Gutta Sukhender Reddy విధాత: ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అతి కొద్దిమంది నేతల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) ఒకరు. పాలన, రాజకీయ రంగాలలో ప్రతి అంశంలోనూ సమగ్ర అవగాహన, సునిశిత పరిశీలన కనబరిచే గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం పంచాయతీ వార్డు మెంబర్ స్థాయి నుంచి మొదలై పార్లమెంటు సభ్యుడిగా సాగి.. ప్రస్తుతం రాష్ట్ర చట్టసభలలో ఒకటైన పెద్దల సభ శాసనమండలిని […]

Gutta Sukhender Reddy

విధాత: ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అతి కొద్దిమంది నేతల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) ఒకరు. పాలన, రాజకీయ రంగాలలో ప్రతి అంశంలోనూ సమగ్ర అవగాహన, సునిశిత పరిశీలన కనబరిచే గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం పంచాయతీ వార్డు మెంబర్ స్థాయి నుంచి మొదలై పార్లమెంటు సభ్యుడిగా సాగి.. ప్రస్తుతం రాష్ట్ర చట్టసభలలో ఒకటైన పెద్దల సభ శాసనమండలిని నడిపించే చైర్మన్ పదవి దాకా కొనసాగింది.

అన్ని కలిసొస్తే ఆయన చిరకాల వాంఛ మంత్రి పదవి కూడా దక్కి ఉండేది. సీఎం కేసీఆర్ కు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఆలోచన వచ్చి ఉంటే క్యాబినెట్ బెర్త్ రేసులో గుత్తా తప్పక ఉండేవారన్న ప్రచారం తరచూ వినిపిస్తుంటుంది.

గుత్తాకు ఉమ్మడి జిల్లా బిఆర్ఎస్ రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్ వద్ద ప్రత్యేక స్థానం ఉంది.
అంతటి అనుభవజ్ఞుడైన గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ గా తన ప్రోటోకాల్ పరిధిని, పరిమితుల గీతను దాటేసి తరచూ బిఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా మీడియా సమావేశాల్లో తన అభిప్రాయాలను వ్యక్తీకరిస్తూవస్తున్నారు.

రాజ్యాంగ పదవి అయిన మండలి చైర్మన్ హోదాలో ఉండి గుత్తా చేస్తున్న రాజకీయ విమర్శలపై పలు మార్లు ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా చివరగా ఆయన విజ్ఞతకే వదిలేశారు. ఇదంతా పక్కన పెడితే తొలిసారిగా గుత్తా సుఖేందర్ రెడ్డి మరో అడుగు ముందుకేసి బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా మిర్యాలగూడలో నిర్వహించిన ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధుల సభకు హాజరవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

అంతకు ఒకరోజు ముందు వరకు నల్లగొండ, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాల బిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశానికి తన మండలి చైర్మన్ ప్రోటో కాల్ మేరకు హాజరు కాలేనని చెప్పిన గుత్తా అకస్మాత్తుగా మిర్యాలగూడ నియోజకవర్గం పార్టీ ప్రజాప్రతినిధుల సభకు హాజరవ్వడం పార్టీ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది.

పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకే, స్థానిక శాసనసభ్యుడు ఎం. భాస్కరరావు ఆహ్వానం మేరకు గుత్తా మిర్యాలగూడ బిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సభకు హాజరైనట్లుగా తెలుస్తుంది. తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దించాలని నిర్ణయించిన సుఖేందర్ రెడ్డి పార్టీ కోసం మరోసారి ప్రోటోకాల్ గీత దాటారని భావిస్తున్నారు.

ఏది ఏమైనా చట్టసభల సీనియర్ సభ్యుడిగా అన్ని తెలిసిన సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) కారణం లేకుండా ఏమీ చేయరని, పార్టీ అధిష్టానం సూచన మేరకే ఆయన బిఆర్ఎస్ మిర్యాలగూడ ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరయ్యారని గులాబీ వర్గాల కథనం.

పార్టీ బాధ్యత నిర్వహణకే వచ్చాను: గుత్తా

శాసనమండలి చైర్మన్ గా ఉండి మిర్యాలగూడ బిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరవ్వడం పట్ల అదే సమావేశంలో తన ప్రసంగంలో గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. మండలి చైర్మన్ గా తాను పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే అవసరం లేనప్పటికీ, తాను బిఆర్ఎస్ బి ఫాం మీదనే ఎమ్మెల్సీగా ఎన్నికైనందున పార్టీ ప్రజా ప్రతినిధిగా నా బాధ్యత నిర్వర్తించడానికి ఈ సమావేశానికి హాజరైనట్లుగా వివరణ ఇచ్చుకొని, తన చర్యను గుత్తా సమర్ధించుకోవడం గమనార్హం.

Updated On 25 April 2023 9:07 AM GMT
Somu

Somu

Next Story