TSPSC | తెలంగాణ ప్రభుత్వంలో తొలిసారిగా నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు రెండు రోజుల్లో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ప్రిలిమినరీ ఫలితాల వెల్లడికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఓఎంఆర్ షీట్ల మూల్యాంకనం పూర్తయింది. ఓఎంఆర్ షీట్లను ఒకటికి రెండుసార్లు పరిశీలించిన అనంతరం.. ఫలితాల విడుదలకు టీఎస్పీఎస్సీ సిద్ధమైంది. ఈ క్రమంలో శుక్ర లేదా శనివారాల్లో ప్రిలిమినరీ ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఈ ఫలితాల వెల్లడితో పాటు మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. మెయిన్స్ ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నట్లు సమాచారం. యూపీఎస్సీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని, గ్రూప్-1 మెయిన్స్ తేదీలను ఖరారు చేయనున్నారు. ఒక వేళ సాంకేతిక సమస్యలు తలెత్తితే సోమవారం వెల్లడించే అవకాశం ఉంది.
ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను 1:50 నిష్పత్తిలో ప్రకటించనుంది. అంటే మెయిన్స్‌కు 25,150 మందిని ఎంపిక చేయనుంది. ఈ క్రమంలో మల్టీ జోన్లు, రిజర్వుడ్ వర్గాల వారీగా జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది టీఎస్పీఎస్సీ.
503 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా, 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 16న నిర్వహించిన ప్రిలిమినరీ ఎగ్జామ్‌కు 2,85,916 మంది హాజరయ్యారు. అక్టోబర్ 29న ప్రాథమిక కీ వెల్లడించి, అభ్యంతరాలను స్వీకరించింది. అభ్యర్థుల నుంచి వ్యక్తమైన సందేహాలపై సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సిఫార్సులు పరిశీలించి, 5 ప్రశ్నలను తొలగించారు. అనంతరం నవంబర్ 15వ తేదీన తుది కీని ప్రకటించారు. మాస్టర్ ప్రశ్నాపత్రం ప్రకారం 29, 48, 69, 82, 138 ప్రశ్నలను తొలగించింది.