- నిషిద్ధ ప్రాంతాల్లో పర్యాటకుల అనుమతికి కసరత్తు
- మరుగుదొడ్లు, సెల్ఫీ పాయింట్, ఇతర వసతుల ఏర్పాటు
విధాత: సాహస టూరిస్టులకు చక్కటి అవకాశం కల్పించబోతున్నది భారత ప్రభుత్వం. జమ్ముకశ్మీర్‌లో యుద్ధభూమిని తలపించే లఢక్ (Ladakh) లోని నిషిద్ధ జోన్లలో పర్యాటకులను అనుమతించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర పర్యాటకశాఖ చేపడుతున్నది.
తూర్పు లఢక్‌లోని పాంగాంగ్ లేక్ పెట్రోలింగ్ పాయింట్ వరకు టూరిస్టులను అనుమతించాలని నిర్ణయింది. ఈ ప్రాంతం చైనా సరిహద్దుగా సమీపంగా ఉంటుంది. తొలి దశలో పర్యాటకులను 18,314 అడుగుల ఎత్తులో ఉన్న మార్సిమిక్ లా (పాస్) సోగ్ట్సాలో వరకు అనుమతించనున్నారు. లెహ్‌కు తూర్పున 160 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది.
రెండోదశలో టూరిస్టులను చాంగ్ చాన్మో లోయలోని సోగ్‌సల్లు ప్రాంతం నుంచి హాట్ స్ప్రింగ్స్ వరకు అనుతించనున్నారు. భారత సీఆర్పీఎఫ్ పెట్రోలింగ్ సిబ్బందిపై 1959 అక్టోబర్ 21న చైనా ఆర్మీ దాడి చేసి 10 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నది. సైనికుల గౌరవార్థం ఇక్కడ స్మారకం నిర్మించారు. మార్సిమిక్ ఎల్ తో దారితో సహా అనేక ట్రెక్‌లు, మార్గాలను తెరవడానికి ఆర్మీ సైతం అంగీకరించింది.
సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరిన్ని పర్యాటక ప్రాంతాలకు టూరిస్టును అనుమతించేందుకు అవసరమైన చర్యలను లఢక్ పాలనా యంత్రాంగం చేపడుతున్నది. పర్యాటకులకు అవసరమైన మరుగుదొడ్లు, ఇతర వసతులకు ఏర్పాట్లు చేస్తున్నది.
పర్వత ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నది. ఆర్మీ సమన్వయంతో ఇతర శాఖలు పర్యాటక వృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, ఎప్పటి నుంచి టూరిస్టును అనుమతిస్తారనే స్పష్టమైన తేదీ మాత్రం వెల్లడి కాలేదు.