విధాత: ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీమహావిష్ణువును ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తజనులు పులకించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సోమవారం వైష్ణవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుప్రసిద్ధ దివ్య క్షేత్రం యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చి అనుగ్రహించారు.
ఉదయం 6:48 గంటలకు యాదాద్రి ఆలయం ఉత్తర గోపురం ద్వారం గుండా లక్ష్మీ నరసింహుడిని దర్శనం చేసుకున్న భక్తులు గోవింద నామస్మరణతో, జై జై నరసింహ అంటూ హర్షద్వానాలతో భక్తి తన్మయత్వంలో పులకించారు. యాదాద్రి ఉత్తర ద్వార దర్శనం వేడుకల్లో దేవదాయ శాఖ ఎ. ఇంద్రకరణ్ రెడ్డి,జిల్లా మంత్రి జి. జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగడి సునీత, సీఎంవో ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఈవో గీత, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
అటు జిల్లాలోని మఠంపల్లి శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో మాజీ మంత్రి, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి దంపతులు ముక్కోటి ఏకాదశి వేడుకలకు హాజరయ్యారు. వెంకటాపురం శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ,నల్గొండ లోని సుప్రసిద్ధ రామాలయాలలో ముక్కోటి ఏకాదశి వేడుకలలో భక్తులు భారీగా పాల్గొని శ్రీవారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.
నల్గొండ రామాలయంలోని ముక్కోటి ఏకాదశి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హాజరయ్యారు. సూర్యాపేట, మిర్యాలగూడ, హుజూర్నగర్, దేవరకొండ, అర్వపల్లి, సుంకిశాలల్లోని శ్రీవారి ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా సాగాయి.