మూవీ పేరు: ‘గాడ్‌ఫాదర్’విడుదల తేదీ: 05, అక్టోబర్ 2022నటీనటులు: చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, సముద్రఖని, పూరి జగన్నాధ్, సునీల్, బ్రహ్మాజీ తదితరులుసంగీతం: ఎస్. థమన్సినిమాటోగ్రఫీ: నీరవ్ షాడైలాగ్స్: లక్ష్మీ భూపాల్ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్నిర్మాతలు: ఆర్.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్దర్శకత్వం: మోహన్ రాజా విధాత: ‘ఆచార్య’ సినిమాతో మెగా ఫ్యామిలీపై విమర్శల వర్షం కురిసింది. ఆ విమర్శలకు సమాధానం చెప్పాల్సిన టైమ్ ఇది. కానీ, ఆ సమాధానం కోసం చిరు ఎన్నుకున్న రీమేక్ మార్గంపై […]

మూవీ పేరు: ‘గాడ్‌ఫాదర్’
విడుదల తేదీ: 05, అక్టోబర్ 2022
నటీనటులు: చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, సముద్రఖని, పూరి జగన్నాధ్, సునీల్, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: ఎస్. థమన్
సినిమాటోగ్రఫీ: నీరవ్ షా
డైలాగ్స్: లక్ష్మీ భూపాల్
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాతలు: ఆర్.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్
దర్శకత్వం: మోహన్ రాజా

విధాత: ‘ఆచార్య’ సినిమాతో మెగా ఫ్యామిలీపై విమర్శల వర్షం కురిసింది. ఆ విమర్శలకు సమాధానం చెప్పాల్సిన టైమ్ ఇది. కానీ, ఆ సమాధానం కోసం చిరు ఎన్నుకున్న రీమేక్ మార్గంపై కూడా కొన్ని రోజులుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ చిత్రాన్ని చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. రీమేక్ చేస్తున్నారు ఓకే కానీ.. ఆల్రెడీ ఆ సినిమా తెలుగులో కూడా డబ్ కావడంతో.. ‘ఎందుకీ సినిమా?’ అని అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.

అలాగే ఆ సినిమాలో వివేక్ ఒబెరాయ్ చేసిన పాత్రకి సత్యదేవ్‌ని ఎన్నుకోవడం కూడా ఈ సినిమాపై నెగిటివ్ వార్తలకు కారణమైంది. ఇక ‘లూసిఫర్’ రీమేక్ అని పేరు వినబడిన తర్వాత ఓ ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ మారారు. చివరికి మోహన్‌రాజాని ఫైనల్ చేశారు. అయితే, ఈ సినిమాపై ఎవరెన్ని మాటలు మాట్లాడినా.. ఎంతగా విమర్శలు చేసినా.. చిరంజీవి మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించారు. ఖచ్చితంగా నా నిర్ణయం తప్పుకాదు అంటూ మీడియా వేదికగా ఆయన స్టాండ్‌ని తెలియజేశారు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌, నయనతార, పూరి జగన్నాధ్ వంటి ఆసక్తికరమైన తారాగాణం ఈ సినిమాలో భాగం కావడంతో.. సినిమాపై మంచి ఇంట్రస్టే క్రియేట్ అయింది. టీజర్‌తో డిజప్పాయింట్ అనేలా టాక్ వచ్చినా.. ట్రైలర్‌తో ఒక్కసారిగా ఈ సినిమా స్వరూపమే మారిపోయింది. ట్రైలర్.. సినిమాపై భారీ క్రేజ్‌కి కారణమైంది. మరి ఇన్ని విమర్శలు, అంచనాలు మధ్య నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పికెఆర్ (సిరివెన్నెల ఫేమ్ సర్వదమన్) సడెన్‌గా గుండెపోటుతో చనిపోవడంతో.. జన జాగృతి పార్టీలో చీలికలు మొదలవుతాయి. ఈ సమయంలో ఆయన కూతురు సత్యప్రియ (నయనతార)ను అడ్డుపెట్టుకుని.. ఆమె భర్త అయిన జయదేవ్ (సత్యదేవ్) సీఎం కావాలనుకుంటాడు. అతని వెనుక పెద్ద మాఫియా నడుస్తుంటుంది.

మరోవైపు ఇతర పార్టీలు కూడా సీఎం కుర్చీ కోసం ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేస్తుంటారు. ఇలాంటి సందిగ్ధ వాతావరణంతో వేడెక్కిన రాజకీయ చదరంగాన్ని సరిచేయడానికి కింగ్ మేకర్ బ్రహ్మ(చిరంజీవి) ఎంటరవుతాడు. అసలు బ్రహ్మ ఎవరు? చనిపోయిన ముఖ్యమంత్రికి, బ్రహ్మకి ఉన్న సంబంధమేమిటి? అతనంటే సత్యప్రియకు ఎందుకు పడదు? ముఖ్యమంత్రి మృతితో ఏర్పడిన పొలిటికల్ కుమ్ములాటని బ్రహ్మ ఎలా సాల్వ్ చేశాడు? ఈ రాజకీయ ఆటలో మసూన్ భాయ్ (సల్మాన్ ఖాన్) ఎలా భాగమయ్యాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

మొదటి నుంచి ఈ సినిమాపై చిరంజీవి ఎందుకింత స్ట్రాంగ్‌గా ఉన్నాడనేది సినిమా చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఒకే పాత్రలో బ్రహ్మ, గాడ్‌ఫాదర్‌గా చిరంజీవి చూపించిన వేరియేషన్స్ ఫ్యాన్స్‌నే కాదు.. ప్రేక్షకులను కూడా మెప్పిస్తాయి. ఆయనకి ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే అనేలా.. యాక్షన్ ఎపిసోడ్స్‌లో కూడా చిరంజీవి వావ్ అనిపిస్తాడు.

‘ఆచార్య’లో డైరెక్టర్ తప్పిదం ఏమిటో.. ఈ సినిమాలో చిరంజీవిని మోహన్ రాజా చూపించిన తీరును చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా కళ్లతో, కను సైగలతో చిరంజీవి ఈ సినిమాని నడిపించిన తీరు.. చిరు చెప్పినట్లుగా నిశ్శబ్ద విస్ఫోటనమే అని చెప్పొచ్చు. ఇక.. ఈ సినిమా విషయంలో ఎక్కువగా విమర్శలు వినిపించిన పాత్ర సత్యదేవ్‌ది. ఈ పాత్రకి ఆయనని చిరంజీవే కావాలని తీసుకున్నట్లుగా అనేక ఈవెంట్స్‌లో చెప్పారు. ఎందుకు సత్యదేవ్‌ని తీసుకున్నారో.. సినిమా చూస్తే తెలుస్తుంది.

సత్యదేవ్ కెరీర్‌లోనే ది బెస్ట్ క్యారెక్టర్ ఇది. ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిరు-సత్యదేవ్ ఎపిసోడ్స్ చూస్తున్న ప్రేక్షకులకు కిక్కిస్తాయి. ఇద్దరూ పోటాపోటీగా నటించారు. ఈ విషయంలో చిరు నిర్ణయం భేష్ అని చెప్పొచ్చు. చిరు చెల్లెలిగా నయనతార పాత్ర చక్కగా కుదిరింది. నయనతార కూడా ఆ పాత్రకు నటనతో వన్నె తెచ్చింది. సర్వదమన్‌కు పెద్దగా స్క్రీన్ స్పేస్ లేదు. సముద్రఖనికి మంచి పాత్ర పడింది.. ఒక రకపు విలనీతో సముద్రఖని ఆకట్టుకుంటాడు.

మురళీ మోహన్, మురళీ శర్మ, సునీల్, బ్రహ్మాజీ, గెటప్ శీను వంటి వారందరికీ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నప్పటికీ.. ఆ పాత్రల్లో వారు చక్కగా సరిపోయారు. అనసూయ, తాన్య రవిచంద్రన్, దివి.. వారికి ఇచ్చిన పాత్రల్లో మెరిపించారు. పూరి జగన్నాధ్ ఈ సినిమాకి మరో ఆకర్షణ. ఇక సల్మాన్ ఖాన్ పాత్ర కాస్త హెవీ అనిపించింది. చిరు-సల్మాన్‌లు కనిపించే సన్నివేశాలు ఈలలు వేయిస్తాయి. కానీ ఇంకాస్త వెరైటీగా సల్మాన్ పాత్రని డిజైన్ చేసి ఉంటే బాగుండేదనిపించింది. ఒరిజినల్ వెర్షన్‌లోది దించేసినట్లు అనిపించింది.

సాంకేతిక నిపుణుల పనితీరు:

వంక పెట్టడానికి అవకాశం లేకుండా సాంకేతిక నిపుణుల వర్క్ ఉంది. ముఖ్యంగా థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లింది. పాటలు కూడా బాగున్నాయి. మెయిన్ హైలెట్ డైలాగ్స్. లక్ష్మీ భూపాల్ రాసిన డైలాగ్స్ సూపర్బ్‌గా పేలాయి. ఈ సినిమాతో అతనికి స్టార్‌డమ్ వచ్చినట్లే. నీరవ్ షా కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి సీన్ రిచ్‌గా ఉంది.

ఎడిటింగ్, ఆర్ట్, ఫైట్స్ అన్నీ ఒకరిని మంచి మరొకరు అనేలా ఈ సినిమాకు పని చేశారనిపించింది. సాంకేతిక నిపుణులపరంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా ఉంది. ఇక దర్శకుడు ఈ సినిమాకు ఎన్నుకున్న ఆర్టిస్ట్‌లు, సాంకేతిక నిపుణులు.. పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమా కోసం ఒరిజినల్ స్ర్కిప్ట్‌కు ఆయన చేసిన మార్పులు కూడా.. సినిమా ఫ్లో పోకుండా చేశాయి. మోహన్ రాజా ఈ సినిమాని తెరకెక్కించిన తీరు.. అభిమానులనే కాకుండా ప్రేక్షకులను సైతం మెప్పిస్తుంది.

విశ్లేషణ:

మెగాస్టార్‌కి, మెగా ఫ్యాన్స్‌కి అర్జెంట్‌గా హిట్ కావాలి. ‘ఆచార్య’ తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన, వస్తున్న కామెంట్స్‌ని మెగా ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఆ కొరతని ఈ సినిమా తీర్చేసిందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఈ సినిమా ఉంది. ముఖ్యంగా దర్శకుడు ఈ సినిమాని మలిచిన తీరు, చిరంజీవి ఎలివేషన్స్‌పై పెట్టిన శ్రద్ధ హైలెట్ అని చెప్పుకోవాలి. ఈ లెక్కన చూస్తే.. అభిమానులు మోహన్‌రాజాకి గుడి కట్టేయడం ఖాయం.

ఒక్కో పాత్రని సినిమాలో పరిచయం చేసిన తీరు, ఆ పాత్ర నడిచే విధానం.. ప్రతీది అలరిస్తుంది. ఒరిజినల్ వెర్షన్ ఇంకా చూడని వారికైతే ఈ సినిమా ఇంకా మంచి కిక్కిస్తుంది. అలాగే సత్యదేవ్ పాత్ర‌ని మలిచిన తీరు, ఆ పాత్రకి సత్యదేవ్ పెట్టిన ప్రాణం కూడా అందరినీ మెప్పిస్తుంది. ఫస్టాఫ్ అంతా పొలిటికల్ ఎమర్జెన్సీ అనే రేంజ్‌లో సాగగా.. సెకండాఫ్‌లో సెంటిమెంట్ సీన్లతో మోహన్ రాజా ఈ చిత్రాన్ని మలిచారు.

ఇంకా ఎమోషన్స్‌పై దర్శకుడు దృష్టి పెట్టి ఉండాల్సింది. అక్కడక్కడా ల్యాగింగ్ సీన్స్‌తో పాటు స్లోగా కథ నడుస్తుంది. ఇవి మినహా.. ఈ సినిమాకి మైనస్‌లుగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలలో హీరో ఎలివేషన్స్‌ ఏ విధంగా ఉంటున్నాయో.. అవి ప్రేక్షకులను ఎలా అలరిస్తున్నాయో.. గమనించిన దర్శకుడు వాటిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు.

మరీ ముఖ్యంగా చిరంజీవిని ఇంత క్లోజప్ షాట్స్‌లో ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలలో అయితే చూడలేదు. పైన చెప్పుకున్నట్లుగా ఎక్కువగా మ్యానరిజమ్స్‌తోనే సినిమాని నడిపాడు. అవన్నీ ఫ్యాన్స్‌కి పండగలా ఉంటాయి. డైలాగ్స్ కూడా ఈ సినిమాకి హైలెట్. జనసేన పార్టీకి ఉపయోగపడేలా కొన్ని సీన్లు ఇందులో ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. మెగా ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది. పండగ కూడా కలిసి వచ్చింది కాబట్టి.. బాస్ సినిమాకి హిట్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ కలెక్షన్ల సునామి ఎలా ఉంటుందో.. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసే ఛాన్స్ ఉంది.

ట్యాగ్‌లైన్: బాస్ ఈజ్ బ్యాక్.. మా(బా)స్ ఫీస్ట్
రేటింగ్: 3.25/5

Updated On 5 Oct 2022 9:17 AM GMT
krs

krs

Next Story