ముందుగా త‌ల్లిదండ్రుల‌కు పూజ‌లు.. ఆ త‌ర్వాత సాధ్విగా అడుగులు విధాత: నోట్లో బంగారు చెంచాతో పుట్టిన ఓ బాలిక సకల సౌకర్యాలు, సౌఖ్యాలను వదిలి సన్యాసం స్వీకరించింది. తొమ్మిదేండ్ల వయస్సులోనే సుఖ భోగాలను కాదనుకొని జైన సన్యాసినిగా మారింది. గుజరాత్‌ సూరత్‌లోని వజ్రాల వ్యాపారి ధనేశ్‌ సంఘ్వీ, అమూ దంపతులకు ఇద్దరు కూతుర్లు. వీరిలో పెద్ద కూతురు దేవాంశి సంఘ్వీ. చిన్న కూతురుకు నాలుగేండ్లు. ధ‌నార్జ‌న, విలాసాల‌ కోసం అడ్డ‌దారుల్లో రోజుకొక బాబా అవ‌తార‌మెత్తుతున్న రోజులివి… మ‌రి […]

  • ముందుగా త‌ల్లిదండ్రుల‌కు పూజ‌లు..
  • ఆ త‌ర్వాత సాధ్విగా అడుగులు

విధాత: నోట్లో బంగారు చెంచాతో పుట్టిన ఓ బాలిక సకల సౌకర్యాలు, సౌఖ్యాలను వదిలి సన్యాసం స్వీకరించింది. తొమ్మిదేండ్ల వయస్సులోనే సుఖ భోగాలను కాదనుకొని జైన సన్యాసినిగా మారింది. గుజరాత్‌ సూరత్‌లోని వజ్రాల వ్యాపారి ధనేశ్‌ సంఘ్వీ, అమూ దంపతులకు ఇద్దరు కూతుర్లు. వీరిలో పెద్ద కూతురు దేవాంశి సంఘ్వీ. చిన్న కూతురుకు నాలుగేండ్లు.

ధ‌నార్జ‌న, విలాసాల‌ కోసం అడ్డ‌దారుల్లో రోజుకొక బాబా అవ‌తార‌మెత్తుతున్న రోజులివి… మ‌రి అష్ట ఐశ్వ‌ర్యాల్లో పుట్టి పెరిగిన వ‌జ్రాల వ్యాపారి కూతురు దేవాంశి మాత్రం కోట్ల ఆస్తిని తృణ‌ప్రాయంగా వ‌దిలి 9 ఏళ్ల‌కే స‌న్యాన దీక్ష తీసుకొని ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌ను ఆలోచ‌న‌లో పడేసింది.

సూరత్‌లోని ధనేశ్‌ సంఘ్వీది దశాబ్దాలుగా వజ్రాల వ్యాపారం. ఎంతో పేరు ప్రఖ్యాతులున్న సంఘ్వీ డైమండ్‌ కంపెనీ వారిదే. సంపదకు కొదువ లేదు. అయినా.. ధనేశ్‌ సాధారణ నిరాడంబర జీవితం అవలంభిస్తాడు. నైతిక జీవితానికి ప్రాధాన్యమిస్తాడు. భౌతిక అవసరాలు, సుఖ భోగాలకు ప్రాముఖ్యత ఇవ్వని ఆయన కుటుంబ వాతావరణంలో పెరిగిన పెద్ద కూతురు దేవాంశి సహజంగానే దైవ భక్తిలో మునిగిపోయింది.

కుటుంబ వాతావరణం, నైతిక జీవనం, దైవ భక్తి కలగలిసిన జీవితం దేవాంశిది. పాఠశాల విద్యార్థిగా, చిన్న బాలికగా ఎన్నడూ దేవాంశి టీవీ చూడలేదు. హోటల్‌ తిండి ఎరుగదు. ఎప్పుడూ ఎక్కడా ఓ సినిమా కూడా చూసి ఎరుగదు. మాటలో, నడతలో సాధుత్వం తొణికిసలాడేది. ఆ కుటుంబ సంప్రదాయం ప్రకారం రోజు మూడు సార్లు పూజలు నిర్వహించేది. చదువులో కూడా చురుకు. ఐదు భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది.

ఈ క్రమంలోనే దేవాంశి తాను సన్యాసం స్వీకరిస్తానని తల్లిదండ్రులకు తెలిపి ఆ బాటలో నడవటానికి నిర్ణయించుకున్నది. తల్లిదండ్రులను ఒప్పించి దాని కోసం జైన సన్యాసినుల సహచర్యాన్ని ఎంచుకొని వారినే అనుసరించింది. వారితో కలిసి 700 కిలోమీటర్లు నడిచి సన్యాసత్వాన్ని స్వీకరించేందుకు అవసరమైన 367 ప్రాథమిక పూజా కార్యక్రమాలను నిర్వహించి.. సాధ్విగా మారింది.

ఆ క్రమంలో దేవాంశి నిర్వహించిన కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నవి. మొదటిదిగా తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజించింది. ఆ కార్యక్రమం సందర్భంగా.. పింక్‌ డ్రెస్సును ధరించి ముద్దొచ్చే చిన్నారిగా దేవాంశి తల్లిదండ్రులపై బియ్యం పోస్తున్న దృశ్యాలు చూసిన వారు కన్నీటి పర్యంతం అయ్యారు. చిన్నారి దేవాంశి త్యాగానికి జేజేలు పలికారు.

తొమ్మిదేండ్ల దేవాంశి.. సాధ్విగా మారే కార్యక్రమం సందర్భంగా.. సూరత్‌లో పెద్ద ఊరేగింపు నిర్వహించారు. అనేక ఏనుగులు, ఒంటెలు, గుర్రాలతో చేసిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకున్నది. ఈ సందర్బంగా.. ధవేశ్‌ సంఘ్వీ.. కుటుంబం అనేక దాన ధర్మాలు చేసింది. బట్టలు, ధాన్యం, వెండి నాణాలు ప్రజలకు పంచి పెట్టారు. భౌతిక భోగ భాగ్యాలను వీడనాడటానికి ప్రతీకగా బూరీ దానధర్మాలు చేశారు.

అనేక మంది జైనంకరులు, పూజారుల సమక్షంలో.. దేవాంశి జైన సన్యాసినిగా తెల్ల బట్టలు ధరించింది. ఆ సందర్భంగా.. తెల్లని బట్టల్లో దేవాంశి.. పాల పొంగులాంటి చల్లని నవ్వులు అందరినీ ఆలోచింప చేసింది. సర్వ సుఖాలను వదిలి సన్యాసం స్వీకరించిన దేవాంశిని కారణ జన్మురాలిగా చూస్తున్నారు. మొక్కులు సమర్పించుకొంటున్నారు. చిన్నారి దేవాంశి ఆశీర్వాదం పొందుతున్నారు.

Updated On 20 Jan 2023 3:30 AM GMT
krs

krs

Next Story