనిస్టుల బలహీనతకు అద్దం పడుతున్నదని కొందరు విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు.

మూడు సీట్లు.. నాలుగు ఓట్ల కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం ఏమొచ్చిందని.. ప్రజా సమస్యలను పక్కనపెట్టి అధికారపార్టీతో అంటకాగి వాళ్లు ఏం సాధించారని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది స్వార్థం కోసం కమ్యూనిస్టుల గొంతు నొక్కడాన్ని ఆ పార్టీల కార్యకర్తలే తప్పు పడుతున్నారు.

Updated On 28 March 2023 4:28 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story