నష్టాల భర్తీకి 1,25,56,254 డొమొస్టిక్‌ విద్యుత్‌ కనెక్షన్ల నుంచి.. దాదాపు రూ. 3 వేల కోట్ల వసూళ్లకు భారీ ప్లాన్‌ నెలకు రూ.186 బిల్లుకు రూ.2696 ఏసీడీ చార్జీ విధింపు ఆందోళన బాట పట్టిన వినియోగదారులు విధాత: విద్యుత్‌ సంస్థలో పెరిగి పోతున్న నష్టాల భర్తీకి తెలంగాణ సర్కారు భారీ ప్లాన్‌ వేసింది. విద్యుత్‌ చార్జీలు పెంచితే ఆందోళనలు జరిగే ప్రమాదం ఉందని గమనించిన సర్కారు పెద్దలు ఏసీడీ చార్జీల పేరుతో వీర బాదుడు బాదుతున్నారు. ఇలా […]

  • నష్టాల భర్తీకి 1,25,56,254 డొమొస్టిక్‌ విద్యుత్‌ కనెక్షన్ల నుంచి..
  • దాదాపు రూ. 3 వేల కోట్ల వసూళ్లకు భారీ ప్లాన్‌
  • నెలకు రూ.186 బిల్లుకు రూ.2696 ఏసీడీ చార్జీ విధింపు
  • ఆందోళన బాట పట్టిన వినియోగదారులు

విధాత: విద్యుత్‌ సంస్థలో పెరిగి పోతున్న నష్టాల భర్తీకి తెలంగాణ సర్కారు భారీ ప్లాన్‌ వేసింది. విద్యుత్‌ చార్జీలు పెంచితే ఆందోళనలు జరిగే ప్రమాదం ఉందని గమనించిన సర్కారు పెద్దలు ఏసీడీ చార్జీల పేరుతో వీర బాదుడు బాదుతున్నారు. ఇలా దాదాపు రూ.౩ వేల కోట్ల వరకు ప్రజలను అనధికారికంగా వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఉత్తర విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎన్‌.పి.డి.సి.ఎల్‌) లో ఏసీడీ చార్జీలు విధించారు. కామారెడ్డి ప్రాంతంలో ఒక వినియోగదారుడికి రూ.186 విద్యుత్‌ బిల్లు రాగా, అదనంగా రూ. 2,696 లు ఏసీడీ పేరున వడ్డించారు. ఇలా ఒక్కో బిల్లుకు వేల రూపాయలు ఏసీడీ పేరుతో అధికంగా బిల్లులు వేసి వసూళ్లు చేయడానికి అధికారులు సిద్దమయ్యారు.

రాష్ట్రంలో 1,25,56,254 గృహ వినియోగ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. గృహ వినియోగ విద్యుత్‌ కనెక్షన్ల ద్వారా ఏసీడీ చార్జీల పేరుతో దాదాపు రూ. 3,000 కోట్లు వసూళ్లు చేయాలన్న లక్ష్యంతో విద్యుత్‌ సంస్థలు భారీ ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.

ఏసీడీ అంటే.. వార్షిక విద్యుత్‌ వినియోగ ధరావత్తు( డిపాజిట్‌) అంటారు. వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు భారీ ఎత్తున విద్యుత్‌ను వినియోగిస్తాయి. ఆయా సంస్థలు, పరిశ్రమలకు నెలకు లక్షల్లో విద్యుత్‌ బిల్లులు వస్తాయి. ఇలాంటి సంస్థలు పొరపాటున నష్టాల భారిన పడి బిల్లులు చెల్లించ లేనప్పుడు ఏసీడి డిపాజిట్ల నుంచి మినహాయించుకుంటారు.

ఈ పద్దతిని విద్యుత్‌ సంస్థలు గత కొంత కాలంగా అనుసరిస్తున్నాయి. కానీ మొదటి సారిగా ఏసీడీ పేరుతో గృహ వినియోగదారులపై భారం వేయడానికి అధికారులు సిద్దమయ్యారు. దీని ద్వారా భారీ ఎత్తున ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడానికి భారీ ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.

ఏసీడీ చార్జీలకు విద్యుత్‌ అధికారులు అందమైన నిర్వచనం ఇస్తున్నారు. మీరు వినియోగించే విద్యుత్‌ బిల్లులపై ఏడాది సరాసరిన రెండు నెలల విద్యుత్‌ బిల్లు మొత్తాన్ని డిపాజిట్‌ కింద తీసుకుంటున్నామని, దీనికి మీకు వడ్డీ కూడా ఇస్తామని అధికారులు చాలా అందంగా చెపుతున్నారు. ప్రతి నెల వినియోగించిన విద్యుత్‌కు బిల్లు చెల్లిస్తున్నప్పుడు అడిషనల్‌ డిపాజిట్‌ ఎందుకు అని ప్రశ్నిస్తే మీరు ఎప్పుడైనా బిల్లు చెల్లించక పోతే అందులో నుంచి మినహాయించుకుంటామంటున్నారు.

పైగా వీరు విద్యుత్‌ కనెక్షన్‌ వద్దను కుంటే మీ డిపాజిట్‌ మీకు ఇస్తామని కల్లబొల్లి కబుర్లు చెపుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఒక సారి ఇంటికి విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకున్న తరువాత ఆ ఇంటి కనెక్షన్‌ వద్దనుకునే యాజమానులు ఇప్పటి వరకు ఉన్నట్లు ఎక్కడా కనిపించ లేదు..

కానీ ఘనత వహించిన మన అధికారులు మీకు విద్యుత్‌ కనెక్షన్‌ వద్దనుకుంటే మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తాం కదా అని అంటున్నారు. అంటే బిల్లులు చెల్లించలేని ప్రజలు విద్యుత్‌ కనెక్షన్‌ను ఉపసంహరించుకోమని చెప్పకనే చెపుతున్నారన్న విమర్శలు ప్రజల నుంచి వెల్లు వెత్తుతున్నాయి.

తాము వినియోగిస్తున్న విద్యుత్‌కు బిల్లులు చెల్లిస్తున్నప్పుడు మళ్లి అదనపు డిపాజిట్‌లు ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పైగా బిల్లులు చెల్లించకపోతే ఇందులో నుంచి మినహాయించుకుంటున్నామని చెప్పడమంటే తెలంగాణ ప్రజలను ఈ సర్కారు అవమానిస్తున్నట్లేనని అంటున్నారు.

ప్రతి నెలా క్రమం తప్పకుండా విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నామని, అలాంటప్పడు బిల్లులు ఎగవేస్తారన్న సందేహాలు తెలంగాణ సర్కారు పెద్దలకు ఏవిధంగా వచ్చిందని అడుగుతున్నారు. తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా అదనపు డిపాజిట్ల పేరుతో అధికంగా వసూలు చేసే విద్యుత్‌ బిల్లులకు వ్యతిరేకంగా ప్రజలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపడుతున్నారు.

కామారెడ్డిలోని పలు గ్రామాల్లో ప్రజలు ఆందోళనలు చేపట్టారు. బుధవారం ఏసీడీ చార్జీలకు వ్యతిరేకంగా జగిత్యాలలో నిరసనలు చేపట్టారు. ఇలా అనేక గ్రామాల్లో ప్రజలు ఏసీడీ చార్జీలపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated On 26 Jan 2023 6:22 AM GMT
krs

krs

Next Story