Hanumakonda
- పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
- ఏర్పాట్లు సమీక్షించిన ఎర్రబెల్లి, దాస్యం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్‌లో మంత్రి కెటిఆర్ పర్యటనను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు సూచించారు. బుధవారం హన్మకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్, ఒడితెల సతీశ్, డిసిసిబి చైర్మన్ మార్నేని రవిందర్ రావు, కుడా చైర్మన్ సుందర్ యాదవ్ తదితరులతో మంత్రి సమీక్షించారు.
ఈ నెల 5న వరంగల్ కు రాష్ట్ర మంత్రి కేటిఆర్ పర్యటనకు రానున్న సందర్భంగా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేటిఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఈ నెల 5వ తేదీన మంత్రి కేటిఆర్ ఉ.10 గంటలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు. మధ్యాహ్నం హనుమకొండ జిల్లాకు వస్తారని చెప్పారు హసన్ పర్తి కిట్స్ కళాశాలలో ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభిస్తారు.
బాలాజీ గార్డెన్స్ లో కేసిఆర్ కప్ ను విజేతలకు అందచేసి అనంతరం హనుమకొండ జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయాన్ని, తదుపరి హంటర్ రోడ్ లో సైన్స్ సెంటర్ ను ప్రారంభిస్తారు. నగరంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. సాయంత్రం సెయింట్ గ్యాబ్రిల్ స్కూల్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రసంగిస్తారు. కార్యక్రమాల విజయవంతానికి కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి నేతలకు విజ్ఞప్తి చేశారు.