- శోకసంద్రంలో దామరచెరువు
- కడసారి చూపుకోసం హైదరాబాద్ కు తరలివెళ్లిన గ్రామస్తులు
- అదిలాబాద్ ఉమ్మడి జిల్లా అటవీ శాఖ అధికారిగా పనిచేసిన హరినాథ్ రావు
విధాత, మెదక్ బ్యూరో: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మామ, ముఖ్యమంత్రి కేసీఆర్ వియ్యంకుడు మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువు గ్రామానికి చెందిన పాకాల హరినాథ్ రావు (73) గుండె పోటుతో మృతి చెందారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి(డి ఎఫ్ ఓ) గా పనిచేశారు.
హరినాథ్ రావు హైదరాబాద్ గచ్చిబౌలిలో కుమారుడు రాజేంద్ర ప్రసాద్ రావు వద్ద ఉంటున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనకు బుధవారం సాయంత్రం గుండెపోటు రావడంతో సమీపంలోని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స నిర్వహిస్తుండగా పరిస్ఠితి విషమించి గురువారం మధ్యాహ్నం మృతి చెందారు.
హరినాథరావు మృతి విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్, ఆయన భార్య శైలిమ,ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రికి వెళ్లారు. హరినాథరావు పార్థివదేహాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. హరినాథ్ రావు మృతదేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు.
కడసారి చూపుకోసం తరలివెళ్లిన గ్రామస్తులు
మృతి చెందిన పాకాల హరినాథ్ రావు చివరి చూపుకోసం రామాయంపేట మండలం దామర చెరువు గ్రామస్తులు, బంధువర్గం హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పాకాల హరినాథ్ రావుకు భార్య శశిరేఖ, ఇద్దరు కుమారులు రాజేంద్ర ప్రసాద్ రావు, శైలేందర్ రావు, కుమార్తె శైలిమ మంత్రి కేటీఆర్ భార్య.
శోకసంద్రంలో దామర చెరువు
మృతుడు హరినాథ్ రావు మృతి విషయం తెలుసుకున్న గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామస్తుల హరినాథ్ రావు తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా దామరచెరువు ఎంపీటీసీ పాకాల శేఖర్ రావు సంతాపం తెలిపారు.