విధాత: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్(CM KCR) ప్రభుత్వంలో మహిళలకు సముచిత గౌరవ లభిస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) అన్నారు. బుధవారం నల్గొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 40 లక్షల మంది మహిళలకు ఆసరా పెన్షన్‌లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళ పక్షపాతిగా, బాలికల చదువుల కోసం గురుకుల పాఠశాలు, కాలేజ్‌లను ఏర్పాటు చేశారన్నారు.
మహిళ దినోత్సవం (Womens Day) సందర్భంగా పలు పీహెచ్‌సీ కేంద్రాల్లో కేవలం మహిళల కోసమే క్లినిక్‌లను, ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో రాజకీయ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్లు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనన్నారు. తెలంగాణలో మహిళలకు రక్షణ కోసం అద్భుతమైన చర్యలు తీసుకున్నారని, తెలంగాణలో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టడంలో పోటీ పడుతున్నాయి అన్నారు. గవర్నర్ (Governor) అంటే మాకు గౌరవం ఉందని, కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా ఆరోపణలు చేయడం సరిగా లేదన్నారు.
అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రగతి అద్భుతంగా ఉందని తన ప్రసంగంలో చెప్పిన గవర్నర్, బయట మాత్రం విమర్శలు చేయడం సహేతుకంగా లేదన్నారు. తెలంగాణ లో నేడు పలు రాజకీయ పార్టీల వ్యవహారం ఆక్షేపణీయంగా ఉందని, రాజకీయాలను బ్రష్టు పట్టిస్తున్నారన్నారు. విపక్ష నాయకులు రాబోయే యువతరంకి ఏం సందేశం ఇస్తున్నారో అర్ధం కావడం లేదని, నాయకుల భాష హుందాగా ఉండాలని, కాంగ్రెస్ నాయకులు బూతు పురాణాలు ఎత్తుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ పరుష పదజాలలతో కూడిన విమర్శలతో రాజకీయ విలువలను దిగజార్చడంతోపాటు తమను తాము ప్రజల్లో పలుచన చేసుకుంటున్నారన్నారు.