Gadwal | ఒకప్పుడు గద్వాల కోట.. కాంగ్రెస్ కు కంచుకోట గత ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి బీఆర్ఎస్ త్రిముఖ పోటీలో గెలుపెవరిదో.. గద్వాల రాజకీయం రసవత్తరం విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: నడిగడ్డ రాజకీయం రసవత్తరంగా మారనుంది. ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట గా ఉన్న గద్వాల నియోజకవర్గంలో, గత ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ విజయ బావుటా ఎగురవేసింది. గతంలో ఇక్కడ […]

Gadwal |

  • ఒకప్పుడు గద్వాల కోట.. కాంగ్రెస్ కు కంచుకోట
  • గత ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి బీఆర్ఎస్
  • త్రిముఖ పోటీలో గెలుపెవరిదో..
  • గద్వాల రాజకీయం రసవత్తరం

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: నడిగడ్డ రాజకీయం రసవత్తరంగా మారనుంది. ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట గా ఉన్న గద్వాల నియోజకవర్గంలో, గత ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ విజయ బావుటా ఎగురవేసింది. గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కి పెద్ద దిక్కుగా ఉన్న డీకే సమరసింహారెడ్డి ఎదురు లేని నాయకునిగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రి పదవి చేపట్టిన ఆయన హయాంలోనే గద్వాల ఎంతో అభివృద్ధి చెందింది.

అనంతరం రాష్ట్రంలో టీడీపీ హవా కొనసాగడం, సమరసింహా రెడ్డి సోదరుడు డీకే భరత సింహారెడ్డి టీడీపీలో చేరడం చక చకా జరిగిపోయింది. తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమరసింహారెడ్డి కాంగ్రెస్ నుంచి, భరతసింహారెడ్డి టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. సోదరుల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఇందులో టీడీపీ విజయం పొందడంతో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన కాంగ్రెస్ పాతాళం లోకి వెళ్ళింది. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల నాటికి భరతసింహారెడ్డి భార్య డీకే అరుణ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు.

అభివృద్ధి ప్రధాతగా..

అరుణ రాజకీయాల్లోకి రావడంతో భరతసింహా రెడ్డి రాజకీయాలను వదిలివేసి భార్యకు మద్దతుగా నిలిచారు. అప్పటి నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో మంత్రిగా ఉన్న అరుణ, గద్వాల నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి ప్రధాతగా పేరు పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన అరుణ, 2018లో జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు.

ఇక్కడ విజయం పొందిన బీఆరెస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనూహ్యంగా తెర పైకి వచ్చారు. డీకే భరత సింహా రెడ్డి మేనల్లుడే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మొదటి నుంచి వారికి అనుచరునిగా ఉంటూ వచ్చిన కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యర్థిగా మారి తమకే పోటీ వచ్చి గెలుపొందడం డీకే వర్గం జీర్ణించుకోలేక పోయింది. అప్పటి నుంచి డీకే కుటుంబానికి బండ్ల కు దూరం పెరిగింది. డీకే అరుణ, కృష్ణమోహన్ రెడ్డి మధ్య రాజకీయ వైరం మొదలైంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన అరుణ బీజేపీలో చేరి జాతీయ నాయకురాలిగా ఎదిగారు.

ప్రస్తుతం ఆమె బీజేపీ నుంచి గద్వాల నియోజకవర్గంలో పోటీ చేస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఇక్కడ మూడు పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒకవేళ బీజేపీ నుంచి ఆమె మహబూబ్ నగర్ లోకసభ నుంచి పోటీ చేయాలని భావిస్తే, తన కూతురు స్నిగ్ధ రెడ్డిని గద్వాల నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సరితకే టికెట్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది.

ముగ్గురి ప్రచార సరళి పరిశీలిస్తే :

డీకే అరుణ : (బీజేపీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థి)

డీకే అరుణ గతంలో గద్వాల నియోజకవర్గంలో ఎదురు లేని నాయకురాలిగా పేరుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆమె హయాంలో గద్వాల ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందనే అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఉంది. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉండడంతో పార్టీకి ఉన్న పేరుపై కాకుండా, సొంత ఇమేజ్ ఆమెకు కలిసివస్తుందనే భావనలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు.

ఒకవేళ ఆమె కూతురు పోటీలో ఉన్నా అరుణ అండతోనే ఆమె గెలుపు సాధ్యమవుతుంది. ఆమె కూతురుకు సొంత ఇమేజ్ లేకున్నా అరుణ ఇమేజ్ తోనే ఆమె ఎన్నిక ల్లో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఏది ఏమైనా గద్వాల రాజకీయంలో తల్లీకూతురు ఎంత వరకు నెట్టుకొస్తారో చూడాలి.

బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (బీఆరెస్ అభ్యర్థి ):

2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అనూహ్యంగా తెర పైకి వచ్చి గద్వాల నియోజకవర్గంలో చరిత్ర సృట్టించిన ఘనత కృష్ణమోహన్ రెడ్డికి దక్కింది. డీకే అరుణని ఓడించి ఒక్కసారిగా పాపులర్ అయిన ఆయన గద్వాల రాజకీయంలో చక్రం తిప్పుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రకటించిన తొలి జాబితాలోనే చోటు దక్కించుకున్న నేత కావడంతో ప్రస్తుతం ప్రచారంలో అందరికంటే ముందుగా దూసుకెళుతున్నారు. ఆయన హయాంలో గద్వాల పెద్దగా అభివృద్ధి లేకున్నా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయనే నమ్మకంతో ఆయన ఉన్నారు. మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తాననే ధీమాలో ఆయన ప్రచారం సాగిస్తున్నారు.

సరిత (కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థి ):

ఇద్దరు ఉద్ధండ నేతలతో తలపడేందుకు సిద్ధమవుతున్న సరిత కొత్తగా అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. బీఆర్ఎస్ లో గద్వాల జడ్పీ చైర్ పర్సన్ గా ఉన్న సరిత, అక్కడి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో విభేదాలు రావడంతో పార్టీని వీడారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి గద్వాల నియోజకవర్గం నుంచి బరిలో ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఆమెకు కాంగ్రెస్ టికెట్ వస్తే పోటీ తీవ్రమవుతోంది.

ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, బీజేపీ నేత డీకే అరుణ తో పోటీ పడాలంటే ఎంతో కష్ట పడాల్సి ఉంటుంది. సరిత మాత్రం తమ కులం ఓట్లతో పాటు పార్టీ కి సంబంధించిన ఓట్లు ఉంటాయనే ధీమాలో ఉన్నారు. ఆమె సామాజిక వర్గానికి సంబంధం ఉన్న ఓట్లు సుమారు 43వేల పైనే ఉండడం ఆమెకు కలిసి వస్తాయనే యోచన లో ఉన్నట్లు తెలుస్తోంది. మూడు పార్టీ లు ఇక్కడ బలంగా ఉండడంతో నడిగడ్డలో పాగా వేసేదెవరో వచ్చే ఎన్నికల వరకు వేచిచూడాలి.

Updated On 4 Sep 2023 12:27 PM GMT
krs

krs

Next Story