Heart Attacks | మారుతూ వస్తున్న జీవనశైలి కారణంగా ఇటీవలకాలం గుండెజబ్బులు పెరుగుతున్నాయి. గతంలో 50 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే గుండె జబ్బులు వచ్చేవి. ప్రస్తుతం రెండు పదుల వయసులోనూ గుండెపోటు బారినపడి ప్రాణాలుకోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుండం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. సాధారణంగా పురుషుల్లోనే ఎక్కువగా హార్ట్ ఎటాక్ వస్తుండగా.. ప్రస్తుతం మహిళలో సైతం కేసులు పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి అనంతరం మహిళల్లోనూ ఈ సంఖ్య 35శాతం పెరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. తాను సైతం […]

Heart Attacks |
మారుతూ వస్తున్న జీవనశైలి కారణంగా ఇటీవలకాలం గుండెజబ్బులు పెరుగుతున్నాయి. గతంలో 50 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే గుండె జబ్బులు వచ్చేవి. ప్రస్తుతం రెండు పదుల వయసులోనూ గుండెపోటు బారినపడి ప్రాణాలుకోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుండం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.
సాధారణంగా పురుషుల్లోనే ఎక్కువగా హార్ట్ ఎటాక్ వస్తుండగా.. ప్రస్తుతం మహిళలో సైతం కేసులు పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి అనంతరం మహిళల్లోనూ ఈ సంఖ్య 35శాతం పెరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. తాను సైతం గుండెపోటు బారినపడ్డానని బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితసేన్ ప్రకటించింది. కన్నడ నటుడు విజయరాఘవేంద్ర భార్య స్పందన సైతం గుండెపోటుతోనే మృతి చెందింది. వీరిద్దరి వయసు 50లోపే కావడం గమనార్హం.
మధుమేహులకు ముప్పు ఎక్కువ..
సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు పలు లక్షణాలు కనిపిస్తాయి. వీటిని సరైన సమయంలో గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. గుండెపోటుకు ముందు సాధారణంగా ఛాతిలో నొప్పి వస్తుంది. అలాగే ఛాతి బిగుతుగా ఉండి ఊపిరానట్లుగా అనిపిస్తుంది. కొన్ని సమయాల్లో లక్షణాలు కూడా కనిపించకపోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
లక్షణాలు కనిపించిన సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మెడ, దవడ, భుజాలు, ఛాతీ భాగంలో నొప్పిగా ఉన్నా.. అసౌకర్యంగా అనిపించినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నా ఏమాత్రం అశ్రద్ధ వహించొద్దు.
అలాగే చేయి, చేతులు నొప్పిగా అనిపించినా.. వికారంగా ఉండి వాంతులు వచ్చినట్లు అనిపించినా.. కారణాలు లేకుండా చెమటలు పట్టినా, అలసట, నీరసం ఆవహించినా.. గుండెల్లో మంటగా ఉన్నా.. తిన్న ఆహారం జీర్ణం కాకపోయినా అప్రమత్తంగా ఉండాలని, ఇవన్నీ గుండెపోటుకు సంకేతాలని వైద్యులు పేర్కొంటున్నారు.
శారీరక శ్రమ చేయాలి..
సాధారణ మహిళలతో పోలిస్తే మధుమేహ వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే సాధరణ మహిళలతో పోలిస్తే మధుమేహులకు గుండెపోటు వచ్చే అవకాశం 50శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైనట్లు చెబుతున్నారు.
కొందరిలో సాధారణ లక్షణాలు కనిపిస్తాయని.. మరికొందరిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే చాపకింద నీరుల గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయి. ఒత్తిడి, ఆందోళనకు గురయ్యే మహిళలకు గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ, వ్యాయామం చేయకుండా ఎక్కువ సేపు ఉన్నచోటే కూర్చోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది.
అలాగే, మెనోపాజ్ వచ్చిన మహిళల్లో కూడా ఈస్ట్రోజన్ లెవల్స్ తగ్గిపోయిన సమయంలోనూ గుండెపోటు ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నది. మహిళలు గర్భం దాల్చిన సమయంలో హైబీపీ, మధుమేహం సమస్యలుంటే దీర్ఘకాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారు త్వరగా గుండెపోటుకు గురయ్యే అవకాశాలుంటాయి. ఈ క్రమంలో బరువును అదుపులో ఉంచుకోవాలి. ఇందుకు కోసం నిత్యం వ్యాయామం చేస్తుండడంతో పాటు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. వాటితో పాటు ఒత్తిడి, ఆందోళన నుంచి వీలైనంత త్వరగా బయటపడాలి.
