- నాడు వ్యక్తిగత కక్షతో వేధించారని విమర్శలు
- ప్రస్తుతం సీఎం జగన్ ప్రభుత్వంపై పాజిటివ్ కామెంట్స్
ఆనాడు జగన్ మోహన్‌రెడ్డిని వ్యక్తిగత కక్షతో కూడా వేధించారని విమర్శలు ఎదుర్కొన్న సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ తాజాగా జగన్ ప్రభుత్వం గురించి పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమధ్య కూడా ప్రభుత్వ పాలసీలు గురించి సానుకూలంగా మాట్లాడిన జెడి ఇప్పుడు పలు అంశాల మీద తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు.
గత లోక్ సభ ఎన్నికల్లో విశాఖ నుంచి జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయినా 2.8 లక్షల ఓట్లు సాధించి , విద్యావంతుల మద్దతు పొందారు. ఆ తరువాత కూడా రాష్ట్రమంతా పర్యటిస్తూ పలు సామాజిక కార్యక్రమాలు, యువతలో స్ఫూర్తి నింపే సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అక్కడక్కడ భూమిని కౌలుకు తీసుకుని సేంద్రియ వ్యవసాయం చేస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారు.
తాజాగా ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో-1కు మద్దతు పలికారు. రోడ్ల మీద సభలు, రోడ్‌షోలు నిర్వహించే సందర్భాల్లో అనువైన స్థలాలను అంచనా వేసేందుకు పోలీసుల అనుమతిని తప్పనిసరి చేస్తూ అమలు చేస్తున్న జీఓ మంచిదేనన్నారు.
ఇటీవల రాష్ట్రంలో జరిగిన ప్రమాదం ఘటనల దృష్ట్యా ఈ జీఓను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఈ జీవోను ఏపీ హైకోర్టు అంగీకరించలేదు. ఈనెలాఖరు వరకూ దానిమీద స్టే విధించిన విషయం తెలిసిందే. కానీ జెడి మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్దానం కిడ్నీ రోగుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ చూస్తుంటే ఆనందంగా ఉందని అంటూ, ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో పద్మనాభపురం వద్ద నిర్మిస్తున్న 200 పడకల కిడ్నీ ఆస్పత్రిని పరిశీలించిన జెడి లక్ష్మీనారాయణ ప్రభుత్వ చిత్తశుద్ధిని మెచ్చుకున్నారు.
కిడ్నీ వ్యాధి శాశ్వత పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఆలోచన చేయకపోయినా వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించడం గొప్ప విషయమన్నారు. ఉద్దానంలో ఇంటింటికీ శుద్ధజలం అందించేందుకు రూ.700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించడం గొప్ప కార్యక్రమం అన్నారు.
అప్పట్లో ఆయన జగన్ కేసుల విషయంలో చాలా యాక్టివ్ గా ఉంటూ అక్రమార్కుల గుండెల్లో సింహస్వప్నం అన్నట్లుగా పేరు పొందారు. ఆ తరువాతి కాలంలో జగన్ ముఖ్యమంత్రి అవగా జెడి లక్ష్మీనారాయణ ఉద్యోగ విరమణ చేసి సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఏదీ ఏమైనా గాని జెడి నోటి వెంట మెచ్చుకోలు కామెంట్స్ రావడం మంచి పరిణామమే అని జగన్ అభిమానులు, కార్యకర్తలు అంటున్నారు.