- ఏఈ పరీక్షపై నిర్ణయం రేపు తీసుకుంటాం..
- సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం..
- మీడియా సమావేశంలో సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి విజ్ఞప్తి
విధాత: టీఎస్‌పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజీ(Paper leakage) వ్యవహారంలో వదంతులు నమ్మవద్దని సర్వీస్ కమిషన్ చైర్మన్(Chairman Service Commission) జనార్దన్‌రెడ్డి(Janardhan Reddy)విజ్ఞప్తి చేశారు. లీకేజీ వ్యవహారంపై ఆయన సర్వీస్ కమిషన్(Service Commission)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పందించారు. కమిషన్‌లో నమ్మిన వాళ్లే గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. దురదృష్టకరమైన వాతావరణంలో ప్రెస్ పెడుతున్నానని, వదంతులకు అడ్డుకట్ట వేసేందుకే ఈ సమావేశం అని తెలిపారు.
పరీక్ష ఒక రోజు పేపర్ లీకైనట్టు సమాచారం వచ్చింది
గ్రూప్ 1 పరీక్షలో దేశంలో ఎక్కడా లేనివిధంగా జంబ్లింగ్ విధానం తెచ్చాం. ప్రశ్నలు, సమాధానాలు మల్టిపుల్ జంబ్లింగ్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో అక్రమాలు జరగొద్దనే అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఇప్పటిదాకా 26 నోటిఫికేషన్లు ఇచ్చామని, ఇందులో 7 నోటిఫికేషన్లుకు సంబంధించి పరీక్షలు పూర్తయ్యాయి అన్నారు. 8వ నోటిఫికేషన్ టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సిస్. 175 పోస్టులకు సుమారు 33 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష ముందురోజు పేపర్ లీకైనట్టు సమాచారం వచ్చింది. వెబ్‌సైట్ నుంచి ఎవరో సమాచారం హ్యాక్ చేసి దుర్వినియోగం చేసినట్టు మా దృష్టికి వచ్చింది. సమాచారం రాగానే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
పరీక్ష రద్దు చేయాలా? వద్దా? అన్నది న్యాయ నిపుణుల సలహా మేరకే..
రాజశేఖర్ అనే నెట్‌వర్క్ ఎక్స్‌పర్ట్ దాదాపు ఆరేళ్లుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఇక్కడ పనిచేస్తున్నాడు. అతనికి ఐపీ అడ్రస్‌లు తెలిసే అవకాశం ఉన్నదని, ఆయన కీలక సమాచారం యాక్సెస్ చేసినట్టు తేలిందన్నారు. ఏఎస్‌వో ప్రవీణ్.. రాజశేఖర్ సాయంతో పేపర్లు సంపాదించాడు. ప్రవీణ్ దాన్ని దుర్వినియోగం చేసి రేణుక తదితరులకు చేరవేశాడు. పోలీసుల దర్యాప్తులో అన్ని వాస్తవాలు తేలుతాయి. 9 మంది నిందితులుగా తేలిన విషయం తెలిసిందే. ప్రవీణ్ రూ. 10 లక్షల కోసం పేపర్లు అమ్మాడని దర్యాప్తులో తెలిసింది. దీనిపై న్యాయ సలహా తీసుకుని పరీక్ష రద్దు చేయాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏఈ పరీక్షపై కూడా నివేదిక రావాల్సి ఉన్నది. చర్చించి రేపు నిర్ణయం తీసుకుంటామన్నారు.
గ్రూప్1 మెయిన్స్ యథాతథంగా నిర్వహించాలని నిర్ణయం
పేపర్ లీకేజీ వ్యవహారంపై సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. నా కుమార్తె గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిందని వదంతులు వచ్చాయి. నా పిల్లలు ఎవరూ గ్రూప్1 ప్రిలిమ్స్ రాయలేదని, వదంతులకు ఒక హద్దు ఉంటుందన్నారు. అలాగే ప్రవీణ్‌కు గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో 103 మార్కులు వచ్చిన మాట వాస్తవమేనని, ఆయన క్వాలీఫై కానిది కూడా వాస్తవమే అన్నారు. ఆయనకు వచ్చిన 103 మార్కులే అత్యధికం కాదన్నారు. ఈ కేసులో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు 5 గురు ఉన్నారు. వారిని ఉద్యోగాల నుంచి తొలిగిస్తామన్నారు. పూర్తి నివేదిక వచ్చాక అన్ని వాస్తవాలు తెలుస్తాయి. గ్రూప్ 1 మెయిన్స్ యథాతథంగా జూన్ 5 నుంచే నిర్వహించాలని నిర్ణయించామని జనార్దన్‌రెడ్డి తెలిపారు.