జీవనోపాధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం మహిళా కార్మికులకు ముప్పు 22 శాతం పని గంటలు కోల్పోనున్నపేద, కార్మికుల కుటుంబాలు తాజా అధ్యయనంలో వెల్లడి Heat waves | విధాత: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల కారణంగా వడగాడ్పులు పెరుగుతున్నాయి. ఇవి అల్పాదాయ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం, వారి జీవనోపాధికి ఎక్కువ ముప్పు కలిగిస్తున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల కార్మికుల పని గంటలు కూడా తగ్గుతున్నాయి. తద్వారా పేద, కార్మికుల కుటుంబాలు గణనీయంగా ఆదాయం […]

- జీవనోపాధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం
- మహిళా కార్మికులకు ముప్పు
- 22 శాతం పని గంటలు కోల్పోనున్నపేద, కార్మికుల కుటుంబాలు
- తాజా అధ్యయనంలో వెల్లడి
Heat waves |
విధాత: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల కారణంగా వడగాడ్పులు పెరుగుతున్నాయి. ఇవి అల్పాదాయ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం, వారి జీవనోపాధికి ఎక్కువ ముప్పు కలిగిస్తున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల కార్మికుల పని గంటలు కూడా తగ్గుతున్నాయి. తద్వారా పేద, కార్మికుల కుటుంబాలు గణనీయంగా ఆదాయం కోల్పోతున్నాయి.
కాగా.. 2050 నాటికి సగటు వేడి రోజుల సంఖ్య రెట్టింపు కానున్న నేపథ్యంలో దేశ జీడీపీపై కూడా ప్రభావం పడనున్నది. తీవ్ర వడగాడ్పుల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికులు కూడా ప్రతి ఏటా ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికాకు చెందిన అడ్రియన్-రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ రెసిలెన్స్ సెంటర్ నిర్వహించిన తాజా అధ్యయనంలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగనున్నాయి. విశ్వవ్యాప్తంగా వేడియుగం మొదలుకానున్నది. తక్కువ ఆదాయ కార్మికుల జీవన మనుగడకు వేడిగాలుల రోజులు ప్రమాదకరంగా మారనున్నాయి. ముఖ్యంగా మహిళలు, వారి జీవనోపాధిపై ఎక్కువ ముప్పు కలిగిస్తాయని అధ్యయనంలో వెల్లడైంది.
ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అట్టడుగు, పేదవర్గాల మహిళలు ఎక్కువగా ప్రభావితమవుతారని తెలిపింది. భారత్, అమెరికా, నైజీరియాలో మహిళలపై వడగాడ్పుల ప్రభావం ఆర్థిక, సామాజిక, భౌతికంగా కూడా ప్రభావం చూపనున్నది. 2050 నాటికి సగటు వేడి రోజుల సంఖ్య కనీసం రెట్టింపు అవుతుందని అధ్యయనం అంచనా వేసింది.
భారతదేశంలోని మహిళలు వేసవిలో వడగాడ్పుల్లో కారణంగా మధ్యాహ్నం వేళ పనిచేయలేదని పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా పనిగంటలు కోల్పోవాల్సి ఉంటుంది. దాదాపు ఐదో వంతు పనిగంటలను కోల్పోతారని అధ్యయన నివేదిక వెల్లడించింది.
తీవ్ర వేడి గాలులు కరువుతోపాటు గ్రామీణ పేదలకు ఉపాధిని దూరం చేస్తుంది. ఉపాధి కోసం కుటుంబాలు వలసలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ప్రపంచంలోని మహిళా జనాభాలో ఆరో వంతు కంటే ఎక్కువ మంది భారత్‌లో ఉన్నారు.
భారతదేశంలోని 30 ఏళ్ల వ్యవసాయ కార్మికురాలు సావిత్రి దేవి. ఆమె ఉత్తర ప్రదేశ్‌లోని వ్యవసాయ పొలాల్లో పనిచేస్తుంది. వేసవిలో 44 డిగ్రీల ఎండలోనూ పనిచేయడం వల్ల ఆమె ముక్కు నుంచి కొన్నిసార్లు రక్తం కూడా కారుతుంది. ఎండ నుంచి తమను కాపాడుకోవడానికి ఎన్ని చర్యలు చేపట్టినా ఎండదెబ్బకు గురి కాకతప్పదు.
అనారోగ్యం పాలై పనిగంటలు కోల్పోతుంది. ఇలా 2050 నాటికి దేశ మహిళలు తమ జీతంతో కూడిన పని గంటలలో 22 శాతం కోల్పోతారని సర్వే అంచనా వేసింది. ఇది భారతదేశ జీడీపీలో ఒక శాతం అవుతుంది. వ్యవసాయం, నిర్మాణం, ఇతర రంగాల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే మహిళల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
పెరుగుతున్న వడదెబ్బ మృతులు
మూడు దేశాల్లో వడదెబ్బ కారణంగా ఏటా 2,04,000 మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ జూన్‌లో భారతదేశంలో తీవ్రమైన వేడి కారణంగా 150 మందికి పైగా మరణించారు వారిలో ఉత్తరప్రదేశ్‌లో 68 మంది, బీహార్‌లో 44 మంది ఉన్నారు. 2004 నుంచి 2021 మధ్య, భారతదేశంలో వడగాడ్పుల మరణాలు కనీసం 55% పెరిగాయని ది లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది.
