Tuesday, January 31, 2023
More
  HomelatestHYD: గార్డెన్ల నిర్వహణలో అధికారులు, కాంట్రాక్టర్ల నిలువు దోపిడీ

  HYD: గార్డెన్ల నిర్వహణలో అధికారులు, కాంట్రాక్టర్ల నిలువు దోపిడీ

  • వర్టికల్ గార్డెన్లో వర్చువల్ దోపిడీ
  • పచ్చదనం పేరుతో పచ్చ నోట్ల పంపిణీ
  • అంచనాలు బారెడు చేతలు మూరెడు
  • కనీసం నీళ్లు పోయకుండానే లక్షలు కొట్టేస్తున్న కాంట్రాక్టర్లు..
  • అండగా నిలుస్తున్న అధికారులు
  • ఎంబీలు లేకుండానే బిల్లులు

  విధాత‌, హైద‌రాబాద్‌: న‌గ‌రంలో పచ్చదనం పెంచడం ఆ విభాగం పని.., అందమైన మొక్కలు పెంచడం ద్వారా సిటీ అందాలను మరింతగా పెంచాలి. అందుకోసం కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తోంది జిహెచ్ఎంసి. సిటీలో పలు ప్రాంతాల్లో థీమ్ పార్కులు, వర్టికల్ గార్డెన్స్ ఏర్పాటు ద్వారా సిటీకి ప్రత్యేక గుర్తింపు తెస్తున్నామంటున్నారు అధికారులు. మెయింటెనెన్స్ లో మాత్రం నిలువు దోపిడీకి తెర లేపారు ఆ అధికారులు.

  నెలల తరబడి మెయింటేనెన్స్ లేకున్నా, మొక్కలు ఎండిపోయినా పట్టించుకోవడం లేదు. పచ్చటి మొక్కల చాటున పచ్చనోట్ల దందాకు తెర లేపారు. బ‌ల్దియాలో పార్కుల మెయింటనెన్స్ ను పూర్తిగా కాంట్రాక్ట‌ర్ల‌కు అప్ప‌జెప్పి చేతులు దులుపుకున్నారు అధికారులు. ప్ర‌తి చిన్న ప‌నికి టెండ‌ర్లు పిలిచి ఆ ప‌నుల‌ను కాంట్రాక్ట‌ర్ల‌కు క‌ట్ట‌బెట్టేస్తున్నారు.

  అయితే కాంట్రాక్ట‌ర్లు ప‌నులు ఎలా చేస్తున్నారు? వర్క్ అగ్రిమెంట్ ప్రకారం ప‌నులు జ‌రుగుతున్నాయా లేదా అనే విష‌యాల‌ను అర్బన్ బయోడైవర్సిటీ అధికారులు గాలికి వ‌దిలేయడంతో కాంట్రాక్ట‌ర్లు ఇష్టం వ‌చ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పనులు చేస్తున్నారా లేదా చూడరు, బిల్లులు పెడుతున్నారా లేదా చూడరు అధికారులు.

  ఉదహరణకు నాగోల్ వద్ద మూసీ నదిపై ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్.. దీనిని ఏర్పాటు చేయడానికి ఎల్ నగర్ జోన్ కు చెందిన అర్బన్ బయోడైవర్సిటీ మూడు ధపాలుగా టెండర్లు పిలిచారు. ఒకే సారి నిర్ణయించిన ఈ పనికి మూడు సార్లు 8,262 చదరపు అడుగుల వర్టికల్ గార్డెన్ ఏర్పాటు కోసం దాదాపు రూ.90 లక్షలతో టెండర్లు ఆహ్వానించారు.

  నిర్మాణం చేసిన కొద్ది రోజుల్లోనే అందులో ఒకవైపు సగాని కంటే ఎక్కువ పోర్షన్ కూలిపోయింది. దానిని అలాగే గాలికి వదిలేశారు కాంట్రాక్ట‌ర్లు. నెల‌లు గ‌డుస్తున్నా అధికారులు సైతం దాని గురించి ప‌ట్టించు కోవ‌డం లేదు. దాని డిఫెక్ట్ లయబిలిటి పట్టించు కోకుండానే బిల్లులు మాత్రం అన్ని చెల్లించారు.

  ఇక కొన్ని నెలలు అలాగే మెయింటెనెన్స్ చేసిన అధికారులు.. ఈ ఏడాది ప్రారంభంలో 6 వేల 20 చదరపు ఫీట్లకు ఏడాది పొడవునా మెయింటనెన్స్ చేయ్యడానికి జీఎస్టీతో కలపి రూ.20 లక్షల 23 వేలకు ఒక ప్రైవేటు ఏజెన్సీకి పనులు అప్పజెప్పారు ఎల్బీనగర్ జోనల్ బయోడైవర్సిటీ అధికారులు. అంటె నెలకు ఒక లక్ష 68 వేల రూపాయలు చెల్లిస్తున్నారు.

  పర్యవేక్షణ అంతా అస్తవ్యస్తం. ఎక్కడ పడితే అక్కడ చెట్లు పాడయ్యాయి. కనీసం నీళ్లు కూడా పోసే దిక్కు లేక చెట్లు ఎండిపోతున్నాయి. బూజు పట్టి మధ్యలో చెట్లు చనిపోయాయి. చాలా వరకు బాక్స్ లలో మొక్కలు లేవు. లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్ నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదు.

  వర్టీకల్ గార్డెన్ నిర్వహణ విషయంలో సంబంధిత అధికారులను అడిగితే అంతా బాగుందని సమాధానం ఇస్తున్నారు. దీని నిర్వహణను కాంట్రాక్టర్ గాలికి వదిలేసినా పట్టించుకోని అధికారులపై స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. చనిపోయిన మొక్క‌ల‌ను రిప్లేస్ చేయడంతో పాటు వాటిని రెగ్యులర్ గా మెయింటనెన్స్ చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

  అయితే ఇక్కడ పనిచేస్తున్న‌ కార్మికులకు ప్రతి నెల 10వ తేదీలోగా ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించి అదికారులకు బిల్లులు పెట్టాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రతి నెలా బిల్లులు చెల్లించేందుకు మెజర్మెంట్ బుక్, ఎంబి బుక్ ను ప్రతి నెల 5వ తేదీలోపు డిప్యూటీ డైరెక్టర్ కు సమర్పించాల్సి ఉంటుంది. గార్డెన్ నిర్వహణ ఎందుకు గాలికి వదిలేశారని, 9 నెలలుగా కాంట్రాక్టర్ కార్మికుల ఈఎస్ఐ గానీ, మెజర్మెంట్ బుక్ గానీ ఎందుకు సమర్పించ లేదని అడిగితే ముఖం చాటేస్తున్నారు డిప్యూటీ డైరెక్టర్ రాజ్ కుమార్.

  అన్ని సక్రమంగా ఉన్నాయంటూనే వివరాలు మాత్రం చెప్పడం లేదు సదరు అధికారి. మొదటి సారి అప్పజెప్పిన మెయింటనెన్స్ అయిపోయిన తరువాత 9నెలల బిల్లులు, ఇప్పటి 9నెలల బిల్లులు ఒకేసారి చెల్లిస్తామంటూ చెప్పడం ఆయన గారికే చెల్లింది. అయితే కార్మికుల ఈఎస్ఐ, పీఎఫ్ విషయంలో ఎలా న్యాయం చేస్తారనేది సదరు అధికారికే తెలియాలి.

  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గ్రీనరీ డెవలప్మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ‌ పెట్టాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నా క్షేత్రస్థాయి అధికారుల చర్యలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఒక వైపు బల్దియా ఖజానా నుండి భారీగా ఖర్చు అవుతున్నా కొంతమంది అధికారుల, కాంట్రాక్టర్ల చర్యల కారణంగా లక్ష్యం పక్క దారి పడుతుంది. ఈ అంశంపై విజిలెన్స్ విచారణ జరిపి బల్దియా ఖజనాకు జరిగిన నష్టాన్ని రాబట్టడంతో పాటు కారణమైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular