- కలకలం సృష్టిస్తున్న విద్యార్థినుల ఆత్మహత్యలు
- మొన్న డాక్టర్ ప్రీతి నేడు ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత
- వరంగల్ జిల్లాలో వరుస సంఘటనలు
- అర్ధాంతరంగా ఆవిరవుతున్న పిల్లల భవిష్యత్తు,తల్లిదండ్రులకు కడుపుకోత
- చుట్టూరా పెరిగిన విలువల పతనం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కొత్త కొత్త కలలతో పెరిగిన బిడ్డలు, కోటి ఆశలతో పెంచుకున్న తల్లిదండ్రులకు గుండె కోత మిగుల్చుతున్నారు. ఓరుగల్లులో జరిగిన రెండు సంఘటనలు డాక్టర్ ప్రీతి, ఇంజనీరింగ్ విద్యార్థి రక్షిత ఆత్మహత్య (Sucide)కు పాల్పడిన ఉదంతాలు. వరంగల్ జిల్లాలో ఈ రెండు సంఘటనలు వేరువేరు జరిగినా, తాజాగా జరిగాయి. అయినప్పటికీ వీటిల్లో సారూప్యత ఉంది.
ఈ సంఘటనల్లో వేధింపులకు పాల్పడింది తమకు పరిచయమున్న విద్యార్థులు కాగా, బలైంది ఇద్దరూ విద్యార్థినులు కావడం గమనార్హం. ఇద్దరూ చదువుతున్నవి ప్రొఫెషనల్ కాలేజీలు (Professional institutes).
ఒకటి మెడికల్ కళాశాల, అయితే రెండోది ఇంజినీరింగ్ కళాశాల. ఇందులో ఒకటి ప్రభుత్వ విద్యా సంస్థగా, మరొకటి ప్రైవేటు విద్యాసంస్థ. అయినా వీరిద్దరూ ఆత్మహత్యచేసుకుని మృతిచెందారు.
ఇదిలా ఉండగా మరో సంఘటనలో హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి కి చెందిన ఉషారాణి భూపాలపల్లికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆత్మహత్యకు పాల్పడింది.
తాజాగా హైదరాబాద్ నార్సింగ్ శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న సాత్విక అనే ఇంటర్మీడియట్ విద్యార్థి క్లాసు రూమ్ లోనే ఉరి వేసుకు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన మన కళ్ళ ముందుంది.
- పెరుగుతున్న ఆత్మహత్యల సంస్కృతి
ఇటీవల ఆత్మహత్యల సంస్కృతి (Sucide culture) విపరీతంగా పెరుగుతూ సమాజానికి రుగ్మతగా మారింది. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు ఈ ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. ఆఖరికి నిరసన ఉద్యమాలలో కూడా ఆత్మహత్య ఒక పోరాట రూపంగా మారడం బాధాకరమైన విషయం.
ముఖ్యంగా మహిళలు, (womens) విద్యార్థినులు ఆత్మహత్యలను అత్యంత సులువుగా ఆశ్రయిస్తున్నారు. దీనికి వారిపై సాగుతున్న పెత్తనం, ఆధిపత్యం అణచిపెట్టాలనే ఎదుటి వ్యక్తుల విధానమే కారణమని చెప్పవచ్చు. తన తోటి విద్యార్థినిని సమాన భావంతో చూడాలని దృష్టి సమాజంలో రానురాను తగ్గిపోతుంది.
విద్యాసంస్థల్లో విలువలు మృగ్యం
సమాజంలో వేళ్ళూనుకున్న ఆధిపత్య సంస్కృతికి తోడు విద్య సంస్థల్లో మారిన కల్చర్, మానవీయ సంబంధాల లోపాల వల్ల పరిస్థితి దయనీయంగా మారింది. విద్యాసంస్థలు ఫక్తు ర్యాంకుల కేంద్రాలుగా, పోటీ నిలయాలుగా మారిపోయాయి.
మరీ ప్రైవేటు విద్యాసంస్థలు పెరిగిపోయిన తర్వాత ఈ పోటీ మరింత తీవ్ర రూపం దాల్చింది. విద్యార్థుల సామాజిక జ్ఞానం, సత్సంబంధాలు, విలువలు, మానవీయ నడవడిక తదితర అంశాలకు ఇక్కడ ప్రాధాన్యత లేకుండా పోయాయి.
కేవలం మార్కులు, కెరీర్ అనే అంశాలకి ప్రాధాన్యతనిస్తున్నారు. విద్యార్థుల మధ్య, విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహన కొరవడి పురుషాహంకారంతో చేసే వేధింపులు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. ఎన్నో కలలతో విద్య కోసం తమ ఉన్నతి కోసం విద్యాసంస్థల్లో చేరుతున్న విద్యార్థులు అర్ధాంతరంగా తమ ప్రాణాలు కోల్పోతున్నారు. వేధింపులకు పాల్పడి కేసుల్లో ఇరుక్కుని తమ బంగారు భవిష్యత్తును ఎదుటివారు సైతం కోల్పోతున్నారు.
- అంతరాలతో అన్ని సమస్యలు
ఏది ఏమైనా సమాజంలో (society) మన చుట్టూరా నెలకొన్న అంతరాల వాతావరణ ప్రభావం, టీవీలో, సినిమాలలో చూపెడుతున్న సంస్కృతి ప్రభావం, విద్యాసంస్థలలో పడిపోతున్న విలువలు, విద్యార్థి, ఉపాధ్యాయ మధ్య విలువల పతనం అన్నీ కలిసి వేధింపులు, ఆత్మహత్య ఘటనలకు కారణమవుతున్నాయి.
తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రాణాలు కోల్పోయే స్థితికి వచ్చినప్పుడే వెలుగులోకి వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వెలుగులోకి వచ్చినపుడు హడావుడి చేస్తూ ఆ తర్వాత విస్మరిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం తమ బాధ్యత నుంచి తప్పుకుంటోంది.
- మొన్న ప్రీతి నిన్న రక్షిత,రేపు మరొకరు
ప్రీతి మృతి సంఘటనంత సంక్లిష్టమైనది (critical) కాకపోయినప్పటికీ రక్షిత మృతి కూడా వేధింపులే కారణం కావడం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ తన హైస్కూలు సహ విద్యార్థులు అమెఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. రక్షిత చదివేది ఒక ప్రైవేట్ కాలేజీ కావడం గమనార్హం.
విద్యాసంస్థలలో విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెంపొందించాల్సి ఉండగా ప్రస్తుతం నెలకొంటున్న అసమ వాతావరణ ప్రక్షాళనకు ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థి ప్రతినిధులు, పోలీసులతో చేపట్టే సమ్మిళిత కార్యక్రమాలతో మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయం కూడా ఒకవైపు ఉంది. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఉన్నత విద్యకు రావడం అనేది ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని రావాల్సి ఉంటుంది. అలాంటి ఎదిగే కుసుమాలు మొగ్గలోనే రాలిపోవడం బాధాకరం.
అర్ధాంతరంగా ముగిసిపోతున్న బిడ్డల భవిష్యత్తు
తమ తోటి,పరిచయమున్న విద్యార్థులే వేధింపులకు (teasing) పాల్పడంతో విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన సంఘటనలు వేరువేరుగా జరిగినప్పటికీ వరంగల్ జిల్లాలో కలకలం సృష్టిస్తుంది.
ప్రొఫెషనల్ కాలేజీలలో, సమాజంలో,చుట్టూ వేళ్ళూనుకున్న ర్యాగింగ్ లేదా కల్చర్ పేరుతో సాగుతున్న వేధింపుల వల్ల విద్యార్థినులు బలైతున్నారు.
ఉన్నత స్థాయికి ఎదిగిన తమ బిడ్డల భవిష్యత్తు ఆకస్మికంగా ముగిసిపోతుంది. ఎన్నో కలలుగన్న తల్లిదండ్రుల ఆశలు అర్ధాంతరంగా ఆవిరవుతున్నాయి. నిన్న డాక్టర్ ప్రీతి ఈరోజు ఇంజనీరింగ్ అక్షిత ఆత్మహత్యలు తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి.
కళాశాలలో మన చుట్టూరా నెలకొన్న అసమానత, అసహజ వాతావరణం తాజా ఆత్మహత్యలు అద్దం పడుతున్నాయి. ఈ ఘటనలు వేరువేరుగా జరిగినప్పటికీ ఒక్కటే కావడం గమనార్హం. ఒక్క సంఘటన అనేక ప్రశ్నలు.. చిక్కుముడులు. రోజురోజుకు కేసు సంక్లిష్టం అయినా ఈ ఘటనల్లో అందరూ బాధితులే కావడం అత్యంత బాధాకరం. ముఖ్యంగా బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది.