Heath Streak | జింబాబ్వే మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ (49) ఈ రోజు కన్నుమూశాడు. ఆయన భార్య సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న హీత్ స్ట్రీక్ దక్షిణాఫ్రికాలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు హీత్ స్ట్రీక్ భార్య నదినే స్ట్రీక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆదివారం తెల్లవారుఝామున నా జీవితంలోని గొప్ప ప్రేమికుడు, అందమైన నా పిల్లల తండ్రి, నా ఇంటి నుంచి దేవదూతలతో […]

Heath Streak |
జింబాబ్వే మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ (49) ఈ రోజు కన్నుమూశాడు. ఆయన భార్య సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న హీత్ స్ట్రీక్ దక్షిణాఫ్రికాలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు హీత్ స్ట్రీక్ భార్య నదినే స్ట్రీక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆదివారం తెల్లవారుఝామున నా జీవితంలోని గొప్ప ప్రేమికుడు, అందమైన నా పిల్లల తండ్రి, నా ఇంటి నుంచి దేవదూతలతో వెళ్లాడు. అక్కడ ఆయన చివరి రోజులని గడపాలని కోరుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది.
కొద్ది రోజుల క్రితమే హీత్ స్ట్రీక్ చనిపోయాడని జోరుగా ప్రచారం జరిగింది. జింబాబ్వే మాజీ బౌలర్ హెన్రీ ఒలంగా చనిపోయినట్టు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో హీత్ స్ట్రీక్ మరణవార్త నిజమేననుకొని ప్రతి ఒక్కరు సంతాపం తెలిపారు.
అయితే స్ట్రీక్ బతికే ఉన్నాడని కాసేపటి తర్వాత ఒలంగానే మరో ట్వీట్‌లో తెలియజేయడం విశేషం. హీత్ స్ట్రీక్‌తో తాను చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్‌ను ఒలంగా తన ట్వీట్‌లో షేర్ చేస్తూ బ్రతికే ఉన్నట్టు తెలియజేశారు. దీంతో కంగారు పడ్డ అభిమానులు కొంత ఉపశమనం చెందారు.
అయితే ఈ రోజు ఉదయం హీత్ స్ట్రీక్ భార్యనే స్వయంగా తన భర్త చనిపోయినట్టు ప్రకటించడంతో క్రికెట్ లోకంతో పాటు ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రార్ధిస్తున్నారు. హీత్ స్ట్రీక్ 1993లో జింబాబ్వే క్రికెట్ జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. దాదాపు 12 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన హీత్ తన కెరీర్‌లో 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 216 వికెట్లు, వన్డేల్లో 239 వికెట్లు తీసాడు.
జింబాబ్వే తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఇప్పటికి కుడా హీత్ స్ట్రీక్ పేరిట ఉండడం గమనార్హం. హీత్ స్ట్రీక్ టెస్ట్, వన్డే ఫార్మాట్లలో కలిపి 4933 పరుగులు చేయడంతోపాటు 455 వికెట్లు తీశాడు. టెస్టులు, వన్డేల్లో వంద వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి జింబాబ్వే బౌలర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2005లో ఆటగాడిగా రిటైరయ్యాక హీత్ స్ట్రీక్ కోచింగ్ బాధ్యతలు అందుకున్నాడు.
బంగ్లాదేశ్ జాతీయ జట్టు బౌలింగ్ కోచ్‌గా తర్వాత ఆ జట్టుకు హెడ్ కోచ్‌గానూ వ్యవహరించాడు. అవినీతి కార్యకలాపాల్లో ప్రమేయం ఉందనే కారణంతో 2021లో ఐసీసీ అతడిపై 8 ఏళ్ల నిషేధం విధించడంతో హీత్ స్ట్రీక్ కెరియర్ అర్ధాంతరంగా ముగిసింది. కాగా, ఈ మాజీ క్రికెటర్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్ కి కూడా కోచ్‌గా వ్యవహరించాడు
