పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల వనరులు, మార్కెట్లను.. అభివృద్ధి చెందిన దేశాలకు అంటగట్టటమే లక్ష్యమా.. విధాత: జీ-20 అధ్యక్ష పదవి ప్రధాని మోదీకి దక్కటం అరుదైన గౌరవంగా సంఘ్‌పరివార్‌ శక్తులు గొప్పలు పోతున్నాయి. ఇంతటి గౌరవం మరెవరికీ దక్కలేదనీ, ఇదంతా మోదీ ఘనత అని బీజేపీ శ్రేణులు చెప్పుకొంటున్నాయి. ఆ క్రమంలోనే ప్రధాని మోదీ ‘మానవ కేంద్ర ప్రపంచీకరణ జరగాల’ని ఆకాంక్షించారు. ఆ క్రమంలోనే ‘ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే నినాదాలిచ్చారు! జీ-20 […]

  • పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల వనరులు, మార్కెట్లను..
  • అభివృద్ధి చెందిన దేశాలకు అంటగట్టటమే లక్ష్యమా..

విధాత: జీ-20 అధ్యక్ష పదవి ప్రధాని మోదీకి దక్కటం అరుదైన గౌరవంగా సంఘ్‌పరివార్‌ శక్తులు గొప్పలు పోతున్నాయి. ఇంతటి గౌరవం మరెవరికీ దక్కలేదనీ, ఇదంతా మోదీ ఘనత అని బీజేపీ శ్రేణులు చెప్పుకొంటున్నాయి. ఆ క్రమంలోనే ప్రధాని మోదీ ‘మానవ కేంద్ర ప్రపంచీకరణ జరగాల’ని ఆకాంక్షించారు. ఆ క్రమంలోనే ‘ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే నినాదాలిచ్చారు!

జీ-20 దేశాలు అంటే అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల కూటమి. ఈ దేశాల మధ్య వర్తక, వాణిజ్య సంబంధాల కోసం ఏర్పాటయ్యిందే ఈ కూటమి. నిజానికి 1999లో తూర్పు ఆసియా, యూరప్‌ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితుల్లో ఈ జీ -సమ్మిట్‌ దేశాల కూటమి ప్రారంభమైంది. మొదట ఐదు దేశాలతోనే జీ-5దేశాల కూటమి ప్రారంభమైంది. ఆ తర్వాత కాలంలో అది జీ-7 దేశాలకు పెరిగింది. ఇప్పుడు ఇంకా పెరిగి 20 సభ్య దేశాల కూటమిగా ఎదిగింది.

జీ-20 దేశాల కూటమితో అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలకు ఒరిగేదేమీ లేదు. నిజానికి పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని సహజ వనరులు, మానవ శ్రమ, మార్కెట్లను అభివృద్ధి చెందిన దేశాలు ఎలా పంచుకోవాలన్న వ్యూహమే ఈ జీ-20 దేశాల కార్యక్రమంగా ఉంటుందనే ఆరోపణలున్నాయి. నిజానికి జీ-20 అధ్యక్షపదవి భారత్‌కు దక్కటం ఇదే మొదటి సారి కాదు. ఇది గతంలో 2001లోనూ జీ-దేశాలకు అధ్యక్షపదవి దక్కింది. జీ-5నుంచి జీ-20గా పెరిగిన తర్వాత తిరిగి భారత్‌కు అధ్య‌క్షత వచ్చింది.

వంతుల వారీగా సభ్య దేశాలన్నీ ఏడాదికి ఒక దేశం అధ్యక్షపదవి చేపట్టాలనే నియమంలో భాగంగానే మోదీ పీఠమెక్కారు. అంతేకానీ ఇందులో మోదీ గొప్పతనంగానీ, ప్రత్యేకత కానీ ఏమీ లేదు. మోదీ తర్వాత 2024లో బ్రెజిల్‌, 2025లో దక్షిణాఫ్రికా జీ-20 అధ్యక్ష పదవి చేపడుతాయి.

గత కొన్నేండ్లుగా దేశంలో మెజారిటీ వాద రాజకీయం చేస్తూ.. ‘ఒకే చట్టం, ఒకే భాష, ఒకే దేశం’ అనే నినాదాలను ఇస్తున్న మోదీ దాన్నే ప్రపంచానికి అతికించారు. విభిన్న సామాజిక, ఆర్థిక వ్యవస్థలు, అంతరాల ప్రపంచాన్ని ఒకే ప్రపంచంగా, ఒకే భవిష్యత్తుగా చూడాలని కోరుకొంటున్నారు.

మోదీ పరిభాషలో.. ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం అంటే.. ఇప్పుడు దేశంలో అమలవుతున్న ఆదానీ, అంబానీ కుటుంబాల ప్రగతిలాగా అన్నమాట! ఒకే కుటుంబం, ఒకే ప్రపంచం అనే ముందు, మనది ఒకే దేశంగా మనగలగటానికి భిన్నత్వంలో ఏకత్వాన్ని గౌరవించే పరిస్థితులుండాలి. భిన్న సంస్కృతులను ప్రేమించాలి. ఇవన్నీ చేయకుండా అసహన, ఆధిపత్య విధానాలను అనుసరిస్తూ.. ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనటం వికృతమే.

Updated On 10 Jan 2023 12:38 PM GMT
krs

krs

Next Story