విధాత, బ్యూరో కరీంనగర్: పెద్దపల్లి(Peddapalli) జిల్లా ఓదెల(odel) మండలంలోని కనగర్తి(kanagarti) గ్రామపంచాయతీ సిబ్బంది(Gram panchayat staff)ఆదివారం బిక్షాటన చేశారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో గ్రామంలో వీధివీధినా తిరుగుతూ బిక్షాటన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని నెలల నుంచి తమకు జీతాలు రాకపోవడంతో పిల్లల చదువులకు ఫీజు కట్టలేక పోతున్నామని అన్నారు. నిత్యం గ్రామంలో మురికి కాలువలను శుభ్రం చేసే తాము అనారోగ్యలపాలై ఆసుపత్రికి వెళ్దాం అన్నా చేతిలో చిల్లి గవ్వ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికారులు, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మల్టీ పర్పస్ రద్దుచేసి తమ వేతనాలను మంజూరు చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో పైడిపల్లి నాగయ్య, చిటికేసు ప్రభాకర్, శనిగరపు బాపు, పైడిపల్లి సప్న, తాళ్లపల్లి శంకర్, రమేష్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.