Nitin Gadkari ప్రజాసేవ, అభివృద్ధి ఆధారంగానే ఓట్లు అడుగుతా.. మోడీ-షాల విద్వేష రాజకీయాలకు విరుద్ధంగా గడ్కరీ వ్యాఖ్యలు కర్ణాటక ఫలితాల తర్వాత కమలం పార్టీలో మారుతున్న సీనియర్ల స్వరం విధాత: 2014 ఎన్నికలకు ముందు నరేంద్రమోడీకి బీజేపీ ప్రచార బాధ్యలు అప్పగించడం, ఆయనే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల్లో చీలిక వచ్చింది. నితీష్‌కుమార్‌, నారా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లు మోడీ అభ్యర్థిత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. ఫలితాల అనంతరం రాజకీయ అవసరాలు, ఇతర కారణాలతో తిరిగి […]

Nitin Gadkari

  • ప్రజాసేవ, అభివృద్ధి ఆధారంగానే ఓట్లు అడుగుతా..
  • మోడీ-షాల విద్వేష రాజకీయాలకు విరుద్ధంగా గడ్కరీ వ్యాఖ్యలు
  • కర్ణాటక ఫలితాల తర్వాత కమలం పార్టీలో మారుతున్న సీనియర్ల స్వరం

విధాత: 2014 ఎన్నికలకు ముందు నరేంద్రమోడీకి బీజేపీ ప్రచార బాధ్యలు అప్పగించడం, ఆయనే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల్లో చీలిక వచ్చింది. నితీష్‌కుమార్‌, నారా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లు మోడీ అభ్యర్థిత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. ఫలితాల అనంతరం రాజకీయ అవసరాలు, ఇతర కారణాలతో తిరిగి మోడీతో కలిశారు.

మోడీ అభ్యర్థిత్వం, ఆయన విధానాలనుప్రత్యక్షంగా విభేదించకున్నా.. బీజేపీ సిద్ధాంతాలతో పనిచేసిన ఆపార్టీ సీనియర్లు అంతా అసంతృప్తితో ఉన్నమాట వాస్తవమే. అందుకే వాజపేయితో సాన్నిహిత్యం ఉన్నవారు, అద్వానీ రథయాత్రలో ముందుండి నడిచిన వారికి, రామజన్మభూమి కోసం ఉధృతంగా పోరాడిన వారికి పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయింది.

వాజపేయి ప్రభుత్వంలో వెలుగు వెలిగిన యశ్వంత్‌ సిన్హా, మురళీ మనోహర్‌జోషి, ఉమాభారతి లాంటి వాళ్లు మోడీ-షాలు అనుసరిస్తున్న రాజకీయ విధానాలను అంగీకరించలేక, రాజీ పడలేక దూరంగా ఉన్నారు. యశ్వంత్‌ సిన్హా, వాజపేయికి రాజకీయ సలహాదారుడిగా ఉన్న సుధీంద్ర కులకర్ణి లాంటి వాళ్లు మోడీ వైఖరిపై నేరుగా విరుచుకు పడుతున్నారు. బీజేపీతో దశాబ్దాల కాల అనుబంధం ఉన్న సత్యపాలిక్‌ మాలిక్‌ లాంటి వాళ్లు మోడీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే ఏం జరుగుతున్నదో చూస్తున్నాం.

ఈ నేపథ్యంలోనే బీజేపీ సిద్ధాంతాలకు కట్టబడి ఉన్నప్పటికీ, రాజకీయ కక్ష సాధింపులకు దూరంగా సౌమ్యుడిగా పేరొందిన నితిన్‌ గడ్కరీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. '2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు తాను చేసిన సేవ ఆధారంగానే ఓట్లు గెలుచుకుంటానని, పోస్టర్లు, బ్యానర్లు పెట్టబోడనని, ఓటర్లకు టీ కూడా ఇవ్వను. ఓటు వేయాలనుకున్న వాళ్లు వేస్తారు. వద్దనుకున్నవారు వేయరు. ప్రజాసేవ, అభివృద్ధి తదితర అంశాల ఆధారంగానే ఓట్లు గెలుచుకోవాలని' గడ్కరీ అన్నారు.

ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతిపక్ష నేతలపైనే కాదు, బీజేపీ భావజాలంతో సుదీర్ఘకాలం పార్టీలో పనిచేసిన వారిపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరుగుతున్న సమయంలో గడ్కరీ ప్రజాసేవ, అభివృద్ధి ఆధారంగా ఓట్లు అడుగుతానని చెప్పడం… మోడీ-షా, యోగీ, హిమంత బిశ్వశర్మ తదితరులు ఎన్నికల సమయంలో అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉండటం గమనార్హం.

కర్ణాటక ఫలితాలు కమలనాథులకు షాక్‌ ఇవ్వడమే కాదు, ఆ పార్టీలో అంతర్గతంగా దీనిపై చర్చ జరుగుతున్నదనే దానికి గడ్కరీ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అని ప్రచారం చేసుకునే బీజేపీ దేశంలోని మొత్తం రాష్ట్రాల్లో స్పష్టమైన మెజారిటీ సాధించింది ఆరేడు రాష్ట్రాల్లోనే. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, త్రిపుర, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌ తదితర రాష్ట్రాల్లోనే ఆపార్టీకి ప్రజలు పట్టగట్టారు. మధ్యప్రదేశ్‌లో ఎలా అధికారంలోకి వచ్చిందో చూశాం. గో

వాలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీకి ఒక్క సీటుకు దూరంగా ఉన్నా విపక్ష పార్టీల నేతలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రజలు అధికారం ఇచ్చిన రాష్ట్రాల కంటే గత తొమ్మిదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం కూలగొట్టిన రాష్ట్ర ప్రభుత్వాలే ఎక్కువగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ విధానాలే పార్టీలోని కొంతమంది సీనియర్లకు నచ్చడం లేదు. చేసి అభివృధ్ది గురించి ఎన్నికల్లో ప్రచారం చేయకుండా బజరంగ్‌దళ్‌, ది కేరళ స్టోరీ, మతం, కులం వంటి అంశాలను ప్రచారం చేసి అధికారంలోకి రావాలనే ప్రయత్నాలను కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారు.

అందుకే ఎన్నికల్లో ప్రజాసేవ, అభివృద్ధి వంటి అంశాలకు ప్రజలు ప్రాధాన్యం ఇస్తారని, రాజకీయ లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొట్టే భావోద్వేగాలను పట్టించుకోరని రుజువు కావడంతో గడ్కరీ లాంటి వాళ్లు అదే విషయాన్ని తన తాజా వ్యాఖ్యాల ద్వారా పరోక్షంగా చెప్పారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోడీ-షాల విద్వేష, విభజన రాజకీయాలతో రానున్న రోజుల్లో పార్టీకి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయే గాని ప్రయోజనం ఉండదనేది గుర్తించుకోవాలంటున్నారు.

Updated On 17 May 2023 11:36 AM GMT
Somu

Somu

Next Story