- ఇంటి పన్నుల రసీదుకు డూప్లికేట్లు
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
- ఆదుకోవాలని బాధితుల ఆవేదన
DUPLICATE FORGERY :
విధాత, మెదక్ బ్యూరో: ఇండ్ల స్థలాలకు, ఉద్యోగాలకు ఫోర్జరీ పత్రాలు తయారు చేయటం మామూలే.. తాజాగా జామీన్ పత్రాలకు సైతం ఫోర్జరీ సంతకాలు వాడిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ డివిజన్ శివంపేట మండలం చెన్నాపూర్‌లో వెలుగు చూసింది. వివరాలను బాధితులు సోమవారం మీడియాకు వెల్లడించారు.
ఈ నెల 20న బాలానగర్ కోర్టుకు సంబంధించిన వ్యక్తి చెన్నాపూర్ పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి మీ గ్రామ పంచాయతీకి సంబంధించిన జామిన్ పత్రాలు వచ్చాయని, ఇవి మీరే జారీ చేశారా అని ప్రశ్నించాడని వారు తెలిపారు. ఆ పత్రాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని పంచాయతీ కార్యదర్శి బదులిచ్చినట్టు వెల్లడించారు.
ఇదే విషయంపై ఈ నెల 29న గ్రామస్తుల సమక్షంలో సర్పంచ్ బోళ్ల భారతి భిక్షపతి, ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి, అదే గ్రామానికి చెందిన బోయిని సతీష్ యాదవ్ ను పిలిపించి మాట్లాడగా నకిలీ ధ్రువపత్రాలు, దొంగ బుక్కులు, స్టాంపులు, ఫోర్జరీ సంతకాలు తానే చేశానని ఆయన ఒప్పుకున్నాడని చెప్పారు.
ఈ విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి తనకు ఎటువంటి సంబంధం లేదని రాత పూర్వకంగా విచారణ అధికారులకు ఇచ్చారని తెలిపారు. దీనిపై సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కోర్టు సూపరింటెండెంట్ ఫోన్ చేసి చెప్పడంతో ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లామని చెప్పారు. అయితే.. ఇది తమ పరిధి లోకి రాదని స్థానిక ఎస్సై రవి కాంతారావు చెప్పారని తెలిపారు.
నకిలీ జామీన్ ధ్రువపత్రాలు, ఇంటి పన్నుల రసీదులతో తమకు ఎలాంటి సంబంధం లేదని బాధితులు వాపోయారు. ఈ ఫోర్జరీ సంతకాల వ్యవహారంలో ఇప్పటికైనా జిల్లా ఎస్పీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలని బాధితులు కోరారు. గ్రామంలో విచారణ చేపట్టి, నిందితులను అరెస్టు చేసి, తమకు విన్నవించారు.
గ్రామ సర్పంచ్ బోళ్ల భారతి భిక్షపతి, ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, గ్రామ పారిశుద్ధ్యకమిటీ చైర్మన్ బోళ్ల ఆంజనేయులు, గ్రామ పెద్దలు అంజిరెడ్డి, అంతిరెడ్డి, వెంకట్ రెడ్డి, బుచ్చిరెడ్డి, యాదగిరి, శంకరయ్య, రాజు, నాగభూషణం తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.