- సరికొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేశామన్న సంస్థ
- ప్రజాభిప్రాయ సేకరణకు బీటా వెర్షన్
విధాత : సరికొత్త ఫీచర్లతో తమ చాట్ బోట్ బార్డ్ (Google AI Chatbot)ను అప్‌డేట్ చేశామని గూగుల్ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలోనే బార్డ్ మొదటి వెర్షన్‌ను విడుదల చేయగా.. దానిని యూఎస్, యూకేల్లో కొంత మందికే అందుబాటులో ఉంచింది. తాజాగా భారత్‌తో సహా 180 దేశాల్లో బార్డ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని గూగుల్ వెల్లడించింది.
అయితే ఇది బీటా వెర్షన్ మాత్రమేనని ప్రజల నుంచి వచ్చే విస్తృత అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఫైనల్ వెర్షన్‌కు మరిన్ని మెరుగులు పెడతామని సంబంధిత ప్రతినిధులు వెల్లడించారు. ప్రస్తుతం విడుదలైన తాజా బార్డ్ బీటా వెర్షన్ జపనస్, కొరియన్ భాషల్లోనూ అందుబాటులో ఉంది.
మరింత శక్తిమంతంగా..
బార్డ్ రూపకల్పనలో అత్యంత శక్తిమంతమైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అయిన పీఏఎల్ఎం 2ను ఉపయోగించామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ విడుదల చేసిన నోట్‌లో పేర్కొన్నారు. ఈ మార్పు వల్ల బార్డ్ మరింత విజువల్ గా మారనుంది. ఒక వేళ మీరు భారత్‌లో చూడదగిన ప్రదేశాలు ఏవి అని అడిగితే… దాని సమాధానాలు పదాల రూపంలోనే కాకుండా ఆయా ప్రదేశాల ఫొటోలను, వీడియోలను సైతం అందిస్తుంది.
అంతేకాకుండా రెండు కుక్క పిల్లల ఫొటోను బార్డ్‌కు ఇచ్చి ఒక ఫన్నీ క్యాప్షన్ రాయమంటే.. గూగుల్ లెన్స్‌ను అదే ఉపయోగించుకుని మనకు క్యాప్షన్ ఇస్తుంది. ముందుగానే చెప్పినట్లు బార్డ్‌తో కోడింగ్ మరింత వేగంగా పొందవ్చని గూగుల్ మరో సారి తెలిపింది. ఇందులో పొందే కోడింగ్ ఎర్రర్ ఫ్రీగా, నిర్దిష్టంగా ఉంటుందని వివరించింది.