Sunday, December 4, 2022
More
  Homelatestగ్రానైట్ కంపెనీల హ‌వాల దందా: ఈడీ

  గ్రానైట్ కంపెనీల హ‌వాల దందా: ఈడీ

  విధాత‌: తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు టీఆర్ఎస్ ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు చెందిన గ్రానైట్ కంపెనీల‌తో పాటు మ‌రికొన్ని కంపెనీల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్ట‌రేట్‌(ఈడీ) దాడులు నిర్వ‌హించిన‌ విష‌యం తెలిసిందే. గ్రానైట్ కంపెనీల కార్యాల‌యాలు, నివాసాల‌లో జ‌రిగిన సోదాల‌పై ఒక్క‌సారిగా రాజ‌కీయ వ‌ర్గాల‌లో క‌ల‌క‌లం రేపింది.

  ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో గ్రానైట్ కంపెనీల అక్ర‌మ వ్యాపారంపై ఆదారాల‌తో స‌హా న్యాయ‌వాది బేతి మ‌హేంద‌ర్‌రెడ్డి ఈడీకీ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న ఈడీ స‌ద‌రు కంపెనీలు చేసిన ఎగుమ‌తుల‌పై ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌( ఫెమా)కింద విచార‌ణ చేప‌ట్టింది. క‌రీంన‌గ‌ర్‌తో పాటు ఖ‌మ్మం జిల్లాలో గ్రానైట్ కంపెనీల‌పై రెండు రోజుల పాటు ఈడీ దాడులు నిర్వ‌హించి, ప‌లు రికార్డుల‌ను స్వాధీనం చేసుకుంది. ఈ సోదాల‌కు సంబంధించి శుక్ర‌వారం ఈడీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ జారీ చేసింది.

  ఈడీ అధికారులు, ఐటీ అధికారుల‌తో క‌లిసి గ్రూపులుగా ఏర్ప‌డి ఈ నెల 9,10 తేదీల‌లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వ‌హించింది. క‌రీంన‌గ‌ర్, ఖ‌మ్మం,హైద‌రాబాద్‌ల‌లోని శ్వేత గ్రానైట్స్‌, శ్వేత ఏజెన్సీస్‌, అర‌వింద్ గ్రానైట్స్‌, గిరిరాజ్ షిప్పింగ్ ఎజెన్సీస్‌, టీఎస్‌ఆర్ గ్రానైట్స్‌, శ్రీవెంక‌టేశ్వ‌ర గ్రానైట్స్‌ల‌తో పాటు మిగ‌తా సంస్థ‌ల కార్యాల‌యాలు, ఆయా సంస్థ‌ల య‌జ‌మానుల ఇండ్ల‌లో సోదాలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.

  సోదాల‌లో ల‌భించిన లావాదేవీల ప‌త్రాలు రికార్డుల ఆధారంగా ఫెమా ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు గుర్తించారు. ఈ కంపెనీలు చైనా, హాంకాంగ్ త‌దిత‌ర దేశాల‌కు గ్రానైట్ బ్లాక్‌ల‌ను ఎగుమ‌తి చేస్తున్నాయి. త‌క్కువ ప‌రిమాణానికి ప‌న్నులు చెల్లిస్తూ ఎక్కువ మొత్తంలో బ్లాక్‌లో గ్రానైట్ ఎగుమ‌తి చేసిన‌ట్లు ఈడీ త‌నిఖీల‌లో వెల్ల‌డైంది.

  ఎగుమ‌తి చేసిన గ్రానైట్ బ్లాక్‌ల‌కు బ్యాంక్ ఖాతాల ద్వ‌రా కాకుండా హ‌వాలా మార్గంలో డ‌బ్బులు వ‌సూలు చేసిన‌ట్లు ఈడీ సోదాల‌లో బ‌ట్ట‌బ‌య‌లైంది. సుమారు రూ. 1.08 కోట్ల ఎగుమ‌తుల ఆదాయాన్ని హ‌వాలా మార్గంలో తీసుకున్న‌ట్లు ఈడీ అధికారులు గుర్తించారు. గ్రానైట్ కంపెనీలు త‌మ వ‌ద్ద ప‌ని చేసే ఉద్యోగుల పేరుతో బినామీ బ్యాంకు ఖాతాలు తెరిచి, వాటి ద్వారా లావాదేవీలు నిర్వ‌హించారు.

  ఎలాంటి అనుమ‌తులు లేకుండా అగ్రిమెంట్లు లేకుండా హ్యాండ్‌లోన్ రూపంలో ఇత‌ర దేశాల నుంచి ఇండియా కంపెనీల‌కు డ‌బ్బులు తిరిగి మ‌ళ్లించ‌డాన్ని ఈడీ క‌నుగొన్న‌ది. సీన‌రేజ్ ఫీజు చెల్లించ‌కుండా ఎగుమ‌తులు చేస్తున్నార‌ని తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ గ‌తంలో ప్ర‌భుత్వానికి నివేదిక కూడ అంద‌జేసింది. కేసు ద‌ర్యాప్తు కొన‌సాగుతుంద‌ని ఈడీ ఆ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page