Thursday, March 23, 2023
More
    HomelatestGroom Ran Away। ట్రాఫిక్‌ జామ్‌.. కొత్త పెళ్లికొడుకు జంప్‌

    Groom Ran Away। ట్రాఫిక్‌ జామ్‌.. కొత్త పెళ్లికొడుకు జంప్‌

    • కొంతకాలంగా మాజీ ప్రేయసి వేధింపులు
    • ప్రైవేట్‌ వీడియోలు, ఫొటోలు బయటపెడతానని బ్లాక్‌మెయిల్‌
    • ఆందోళనతో నవ వరుడు పరార్‌

    Groom Ran Away । ట్రాఫిక్‌లో చిక్కుకోవడం అంటే నరకమే! అందులోనూ ప్రపంచంలోనే రెండో భారీ ట్రాఫిక్‌ జామ్‌ల నగరంగా పేరొందిన బెంగళూరు (Bengaluru’s notorious traffic) పరిస్థితి మరీ దారుణం. కానీ.. అంతటి భారీ ట్రాఫిక్‌ ఒక వ్యక్తి తన భార్య నుంచి పారిపోయేందుకు వరంలా దొరికింది. విచిత్రం ఏమిటంటే.. అతడికి ముందు రోజే పెళ్లయింది. ఎందుకు పారిపోయాడంటే.. సన్నిహితంగా గడిపినప్పుడు తీసుకున్న ఫొటోలు, వీడియోలు బయటపెడతానని మాజీ ప్రేయసి చేసిన బ్లాక్‌మెయిల్‌!!

    విధాత : కొత్త జంట.. ముందు రోజే పెళ్లయింది. పొద్దున్న చర్చికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఇంతలో బెంగళూరులోని మహదేవపుర (Mahadevapura) ప్రాంతంలో వారి కారు భారీ ట్రాఫిక్‌లో చిక్కుకున్నది. సందు చూసుకున్న వరుడు.. కారులోంచి జంప్‌ అయ్యాడు. ఛేజ్‌ చేసి పట్టుకుందామని భార్య ప్రయత్నించినా వీలు కాలేదు. దీంతో ఆమె విధిలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారైన కొత్త పెళ్లికొడుకు కోసం అన్వేషిస్తున్నారు.

    వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ 

    పోలీసులు, భార్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. చిక్‌బళ్లాపూర్‌ జిల్లా (Chikkaballapur district) చింతమణికి చెందిన విజయ్‌ జార్జ్‌ (పేరు మార్చాం) ఫిబ్రవరి 15న వివాహం (wedding)చేసుకున్నాడు. అయితే అతడికి పెళ్లికి ముందు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉన్నది. వారిద్దరూ సన్నిహితంగా గడిపినప్పడు తీసుకున్న వీడియోలు, ఫొటోలు బయటపెడతానని కొంతకాలంగా ఆమె బెదిరిస్తున్నది.

    ఈ విషయాన్ని తనకు పెళ్లికి ముందే చెప్పాడని విజయ్‌ భార్య చెబుతున్నది. ‘ఏమీ ఆందోళన వద్దు.. నేను, నా తల్లిదండ్రులు అండగా ఉంటాం’ అని ఆమె జార్జ్‌కు ధైర్యం చెప్పింది. పెళ్లియిన మరుసటి రోజు ఇద్దరూ చర్చ్‌కి వెళ్లి తిరిగి వస్తున్నారు. పాయ్‌ లేఅవుట్‌ (Pai Layout) వద్ద వారి కారు దాదాపు 10 నిమిషాలు ట్రాఫిక్‌లో ఆగిపోయింది. ఆ సమయంలో సందు చూసుకుని జార్జ్‌ డోరు తీసుకుని కారు దిగి పారిపోయాడు. బిత్తరబోయిన భార్య.. అతడిని ఛేజ్‌ చేసేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు.

    పెళ్లికి ముందే చెప్పాడు..

    తన తండ్రికి కర్ణాటక(Karnataka), గోవా(Goa)ల్లో మ్యాన్‌పవర్‌ ఏజెన్సీలు ఉన్నాయని, వాటి నిర్వహణలో తన తండ్రికి జార్జ్‌ సహకరించేవాడని అతడి భార్య తెలిపింది. గోవాలో పనిచేసే సమయంలో జార్జ్‌ అదే కంపెనీలో పనిచేసే డ్రైవర్‌ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె కూడా అదే ఆఫీసులో పనిచేసేదని చెప్పింది.

    ఈ సంగతిని గమనించిన జార్జ్‌ తల్లి గట్టిగా హెచ్చరించడంతో సంబంధం వదులుకుంటానని చెప్పాడని, కానీ.. వారి ఎఫైర్‌ అలానే కొనసాగిందని తెలిపింది. పెళ్లి చేస్తే ఇలాంటి పనులకు దూరంగా ఉంటాడని భావించిన తల్లి.. అతడికి పెళ్లి ఫిక్స్‌ చేసింది. ‘పెళ్లికి ముందే అతడు నాకు ఈ విషయాలన్నీ చెప్పాడు.

    ఇవన్నీ వదిలేస్తానని నాకు మాట ఇవ్వడంతో అతడిని పెళ్లి చేసుకునేందుకు నేను ఒప్పుకొన్నాను. కానీ.. అతడిని ఆమె బ్లాక్‌మెయిల్‌ (blackmail) వెంటాడింది.. అదే అతడు పారిపోయేందుకు కారణమైంది’ అని జార్జ్‌ భార్య చెప్పారు. అతడిలో బలవన్మరణ ధోరణి కూడా కనిపించిదని చెప్తూ.. ఎక్కడ ఉన్నా తన భర్త వెంటనే రావాలని దేవుడికి మొక్కుకుంటున్నది. మార్చి 5న ఫిర్యాదు నమోదైందని, అతడి కోసం వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular