విధాత: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో రగడ ఎందుకు జరుగుతున్నది? ఇరవై ఏడు సంవత్సరాలుగా అప్రతిహతంగా అధికార పీఠంపై ఉన్న కమలం కోటలు ఈసారి బద్దలు కాబోతున్నాయా? బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉన్నఅక్కడ ఈసారి ఆప్‌ ఎంట్రీతో బీజేపీ నేతలను కలవరానికి గురి చేస్తున్నదా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తున్నది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ ఈసారి ముక్కోణపు పోటీలో ఉండటంతో ఆందోళనకు గురౌతున్నది. […]

విధాత: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో రగడ ఎందుకు జరుగుతున్నది? ఇరవై ఏడు సంవత్సరాలుగా అప్రతిహతంగా అధికార పీఠంపై ఉన్న కమలం కోటలు ఈసారి బద్దలు కాబోతున్నాయా? బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉన్నఅక్కడ ఈసారి ఆప్‌ ఎంట్రీతో బీజేపీ నేతలను కలవరానికి గురి చేస్తున్నదా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తున్నది.

ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ ఈసారి ముక్కోణపు పోటీలో ఉండటంతో ఆందోళనకు గురౌతున్నది. కాంగ్రెస్‌, ఆప్‌లో తమ మ్యానిఫెస్టోలను విడుదల చేశాయి. లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు, ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతి లాంటి హామీ ఇస్తున్నాయి. అయితే వీటి ప్రభావం ఉంటుందనే ప్రధాని మోడీ కొంతకాలంగా ఉచిత పథకాలు అభివృద్ధి నిరోధకాలు అని ప్రచారం చేస్తున్నారు.

అంతేకాదు కేవలం మోడీ ఛరిష్మానే నమ్ముకున్న ఆ పార్టీ నేతలు ఈసారి 150 స్థానాలు సాధిస్తామని పైకి బీరాలు పలుకుతున్నారు. కానీ రెబల్స్‌ బెడద, ప్రభుత్వ వ్యతిరేకతతో అధికారంలోకి వస్తామా? అన్న సందేహం పార్టీ అగ్ర నాయకత్వాన్ని వేధిస్తున్నది. పార్టీ తరఫున టికెట్‌ దక్కని వారు స్వతంత్రంగా బరిలో నిలిచారు. వాళ్లు నామినేషన్‌ ఉపసంహరించుకునే ప్రయత్నించినా వినకపోవడంతో క్రమశిక్షణ చర్యల కింద 12మంది రెబల్స్‌పై బీజేపీ అధిష్ఠానం వేటు వేసింది. ఇందులో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి కూడా ఉండటం విశేషం.

ఇక అసలు విషయం ఏమిటి అంటే రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నారు. ఆయన ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. తాము అధికారంలోకి వస్తే రాజస్థాన్‌లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇక్కడ కూడా అమలు చేస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. 2018లో రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచినప్పటి నుంచి అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌ మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం విదితమే.

అయితే ఇటీవల స‌చిన్ పైల‌ట్ సన్నిహితుడు విజయ్‌ సింగ్‌ ఖైంస్లా బాంబు పేల్చారు. సచిన్‌ కష్టపడటం వల్లనే రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఆయనకు సీఎం బాధ్యలు అప్పగించాల్సిందే అని కరాఖండిగా చెప్పేశారు. ఇప్పటిదాకా ఎదురుచూశామని, ఇక వేచి చూసే ప్రసక్తే లేదని కాబట్టి పార్టీ నాయకత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు.

రాహుల్‌ జోడో యాత్ర సంద్భంగా హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రాహుల్‌ జోడో యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే సచిన్‌ పైలట్‌ ఖైంస్లా వ్యాఖ్యలకు విరుద్ధంగా స్పందించారు. యాత్రను అడ్డుకోవడానికి బీజేపీ ఎంత యత్నించినా విజయం సాధించలేదన్నారు.

అయితే అశోక్‌ గెహ్లాట్‌ సచిన్‌ పైలట్‌ను విశ్వాస ఘాతకుడిగా అభివర్ణించారు. సొంత పార్టీనే పడగొట్టేందుకు యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైలట్‌ సహా పలువురు ఎమ్మెల్యేలకు రూ.10 కోట్లు బీజేపీ ఇచ్చి నట్టు తన వద్ద ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. సీఎం వ్యాఖ్యలను ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సచిన్‌ పూనియా ఖండించారు.

అయితే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 102 మంది ఎమ్మెల్యేలలో ఎవరితోనైనా తన స్థానంలో భర్తీ చేసుకోవచ్చు. కానీ తిరుగుబాటు చేసిన వ్యక్తిని మాత్రం ఎప్పటికీ ముఖ్యమంత్రిగా అంగీకరించరన్నారు.

సీఎం మార్పు విషయంపై అశోక్‌ గెహ్లాట్‌ అధిష్ఠానం ఆగ్రహానికి గురై క్షమాపణలు చెప్పి సంగతి తెలిసిందే. విజయ్‌ సింగ్‌ ఖైంస్లా వ్యాఖ్యలను సచిన్‌ ఖండించారు. అలాగే గెహ్లాట్‌ లాంటి సీనియర్‌ నేతలు అలాంటి భాష వాడటం సరికాదన్నారు. కానీ అశోక్‌ గెహ్లాట్‌ మళ్లీ సచిన్‌పై తన అక్కసు వెళ్లగక్కడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్నది.. అదీ గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షేభానికి కారణం ఎవరు అన్నది పైలట్‌ ఇప్పటికే స్పష్టం చేశారు.

ఈ విషయంలో వారు విజయం సాధించలేన్నారు. ఈ ఉదంతంలో తమకు సంబంధం లేదంటున్న బీజేపీ అంతకు ముందు మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎలా కూలగొట్టిందో అందరికీ తెలుసు అని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే బీజేపీకి గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. అందుకే ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య విభేదాలను తనకు అనుకూలంగా మలుచుకుని రాజకీయ లబ్ధి పొందడానికి యత్నిస్తున్నదని అంటున్నారు.

Updated On 25 Nov 2022 9:38 AM GMT
krs

krs

Next Story