విధాత‌: మతిమరుపు (Forgetfulness), జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గిపోవడాన్నే డిమెన్షియా అంటాం. వయసు పెరుగుతున్న కొద్దీ ఇది సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. అల్జీమర్స్‌ వ్యాధి రావడానికి కూడా ఇది సూచనే. అల్జీమర్స్‌ వచ్చినట్టయితే నెమ్మది నెమ్మదిగా చాలా చిన్న విషయాలు కూడా మర్చిపోతుంటారు. అల్జీమర్స్‌ వల్ల మెమరీ తగ్గిపోవడమే కాకుండా ఇతరత్రా మెదడు పనితీరు కూడా కుంటుపడవచ్చు. చివరికి రోజువారీ జీవితంలో పనుల విషయంలో కూడా కుటుంబ సభ్యులపై ఆధారపడే స్థితికి వస్తారు. మొహం కడుక్కోవడం, స్నానం చేయడం, దుస్తులు […]

విధాత‌: మతిమరుపు (Forgetfulness), జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గిపోవడాన్నే డిమెన్షియా అంటాం. వయసు పెరుగుతున్న కొద్దీ ఇది సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. అల్జీమర్స్‌ వ్యాధి రావడానికి కూడా ఇది సూచనే. అల్జీమర్స్‌ వచ్చినట్టయితే నెమ్మది నెమ్మదిగా చాలా చిన్న విషయాలు కూడా మర్చిపోతుంటారు. అల్జీమర్స్‌ వల్ల మెమరీ తగ్గిపోవడమే కాకుండా ఇతరత్రా మెదడు పనితీరు కూడా కుంటుపడవచ్చు. చివరికి రోజువారీ జీవితంలో పనుల విషయంలో కూడా కుటుంబ సభ్యులపై ఆధారపడే స్థితికి వస్తారు.

మొహం కడుక్కోవడం, స్నానం చేయడం, దుస్తులు ధరించడం, అటూ ఇటూ నడవడం, ఫ్రెండ్స్‌ ని కలవడం వంటి పనులకు కూడా ఎవరో ఒకరి సహాయం కావాల్సి వస్తుంది. అల్జీమర్స్‌ కి ఇప్పటివరకూ పూర్తి చికిత్స ఏమీ లేదు. కొంతవరకు దీన్ని నివారించడం సాధ్యమవుతుంది. మన జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా డిమెన్షియా రిస్క్‌ తగ్గించవచ్చు. డిమెన్షియా, అల్జీమర్స్‌ వ్యాధి నివారణకు ప్రముఖ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ అందిస్తున్న సూచనలు.

  1. అధిక రక్తపోటు - రక్తపోటు పెరగడం వల్ల పక్షవాతం లాంటివి వచ్చే ప్రమాదం ఉందని మనకు తెలుసు. హై బీపీ వల్ల మెదడులో కొన్ని భాగాలకు రక్త సరఫరాలో తేడాలు కూడా రావొచ్చు. ఇలాంటప్పుడు అల్జీమర్స్‌ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తరచుగా బీపీ చెక్‌ చేయించుకుంటూ ఉండాలి. నార్మల్ బీపీ 120/80 లేదా అంతకన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఉంటే వెంటనే డాక్టర్‌ ను కలవాలి.
  2. మధుమేహం - డయాబెటిస్‌ వల్ల కూడా బ్రెయిన్‌ స్ట్రోక్‌ రిస్కు పెరుగుతుంది. మెదడుకు రక్త సరఫరా సరిగా లేకపోవడం వల్ల డిమెన్షియాకు దారితీయవచ్చు.
  3. అధిక బరువు - బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు, ఒబేసిటీ సమస్య ఉన్నవాళ్లలో బీపీ, డయాబెటిస్‌ లాంటి వ్యాధులే కాకుండా డిమెన్షియా రిస్కు కూడా పెరుగుతుంది. వీళ్లలో వాస్కులర్‌ డిమెన్షియా కూడా రావొచ్చు. మెదడుకు రక్తసరఫరా సరిగా లేకపోవడం వల్ల వాస్కులర్‌ డిమెన్షియా వస్తుంది. బరువు ఎక్కువగా ఉన్నవాళ్లలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగదు. కాబట్టి శరీర బరువు తగినంత ఉండేలా చూసుకోవాలి. బాడీ మాస్‌ ఇండెక్స్‌ ద్వారా మనం తగినంత బరువు ఉన్నామో లేదో తెలుసుకోవచ్చు. మన ఎత్తు, బరువుల నిష్పత్తి ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. బాడీమాస్‌ ఇండెక్స్‌ 25 కన్నా తక్కువ ఉంటే వాళ్లు ఎత్తుకు తగిన బరువు ఉన్నట్టు పరిగణిస్తారు. ఇదేకాకుండా నడుము చుట్టుకొలత కూడా ముఖ్యమే. ఎత్తుకు తగినంత ఉందో లేదో చెక్‌ చేసుకుంటూ ఉండాలి. శరీర బరువు నార్మల్‌ ఉండాలంటే డైట్‌ కంట్రోల్‌, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం హెల్ప్‌ చేస్తాయి. తద్వారా డిమెన్షియా రిస్కు కూడా తగ్గించుకోవచ్చు.
  4. డైట్‌ - పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, చిరు ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్‌ శాతం తగ్గించాలి. రెడీ టు ఈట్‌, ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలను ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. స్వీట్స్‌ తీసుకోవడం తగ్గించాలి. ప్రొటీన్ల కోసం చేపలు, నట్స్‌, బ్లూ బెర్రీస్‌ వంటివి తీసుకోవచ్చు. నట్స్‌ మెదడు ఆరోగ్యానికి సహాయపడుతాయి.
  5. వ్యాయామం - శారీరక శ్రమ ఎక్కువగా లేకుండా కూర్చునే ఉండేవాళ్లకు డిమెన్షియా రిస్కు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శారీరకంగా చురుగ్గా ఉండటం చాలా ఇంపార్టెంట్‌. ఇందుకోసం ఎక్కువ కష్టపడనక్కర్లేదు కూడా. వారానికి అయిదు రోజుల పాటు ప్రతి రోజూ ఓ 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయిస్తే చాలు. బ్రిస్క్‌ వాక్‌, రన్నింగ్‌, జాగింగ్‌, స్విమ్మింగ్‌.. ఇలా మీకేది నచ్చితే అది చేయవచ్చు. వ్యాయామం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మెదడుకు కూడా రక్త సరఫరా సజావుగా సాగుతుంది. అందువల్ల అల్జీమర్స్‌ రిస్క్‌ తగ్గుతుంది.
  6. మెంటల్లీ యాక్టివ్‌ - శరీరానికే కాదు.. మెదడుకు కూడా వ్యాయామం అవసరం. శారీరకంగా చురుగ్గా ఉండటం ఎంత ముఖ్యమో, మన మెదడును కూడా చురుగ్గా ఉంచుకోవడం అంతకన్నా ఎక్కువే ముఖ్యం. ఎప్పుడూ ఏ టీవీ చూస్తూనో, మొబైల్‌ చూస్తూనో టైంపాస్‌ చేస్తున్నారనుకోండి.. మీ మెదడు పనితీరు మందగించవచ్చు. మెదడును యాక్టివ్‌ గా ఉంచాలంటే దానికి ఎప్పుడూ ఏదో ఒక పని చెప్పడమే. పని అంటే అనవసరమైన ఆలోచనలు కాదు. కొత్త విషయాలను నేర్చుకునే పని అప్పజెప్పడమన్నమాట. కొత్త భాషలు నేర్చుకోవడం, కొత్త స్కిల్స్‌ పెంచుకోవడం, క్రియేటివ్‌ వర్క్స్‌, డ్రాయింగ్‌, కథలు రాయడం, మ్యూజిక్‌ నేర్చుకోవడం, పజిల్స్‌ సాల్వ్‌ చేయడం, సుడోకు.. ఇలాంటివి చేయడం వల్ల మన మెదడును యాక్టివ్‌ గా ఉంచుతూ డిమెన్షియా రిస్కు తగ్గించవచ్చు.
  7. ఒంటరితనం - ఎప్పుడూ ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండేవాళ్లలో డిమెన్షియా రిస్కు ఎక్కువగా ఉంటుంది. మనిషి సంఘజీవి. తోటి మనుషులతో కలిసిపోతూ, వాళ్లతో సమయం గడుపుతూ ఉంటేనే మనం సంతోషంగా ఉండగలుగుతాం. మన మెదడు కూడా ఏ స్ట్రెస్‌ లేకుండా ఉండగలుగుతుంది. అందుకే వీలైనంత ఎక్కువ సార్లు కుటుంబ సభ్యులతోనే కాకుండా, ఫ్రెండ్స్‌, బంధువులు, ఇతర ఆత్మీయులను కలుస్తూ, వాళ్లతో టైం స్పెండ్‌ చేస్తూ ఉండండి. డిమెన్షియా రిస్కు తగ్గించుకోండి.
  8. కంటి చూపు - దృష్టిలోపాలున్నవాళ్లకు డిమెన్షియా రిస్కు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చూపు దెబ్బతినకుండా జాగ్రత్తపడాలి. ఎప్పకప్పుడు కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కాటరాక్ట్‌ చాలా సాధారణంగా కనిపించే సమస్య. వయసు పెరిగిన వాళ్లలో ఈ రిస్కు ఎక్కువ. కాటరాక్ట్‌ విషయంలో కూడా ఆలస్యం చేయకుండా, చూపు దెబ్బతినకముందే తగిన చికిత్స చేయించుకోవాలి.
  9. వినికిడి లోపం - వినికిడిలో సమస్యలున్నవాళ్లకు కూడా డిమెన్షియా రిస్కు ఎక్కువగా ఉంటుంది. అంతేగాక ఇతర కాగ్నిటివ్‌ సమస్యలు కూడా రావొచ్చు. అందుకే వినికిడి పరీక్షలను చేయించుకుంటూ అవసరమైన జాగ్రత్తలు పాటించాలి. వినికిడి లోపం ఉన్నట్టు తేలితే అవసరాన్ని బట్టి హియరింగ్‌ ఎయిడ్స్‌ కూడా వాడవచ్చు. వినికిడి దెబ్బతినకుండా ఉండాలంటే అత్యధిక శబ్దాలకు దూరంగా ఉండాలి. చెవుల్లో ఇయర్‌ ఫోన్లు పెట్టుకుని ఫోన్‌ మాట్లాడటం తరచుగా చూస్తుంటాం. దీనివల్ల వినికిడి దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల ఫోన్‌ స్పీకర్‌ లో పెట్టుకుని మాట్లాడటం బెటర్‌.
  10. మెంటల్‌ స్ట్రెస్‌ - ఇటీవలి కాలంలో మానసిక ఒత్తిడి లేనివాళ్లు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. మెంటల్‌ స్ట్రెస్‌ వల్ల డిమెన్షియా రిస్కు పెరుగుతుంది. డిప్రెషన్‌, యాంగ్జయిటీ లాంటి సమస్యలున్నా, మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నా ఆలస్యం చేయకుండా సైకాలజిస్టును కలిసి, తగిన చికిత్స తీసుకోవాలి.

  1. అధిక కొలెస్ట్రాల్‌ - కొలెస్ట్రాల్‌ మితి మీరి పెరిగితే గుండె జబ్బుల వంటి రిస్కే కాదు, అల్జీమర్స్‌ వచ్చే ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారానికి దూరంగా ఉండటం, వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో ఈ చెడు కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవచ్చు. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్‌ కి సంబంధించిన పరీక్షలు చేయించుకుని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
  2. నిద్ర - కంటి నిండా నిద్ర లేకపోతే శరీరానికే కాదు.. మెదడుకూ విశ్రాంతి ఉండదు. విశ్రాంతి లేకుండా పనిచేస్తే శరీరం అలసిపోయినట్టే మెదడు కూడా అలసిపోతుంది. 6 గంటల కన్నా తక్కువ నిద్రపోయినా, 9 గంటల కన్నా ఎక్కువ నిద్రపోయినా డిమెన్షియా రిస్క్‌ పెరుగుతుంది. పగటి సమయంలో ఎక్కువ సేపు పడుకోవడం కూడా ఎంతమాత్రం మంచిది కాదు. 50 ఏళ్లు పైబడినవాళ్లు మధ్యాహ్నం పూట ఓ గంట సేపు పడుకుంటే పరవాలేదు గానీ, అంతకన్నా చిన్న వయసువాళ్లు పగటి సమయంలో కాకుండా రాత్రిపూట 8 గంటల నిద్ర ఉండేలా జాగ్రత్తపడాలి.
  3. హెడ్‌ ఇంజురీస్‌ - తలకు గాయమైతే అది డైరెక్ట్‌ గా మెదడుపై ప్రభావం చూపిస్తుంది. డిమెన్షియా రిస్కు పెరుగుతుంది. అందుకే డ్రైవ్‌ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవడం మరవొద్దు. ఒకవేళ ఏ ప్రమాదమో జరిగి తలకు గాయమైనా.. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ ని కలిసి చికిత్స తీసుకోవాలి. ఆలస్యం అయిన కొద్దీ అన్ని రకాల ప్రమాదాలూ పెరుగుతాయి. తలకు గాయమైనప్పుడు ఎంత త్వరగా చికిత్స తీసుకోగలిగితే అంతగా ప్రమాదాన్ని నివారించవచ్చు.
  4. అలవాట్లు - ఆల్కహాల్ తీసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్‌ అయిపోయింది. చాలామందికి రోజువారీ కార్యక్రమం అయిపోయింది. ఆల్కహాల్‌ వల్ల లివర్‌ ఎఫెక్ట్‌ కావడం మాత్రమే కాదు… మెదడు కూడా ప్రభావితం అవుతుంది. మద్యం సేవించడం వల్ల మెదడు కుచించుకుపోతుంది. మెదడులో చాలా రకాల భాగాలు దెబ్బతినవచ్చు. ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకునే వాళ్లలో థైమిన్‌ లోపం, విటమిన్‌ బి12 లోపం ఏర్పడి, డిమెన్షియా వస్తుంది.

ఇది న్యూరో టాక్సిక్‌.. బ్రెయిన్‌ కి విషం లాంటిది. అందుకే మెదడు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మద్యానికి దూరంగా ఉండండి. ఆల్కహాల్‌ మాత్రమే కాదు.. పొగ తాగడం కూడా మెదడును దెబ్బతీసే వ్యసనమే. స్మోకింగ్‌ వల్ల ఊపిరితిత్తులే కాదు.. శరీరంలోని అన్ని అవయవాలూ దెబ్బతింటాయి. మెదడు ప్రభావితం అయి, డిమెన్షియా రిస్కు పెరుగుతుంది. అందుకే పొగతాగడం వెంటనే మానేయండి. కొత్తగా అలవాట్లు చేసుకోకండి.

Updated On 20 May 2023 3:26 AM GMT
Somu

Somu

Next Story