విధాత, నిజామాబాద్: రైతు పయ్యావుల రాములు ఆత్మహత్యకు ప్రభత్వమే కారణమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం ఆయన అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో రాములు కుటుంబాన్ని పరామర్శించారు.
అనంతరం నేరుగా కామారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతు రాములు చనిపోవడానికి పూర్తిగా ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రైతులకు ఇష్టం లేకున్నా వారి అభిప్రాయం తీసుకోకుండా భూములు తీసుకోడం ప్రభుత్వ ఏక పక్ష నిర్ణయమని, ఇది తగదని హితవు పలికారు.
అభివృద్ధి పేరుతో కేసీఆర్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందని విమర్శించారు. కామారెడ్డి జిల్లాలో మాస్టర్ ప్లాన్ పేరుతో రైతుల సారవంతమైన రెండు పంటలు పండే వ్యవసాయ భూములను తీసుకుంటున్నారని ఆరోపించారు. 8 గ్రామాల రైతులకు సంబంధించిన పచ్చని పంట పొలాల భూములు పరిశ్రమలు, నూతన రోడ్ల నిర్మాణానికి 2700 ఎకరాలు మాస్టర్ ప్లాన్ లో చేర్చారన్నారు.
ఈ భూములను మాస్టర్ ప్లాన్ లో చేర్చడం వల్ల రైతులకు జీవనాధారం లేకుండా అవుతుందని ఆవేదన చెందారు. తరతరాలుగా రైతులు ఈ భూములను నమ్ముకొని వ్యవసాయం చేస్తూ రెండు రకాల పంటలు పండిస్తున్నారని తెలిపారు. మాస్టర్ ప్లాన్ ద్వారా రైతుల బతుకులు అగమ్యగోచరంగా మారుతాయని, ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకొవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రైతుల పక్షాన కొట్లాడుతామని హెచ్చరించారు.
రాములు కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, రూ.50 లక్షల ఎక్సగ్రేసీయా, కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని కోదండరాం డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్, జిల్లా కన్వీనర్ లక్ష్మణ్ యాదవ్, రైతు విభాగం ఇన్చార్జ్ కంతి మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు రజినీకాంత్ నేత, బీసీ సంఘ నాయకుడు నాగరాజు పాల్గొన్నారు.